ᐅలక్ష్యం
లక్ష్యం మహత్తరమైనది.
బృహత్తరమైన ప్రణాళికతో, అకుంఠిత దీక్షతో పరిశ్రమిస్తేనే ఎవరైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం సులభమే. అయితే, ఆ లక్ష్యాన్ని సాధించటానికి కఠోరదీక్షతో ముందుకు సాగాలి. మార్గంలో ఎత్తుపల్లాలుంటాయి. పూలతోపాటు ముళ్లూ ఉంటాయి. చిన్న చిన్న గెలుపులకు పొంగక, అప్పుడప్పుడు వెన్ను విరిచే అపజయాలకు కుంగక అప్రతిహతంగా ముందుకు సాగిపోతూనే ఉండాలి. మొక్కవోని మనోస్త్థెర్యాన్ని ప్రోది చేసుకుని ముందుకు అడుగులు వేయాలి. మనసే మనకు బాసటగా నిలిచి లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది.
లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కలిగే రకరకాల చాంచల్యాలనూ, వైరుధ్యాలనూ నియంత్రించుకుని అధిగమించగలిగే పరిణతిని సాధించగలిగిననాడు- ఎటువంటి అడ్డంకులూ మనల్ని ఆపలేవు. ఒక వృత్తిలో పరిపూర్ణతను సాధిద్దామని కొన్నాళ్ళు దానికి సంబంధించిన విద్యను అభ్యసించి, అర్ధాంతరంగా దాన్ని ముగించి, మరొక వృత్తికి సంబంధించిన విద్యను చేపట్టి, దాన్నీ మధ్యలో వదిలేసి వెళ్ళే వ్యక్తి మనోప్రవృత్తి- అతణ్ని ఎందులోనూ నిలకడగా ఉండనివ్వదు. 'స్థిరచిత్తుడు కానివాడు, సంకల్పసిద్ధి లేనివాడు ఎప్పటికీ ప్రయోజకుడు కాలేడు. జాతికి హితం చేయలేడు' అన్న స్వామి వివేకానంద పలుకులు ఎప్పటికీ శిరోధార్యాలు!
లక్ష్యం, గురి రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ లక్ష్యానికి సంబంధించి మహాభారతంలోని ఒక చిన్నఘట్టం అందరికీ ఆదర్శప్రాయమైనదే! పాండవులకూ, కౌరవులకూ విలువిద్యాభ్యాసానంతరం వారి నైపుణ్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు ఆచార్యుడైన ద్రోణుడు. దానికోసం భాసమనే ఒక పక్షిని కృత్రిమంగా రూపొందించి, ఒక చెట్టుకొమ్మ చివరగా దాన్ని కట్టి, అందరికీ చూపించి, 'రాజకుమారులారా! నేను చెప్పినప్పుడు మీ మీ ధనువులు ఎక్కుపెట్టి ఆ పక్షి తలను తెగ్గొట్టండి. నేను ఒక్కొక్కరినే ఆజ్ఞాపిస్తాను' అన్నాడు. ద్రోణుడు ముందుగా ధర్మరాజును పిలిచి 'ఓ ధర్మరాజా! చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షి తలను స్పష్టంగా చూశావా?' అని అడగగానే- చక్కగా చూశానన్నాడు ధర్మరాజు. 'చెట్టు మానును, నన్నూ, నీ తమ్ముళ్లనీ చూశావా?' అనగానే ధర్మనందనుడు ఆ పక్షితోపాటు అన్నీ చూశానన్నాడు. అది వినగానే ద్రోణుడు అతణ్ని చిన్నగా మందలించి 'నీ దృష్టి చెదిరింది. నీవు ఆ పక్షిని కొట్టలేవు... పక్కకు తప్పుకో' అన్నాడు. అదేవిధంగా భీమసేన, నకుల సహదేవులు, దుర్యోధనాది కౌరవులనూ వరసగా అడిగాడు. అందరూ ధర్మరాజు ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. ద్రోణుడు వారందరినీ మందలించి, చివరగా, తన ప్రియశిష్యుడైన అర్జునుణ్ని పిలిచాడు. వారినడిగిన ప్రశ్నలనే అడిగాడాయన. దానికి సమాధానంగా అర్జునుడు 'గురువర్యా! పక్షి తలను చక్కగా చూశాను. నాకు అది తప్ప ఇంకేదీ కనిపించటంలేదు' అనగానే ద్రోణుడు 'గురిచూసి కొట్టు నాయనా' అని ఆజ్ఞాపించాడు. అర్జునుడు బాణాన్ని సంధించి వదలటం, ఆ పక్షి తలతెగి చెట్టుకొమ్మ మీదనుంచి నేలమీద పడింది. చిటారుకొమ్మన ఉన్న పక్షిని వీక్షించిన సరళిలో, ఆ పక్షిని నేలపడగొట్టి లక్ష్యాన్ని ఛేదించడంలో అర్జునుడి అమేయమైన ఏకాగ్రత, అంకితభావ లక్షణం మనకు సాక్షాత్కరిస్తాయి. ద్రోణుడు తన శిష్యులతో 'నాయనలారా! మీకందరికీ ఒకేవిధంగా విలువిద్య నేర్పాను. అయితే, అర్జునుడు అత్యంత పట్టుదలతో అందులోని సూక్ష్మాన్ని, కిటుకులను అభ్యసించి పరిపూర్ణుడయ్యాడు. మీరందరూ మరింత కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు' అని బోధించాడు. అర్జునుడి ఉదాహరణల్లాంటివి భారతీయ సనాతన సంస్కృతిలో ఎన్నో మనకు తారసపడతాయి.
'కృషితో నాస్తి దుర్బిక్షమ్' అన్న ఆర్యోక్తిని ఆలంబనగా తీసుకుని అంకితభావంతో కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవటం ఏమాత్రం అసాధ్యం కాదు. కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారు. ఘనమైన విజయాలను హస్తగతం చేసుకుంటారు. తమ జన్మను సార్థకం చేసుకోవటమేకాక, జనహితానికి కారకులవుతారు.
- వెంకట్ గరికపాటి