ᐅవివేక దీపిక
ద్వేషం వద్దు- అది హృదయాన్ని నాశనం చేస్తుంది
దురాశ వద్దు- అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది
భేదభావం వద్దు- అది మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది
దుర్వ్యసనాలు వద్దు- అవి కన్పించని సంకెళ్లు
స్వార్థం వద్దు- అది జీవితాన్ని మింగేస్తుంది
అని ప్రపంచంలోని శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మానవత్వాన్ని పండించుకొనే ఉత్తమ ప్రకృతికి మించిన భూషణం లేదని సైతం అవి వ్యాఖ్యానిస్తున్నాయి.
ఒకసారి శంకరానందస్వామి అనే యోగి దేశసంచారం చేస్తూ ఒక వూరికి వచ్చాడు. అక్కడే ఆశ్రమం ఏర్పరచుకొన్నాడు. విమల ప్రేమతత్వం, తాత్వికత నింపుకొన్న యోగి ప్రవచనాలు త్యాగాన్ని నేర్పుతాయి. నైతికతను బోధిస్తాయి. ఆయన గొప్ప జ్ఞాన సంపన్నుడు అని ప్రజలు చెప్పుకొనేవారు. వూరూరా ఆ సాధువు ఖ్యాతి వ్యాపించింది. ఆశ్రమానికి అశేష సంఖ్యలో ప్రజలరాక మొదలైంది. ఆయనను దర్శించుకొంటే కోర్కెలు నెరవేరతాయని అందరి భావన. విలువైన కానుకలు, డబ్బు, శాలువలు, పూలదండలు, ఫలాలు- రకరకాలుగా ఆయనకు అందజేసి తమ భక్తిని ప్రకటించుకొంటున్నారు. ఆ యోగి తనకు కావలసిన ఫలాలు మాత్రమే స్వల్పంగా స్వీకరించేవాడు. కానుకలన్నీ పేదలకు పంచేవాడు. అత్యంత నిరాడంబర జీవితం గడిపేవాడు.
ఆ వూళ్ళో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతడు ఎన్నెన్నో అక్రమ మార్గాలు అవలంబించి ధనార్జన చేశాడు. శంకరానందస్వామి దర్శనం చేసుకొంటే కోరిన సిరులు ఇంకా లభిస్తాయని అతడు నిత్యం ఆశ్రమానికి వచ్చేవాడు. ఒకరోజు వ్యాపారి స్వామిని సమీపించి- 'మీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉంది. మీరు సాధువరులైనా, ఎంత ఉదారస్వభావులైనా సర్వస్వం పరులకు ధారపోయడమా! అవధుల్లేని ప్రజాభిమానం మీకుంది. మీరు కోరితే సకల సౌకర్యాలు కలగజేసే వారున్నారు. మీకు సుఖమయ జీవితంపై ఆశలేదా? చలికి కప్పుకొనే శాలువలు, దుప్పట్లు సైతం పేదలకు పంచి పాత చిరుగుల దుప్పటే మీరు కప్పుకొంటున్నారు. మీ భావం అవగతం కాలేదు. వివరించగలరు'- అని అర్థించాడు.
యోగి అన్నాడు- 'నీ ప్రశ్నకు తరవాత సమాధానం చెబుతాను. ఇరవై రోజుల్లో నీకు మృత్యువు తప్పదు'. ఈ మాట విన్న వ్యాపారి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. యోగి మాట పొల్లుపోదని విశ్వసించిన అతడు ఇంటికి పరుగుతీశాడు. తాను పూర్తిచేయాల్సిన పనులు ఈ అల్పసమయంలో పూర్తిచేయడం సాధ్యమా! అతని గుండె బెదిరింది. ఎవరెవరి నుంచి రుణాలు రావాలో వసూలు చేయడం ప్రారంభించాడు. తాను కొత్తగా కొన్న భూములు, భవనాలు, తోటలు అన్నింటికీ రిజిస్ట్రేషన్లు పూర్తిచేయించాడు. భార్య, పిల్లలపేర వీలునామాలు రాయించాడు. క్షణం తీరికలేని పనులు. ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది. 'కోట్ల విలువైన ఆస్తులు గడించాను. ఆనందంగా జీవించవచ్చని పసిడి కలలు కన్నాను. ఇంతలో మృత్యువార్త'- వణికించే భయం నిండిన ఆలోచన ముసురుకొంది. నీరసం ఆవహించింది. ఒక గంటసేపైనా మనశ్శాంతి దొరుకుతుందని ఆశ్రమానికి వెళ్లాడు.
శంకరానందస్వామి ఆ సమయంలో అక్కడ సమావేశమైన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు... 'స్వల్పకాలిక పరిమిత జీవితంలో మనం మాత్రం ఉండగలమా? నేను, నాది- అనే ఆలోచనలు, భేదభావాలు ఎందుకు? లోకసంక్షేమం కోసం విషాన్ని సైతం మింగిన దేవుడు స్వార్థపరుల నైజాన్ని క్షమిస్తాడా? సర్వం తానై శిష్టజన సంరక్షణమే తన ధ్యేయం అని పలికినవాడు దుష్టచింతన, అధర్మప్రవర్తనల మార్గాలపై పయనించేవారిని కరుణిస్తాడా? దురభిమానాలు ఈర్ష్యాద్వేషాలు మన స్వభావంలో ఉంటే అవి లేనివారిని చూసి మనం సంతోషించాలి. ఉత్తమ గుణాలు ఎక్కడ కనిపించినా గౌరవించడం నేర్చుకోవాలి. విశ్వవిభుడి హృదయాన్ని దర్శించి పరమార్థాన్ని గ్రహించినప్పుడే మానవజన్మకు సార్థకత!'
అంతవరకు ఉపన్యాసాన్ని విన్న వ్యాపారి ఆయన పాదాలపై పడ్డాడు. యోగి అన్నాడు- 'నీకు జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశంతోనే త్వరలో చనిపోతావని చెప్పాను... జీవుల హితంకోసం అసత్యం పలికినా సత్యఫలమే దక్కుతుంది.' మహాభారతంలోని మాటను మనసులో గుర్తుచేసుకొన్నాడు యోగి.
'మహానుభావా! ఇప్పుడే నాలో మీరు వివేక దీపిక వెలిగించారు. అంధకారమనే మంచుతెర తొలగింది. మృతిముట్టని జీవితం ఎక్కడుందో తెలుసుకోగలిగాను' అని వ్యాపారి విన్నవించుకొన్నాడు. పరుల సుఖాన్ని భుజించే దుష్టతలపులు వీడినప్పుడు, మనసులు సచ్ఛింతనంపై మరలినప్పుడు- శాంతిదూతలై ప్రపంచమంతటా మనుషులు మనగలుగుతారు. విశ్వప్రేమికుల సంఖ్య కుంచించుకపోదు. పసిడిపందిళ్లలో కలకలలాడుతూ ప్రతి ఇల్లూ ఆనందాల పొదరిల్లు అవుతుంది. మనం నిరతం కాంక్షించవలసింది ఇదే! ప్రార్థించవలసింది దీనికోసమే!
- డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా