ᐅదైవ ధర్మం
మతం పట్ల చాలామందికి అపోహలుంటాయి.
ఒక మతాన్ని నమ్మేవారు ఇతర మతాలకు, మతస్థులకు దూరంగా ఉండాలని; ఒకవేళ మతం మారితే తమ పూర్వమత ఆచారాలను పొరపాటునైనా పాటించరాదని; తాము అనుసరిస్తున్న మతమే అత్యుత్తమమనే ఆరాధ్యభావంతో జీవించాలని కొందరు మతబోధకులు పదేపదే ప్రబోధిస్తుంటారు.
ఇది పూర్తిగా సంకుచితం.
'అందరి దేవుడొక్కడే' అనే సూత్రాన్ని చెబుతున్నవారే, తమ మాటల్ని ఆచరణలో చూపటం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి అక్బర్ తన 'దీన్ ఇలాహీ' మతవ్యాప్తి కోసం విఫలయత్నం చేశాడు.
కేవలం గురునానక్‌దేవ్ ఒక్కడే సర్వమత సమతా సిద్ధాంతాన్ని సాకారం చేయగలిగాడు. సిక్కుమతాన్ని దైవధర్మంగా చెప్పడమే న్యాయం. ఎందుకంటే- ఇందులో విగ్రహారాధన ఉండదు. గురువు ద్వారానే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది గనుక 'గురుద్వారా'లే వారికి ఆలయాలు. గురువు పరమాత్మ స్వరూపమని సనాతన ధర్మం ఏనాడో చెప్పింది. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో గురువును ప్రత్యక్ష పరమాత్మగా పూజించటం కేవలం సిక్కుధర్మంలోనే కనిపిస్తుంది. సిక్కు గురుపదవి అనేక త్యాగాలతో కూడుకున్నది. గురునానక్‌దేవ్ ఆత్మ ఆయన తరవాతి గురువుల్లో ప్రభవించిందని సిక్కులు విశ్వసిస్తారు. గురు అమర్‌దాస్ తీవ్రమైన హిందూమతాభిమానిగా, విగ్రహారాధకుడిగా ఒకప్పుడు జీవించాడు. ఒకసారి ఓ సన్యాసి ఆయన్ను 'గురువులేని వ్యక్తి మహాపాపి' అంటూ వెలివేసినట్లు వ్యవహరించటంతో- ఆయన సద్గురువు గురు అంగద్‌దేవ్ దర్శనం చేసుకున్నాడు. అప్పటికే ఆయన వృద్ధుడు కావడంవల్ల గురువు గౌరవంగా అమర్‌దాస్‌కి ప్రణామం చేశాడు. అమర్‌దాస్ వెంటనే గురువు పాదాలను ఆశ్రయించి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించాడు. ఆయన అంగీకరించడంతో ఆనాటినుంచి అమర్‌దాస్ అచంచలమైన విశ్వాసంతో గురుసేవలో నిమగ్నమైనాడు. సేవ అంటే అహంకారాన్ని గురువు పాదాలకు అర్పించటం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు. అమర్‌దాస్ సిక్కుధర్మంలోని సర్వమత సమానత్వ సిద్ధాంతానికి, మానవతా ధర్మానికి, మతమంటే షరతులులేని ప్రేమ అనే వ్యాఖ్యానానికి ముగ్ధుడయ్యాడు. గురు అంగద్‌దేవ్ తన శిష్యుడిలోని అసమాన ధర్మనిరతికి ఆనందించి ఆయనను తన తరవాతి గురువుగా ప్రకటించాడు.
గురు అమర్‌దాస్ కాలంలోనే సిక్కు మతాభిమానులు మిక్కిలిగా పెరిగారు. మూఢాచారాలను ఆయన తోసిపుచ్చి, భర్త చితిమీద భార్యను దహించే సతీసహగమనాన్ని అడ్డుకున్నారు. తొలి విధవా వివాహాన్ని జరిపించిన సంఘసంస్కర్త ఆయన. గౌరవం కులమతాలతో రాదనీ, వ్యక్తి ప్రవర్తన, జీవన విధానం వల్లనే లభిస్తుందనీ చాటారు. సిక్కులకు ఒక వ్యవస్థను నిర్మించి, దైవధర్మ నిరతులుగా వారిని తీర్చిదిద్దిన ఘనత గురు అమర్‌దాస్‌ది. అప్పటి మొగల్ చక్రవర్తి అక్బర్ ఆయన ఆధ్యాత్మిక తేజం ముందు చేతులు జోడించి అనేక కానుకలు సమర్పించుకున్నాడు. సర్వమతాల నుంచి అమృతబోధల్ని సంపుటీకరించి 'గురుగ్రంథ సాహెబ్'లో పదిలపరచిన ఏకైక విశిష్ట ధర్మం సిక్కు ధర్మం. అందుకే అది కులమతాలకు అతీతమైన దైవధర్మంగా విరాజిల్లుతోంది.
- కాటూరు రవీంద్రత్రివిక్రమ్