ᐅఆనందమే అందం




ఆనందమే అందం 

ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది- భగవంతుడు మానవుడికి బుద్ధి, మనసు ఇచ్చి ఎందుకిన్ని కష్టాలపాలు చేస్తున్నాడా అని. లోతుగా ఆలోచిస్తే- ఇది పిచ్చి సందేహమే అనుకోక తప్పదు. అత్యంత సుందరమైన అద్భుతమైన, అన్ని వనరులను సమకూర్చే ప్రకృతిని దుర్వినియోగం చేసి జీవితాన్ని చేజేతులా దుఃఖాలపాలు చేసుకుని, సంతోషాన్ని ఆనందాన్ని దూరం చేసుకుంటున్నది మానవుడు. ఇది కచ్చితంగా స్వయంకృతాపరాధమే.
నిజానికి ఏదో ఒక సమస్యంటూ లేని మానవుడే లేడు లోకంలో. అయినా సమస్యకు కుంగిపోయి, పరిష్కారం లభించగానే పొంగిపోవడం మానవ లక్షణం కాదు. ఎన్ని అవరోధాలు, కష్టాలు ఎదురైనా మనసును ప్రసన్నంగా ఉంచుకోవాలి. వదనాన్ని ప్రసన్నంగా ఉంచుకోవాలి. నిర్లిప్తత, సమవర్తిత్వం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనుషుల్లో మనీషిగా మన్ననలు పొందుతాడు. బుద్ధి, మనసుల నిర్దేశకత్వంలో వాక్కు. ఆచరణ రూపుదిద్దుకోవాలి. అప్పుడు సత్కార్యాలే జరుగుతాయి. సత్యవాక్కులే వెలువడతాయి. ఆనందం అవ్యక్తసుగంధమై నలుదిశలా పరివ్యాప్తమవుతుంది. ఆ ఆనందమే అందం. అదే అసలైన అందం. ఇలాంటి ఆనందం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. మనిషిని మహానుభావుడిగా చేస్తుంది.

తెల్లవారితే తనకు పట్టాభిషేకమని విన్నా, తెల్లవారాక తాను అడవులకు బయలుదేరాల్సి ఉందని విన్నా- శ్రీరాముడి స్పందన ఒకటే. సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నప్పుడు, రాజ్యాధికారాన్నీ స్వీయకుటుంబాన్నీ కోల్పోయినప్పుడూ హరిశ్చంద్రుడి స్పందన ఒకటే. ఆనంద-సంతోషాలకు అతీతమైన అనుభూతి వారిది. సాటివాడికి చేతనైన ఉపకారం చేయడంలో కలిగే ఆనందానికీ, సంతోషానికీ మరేదీ సాటిరాదు. ఈ ఉపకార బుద్ధి మనిషన్న ప్రతివాడికి చాలా అవసరం. అదే మానవత్వం. దాన్ని కాపాడుకోవడమే కాదు; పెంపొందింపజేసుకోవాలి. ఇతరుల్లో పెంపొందించేందుకు మార్గాలు అన్వేషించాలి. ప్రణాళికా రచన చేయాలి. ఈ దిశలో పదిమందినీ కలుపుకోవాలి. ప్రభావితం చేయాలి. తన బాధల్ని ఎవరిముందూ ఏకరువు పెట్టకుండా, ఇతరుల బాధల్లో స్వయంగా భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి. వారి వెతలను దూరం చేయగలిగితే, అప్పుడు లభించే సంతోషం వర్ణనాతీతం. కోపాన్ని దూరం చేసుకోగలిగితే స్వభావం సరళమవుతుంది. హృదయం ప్రశాంతమవుతుంది. మేధ తేజోవంతమవుతుంది. వచనం ప్రేమమయమవుతుంది. ఆ ప్రేమ ఎల్లెడలా పరివ్యాప్తమై ఆనందపరిమళాలు వెదజల్లుతుంది. సంతోషంతో సమానమైన సుఖమనేదేదీ ఉండదని సర్వులకూ సుగ్రాహ్యమవుతుంది.

ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతనివద్ద అయిదు గొర్రెలున్నాయి. వాటిని కాస్తూ భార్యాబిడ్డల్ని పోషిస్తూండేవాడు. అతడికి ఆనందం కరవైంది. ఆ వూరికో సాధువు వచ్చి వూరిబయట ప్రశాంతంగా ఉందని ఓ చిన్న కుటీరం కట్టుకున్నాడు. తనవద్దకొచ్చేవారికి కావలసిన సలహాలు, ఉపదేశాలు ఇచ్చేవాడు. గొర్రెలకాపరికి అది తెలిసి సాధువుదగ్గరికెళ్లి తన సమస్య చెప్పుకొన్నాడు. సాధువో ప్రశ్న వేశాడు- 'నువ్వెప్పుడైనా ఇతరులకు సహాయం చేశావా?' అని. లేదన్నాడతను. 'ఇతరులకు ఉపకరించనివాడెప్పుడూ సంతోషపడలేడు. అటువంటి ఆనందంముందు, కేవలం తన కుటుంబబాగునే దృష్టిలో పెట్టుకుని కాలక్షేపం చేసేవాడి ఆనందం అత్యల్పమైనది. అది శాశ్వతమైన ఆనందం కానేకాదు. నువ్వోపని చెయ్యాలి. గొర్రెలన్నింటినీ అమ్మేసెయ్యి' అన్నాడు సాధువు. గొర్రెల కాపరి నిర్ఘాంతపోయాడు. సాధువు సలహా ఇచ్చాడు- 'గొర్రెల్ని అమ్మగా వచ్చిన పైకంతో వచ్చే కార్తీక పౌర్ణమినాడు వూరిలో గ్రామస్తులందరికీ అన్నసంతర్పణ చెయ్యి'. అతనికంతా అయోమయంగా ఉంది. తన ఆశంతా ఆ గొర్రెలపైనే- సాధువిలా చెప్తాడేంటి, అనుకుని 'సరే స్వామీ!' అని పొడిపొడిగా చెప్పి, ఇంటికొచ్చి భార్యకు సంగతి వివరించాడు. సాధువు చెప్పినట్లే చెయ్యమందామె. వెంటనే గొర్రెల్ని అమ్మి, వచ్చిన పైకంతో పర్వదినాన వూరి వారందరికీ అన్న సంతర్పణ చేశాడు. ఒక సామాన్యుడు, పేదవాడు గొర్రెల్ని అమ్మేసి డబ్బంతా ఖర్చుచేసి ఇంతటి పుణ్యకార్యం చేశాడు కదా అని అభిమానంతో తలా వంద, రెండు వందల రూపాయలు అతనింట్లోని ఓ గంపలో వేసి వెళ్లిపోయారు. ఎన్నో వేల రూపాయలు గంపలో చూశాడు గొర్రెల కాపరి. అతని ఆశ్చర్యానికి అంతే లేదు. అంతకంటే- అందరికీ అన్న సంతర్పణ చేసినందుకు అపూర్వమైన ఆనందం పొందాడు. వందల గొర్రెల్ని కొనేంత పైకం సమకూరింది. అయినా అయిదే గొర్రెల్ని కొని, మిగిలిన పైకంతో ప్రతి పండుగనాడు అన్న సమారాధన చేస్తూ ఎంతో ఆనందం పొందేవాడు. చీకూ-చింతా, అశాంతీ, అసంతృప్తీ తొలగిపోయాయి. గ్రామస్థుల నుంచి ఇంకా పైకం వస్తూనే ఉంది. ఆ డబ్బుతో గుడి, బడి, ఆసుపత్రీ కట్టించాడు. ఎంతోమందికి వాటివల్ల మేలు కలుగుతుంటే చూసిన అతని ఆనందం వర్ణనాతీతం. అతని ఆనందమే అతనికందమైంది. అందరికీ ఆరాధ్యుడైనాడతను. అందుకే- 'ఆనందమే అందం' అన్నారు పెద్దలు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి