ᐅభ్రష్టత్వం




భ్రష్టత్వం 

'అతనికంటె ఘనుడు ఆచంటమల్లన' అని సామెత. అంటే 'ఒకణ్ని మించినవాడు మరొకడు' అని అర్థం. ఈ సామెత మంచితనంలో అయితే ఎలాంటి నష్టమూ ఉండదు కానీ, చెడుతనంలో అయితే నష్టమూ, కష్టమూ మాత్రమే కాదు- మహా ప్రమాదం కూడా. దీన్నే 'భ్రష్టత్వం' అంటారు. ఈ భ్రష్టత్వం చెడిపోయినవాడినే కాకుండా, చుట్టూ ఉన్న సమాజాన్నీ చెడగొడుతుంది. శరీరంపై గాయంవల్ల కుళ్లిపోయిన మాంసం, పక్కనే బాగున్న మాంసాన్నీ చెడగొట్టినట్లు చెడ్డవాడు క్రమంగా పరిసరాల్లోని మంచివాళ్లను చెడగొడుతుంటాడు. చెడుతనాన్ని మొగ్గదశలోనే తుంచి వేయాలే కాని, వదిలెయ్యరాదు. చెడుతనాన్ని నిరసించడానికీ, ఎదిరించడానికీ ఏమాత్రం జంకు పనికిరాదు. జంకితే ఉదయించబోయే సమాజం భవిష్యత్తు- అస్తమయంవలె కుంగిపోతుంది.
పూర్వం చెడును నిరసించే పనులను చాలామంది మహాకవులు చేశారు. వారిలో కాళిదాస మహాకవి ఒకడు. కాళిదాసు కవితాప్రియుడైన భోజమహారాజు ఆస్థానకవి అని అందరికీ తెలుసు. ఆ రాజు ఒక సమయంలో జూదానికి బానిసగా మారి, ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటే, చెమటోడ్చి ప్రజలు కట్టిన పన్నుల నుంచి సమకూరిన ధనం ఇలా దుర్వినియోగం కావడాన్ని కాళిదాసు సహించలేకపోయాడు. భోజమహారాజులోని దుర్వ్యసనాన్ని తొలగించాలనే తపనతో ఒకనాడు రాజమార్గంలోని కూడలిలో బిచ్చమెత్తుకొనే సన్యాసి వేషంలో నిలబడి, మాంసం చేతిలో పట్టుకొని తింటున్నట్లు నటించడం ప్రారంభించాడు. ఇంతలో భోజమహారాజు ఆ రాజమార్గంలో కాలినడకతో వస్తూ, మాంసం తింటున్న సన్యాసిని చూశాడు. నియమనిష్ఠలతో ఉండవలసిన సన్యాసి మాంసాన్ని భక్షిస్తున్నందుకు కోపించి, ధార్మికుడైన తన పాలనలో అలా జరగడాన్ని సహించలేక ఆ సన్యాసితో- 'ఏమయ్యా! సన్యాసీ! నీవు ఇలా మాంసం తినడం ఉచితమేనా?' అని ప్రశ్నించాడు. అప్పుడతడు రాజుతో- 'నేను ఎప్పుడైనా మద్యం తాగిన తరవాతనే మాంసాన్ని తింటాను మహారాజా! ఇది సముచితమే గదా!' అని సమాధానం చెబుతాడు. అప్పుడు భోజరాజు రెట్టించిన కోపంతో- 'ఏమిటీ! నీకు మద్యపానం అలవాటు కూడా ఉన్నదా?' అని నిలదీస్తాడు. బదులుగా అతడు- 'వేశ్యలతో సుఖపడుతూ మద్యపానం చేయడం నాకు ఎంతో ఇష్టం' అంటాడు. భోజరాజు ఇంకా మండిపడుతూ- 'వేశ్యల దగ్గరికి వెళ్లడానికి నీకు డబ్బు ఎక్కడిది?' అని అడుగుతాడు. 'దొంగతనం చేసి కానీ, జూదం ఆడి కానీ డబ్బు సంపాదిస్తాను' అని సమాధానమిస్తాడు. రాజు- 'అయితే... నీకు దొంగతనం, జూదంలాంటి కళల్లో కూడా ప్రవేశం ఉందన్నమాట!' అంటాడు. 'భ్రష్టుడైన నాలాంటి వాడికి మరో దారి ఏముంటుంది?' అని అతడు ముఖంమీద కొట్టినట్లు చెబుతాడు. భోజరాజుకు కనువిప్పు కలుగుతుంది. తానూ జూదానికి బానిసైపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు పశ్చాత్తాపం చెంది, ఆ సన్యాసి తన కళ్లు తెరిపించాడని కాళ్లమీదపడి సమస్కరిస్తాడు. సన్యాసి ముసుగును తొలగించుకొని కాళిదాసు భోజరాజు ముందు నిలబడతాడు- 'మీలోని చెడు వ్యసనాన్ని మీకు తెలియజేయడానికే ఇలా ప్రవర్తించాను మహారాజా... నన్ను మన్నించండి!' అంటాడు కాళిదాసు.

మనిషి మంచికి బానిస కావాలేగానీ, చెడుకు బానిసగా మారకూడదు. మనిషి పతనం సమాజానికి మచ్చవంటిది. ఆ మచ్చ బాహ్య సౌందర్యాన్ని చెడగొట్టి, అంతస్సౌందర్యాన్నీ హరించివేస్తుంది.

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ