ᐅఆదర్శ దాంపత్యం




ఆదర్శ దాంపత్యం 

వివాహం భౌతిక అవసరమే కాదు, సామాజిక బాధ్యత కూడా అని సామాజికులు నిర్వచించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల సాధనకు వివాహమే మార్గదర్శి అని ఆధ్యాత్మికులు ప్రవచించారు.
సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల జంటలను ఆదర్శంగా ప్రతి భార్యాభర్తా స్వీకరించాలంటారు పెద్దలు.

లక్ష్మీదేవిని తన వక్షస్థలంలో నిలుపుకొన్నాడు విష్ణుమూర్తి. దంపతుల హృదయాలు ఒకటై ఉండాలంటే లక్ష్మీ విష్ణుమూర్తులను ఆదర్శంగా తీసుకోవాలంటారు.

ఒకే మాటగా బతికే జంటకు సరస్వతీ బ్రహ్మలు ఆదర్శం. సరస్వతి బ్రహ్మ నాలుకపై కొలువై ఉంటుంది.

అర్ధనారీశ్వరతత్వాన్ని ఆవిష్కరించే పార్వతీ పరమేశ్వరుల్లో దేహం శివరూపమైతే, దాన్ని కదిలించగలిగే చైతన్యం పార్వతి. ఆలోచననుంచి దాన్ని ఆచరించే వరకూ అన్నీ చేసేది శివుడు, ఆయనకు సహకరించేది పార్వతి. అలా చేసే పనులు, ఆలోచనలు సరిసమానంగా పంచుకునే జంటలకు పార్వతీ పరమేశ్వరులే ఆదర్శం. అందుకే కాళిదాసు- పార్వతీ పరమేశ్వరులు వాక్కు, అర్థంలా కలిసిపోయారనీ ఆదిదంపతులనీ కీర్తించాడు, కొనియాడాడు.

వివాహ వేడుకలోని సప్తపదిలో నూతన దంపతులు వేసే ఏడడుగులకు ఏడు అర్థాలున్నాయి.

తొలి అడుగు, శరీరబలం కోసం. రెండో అడుగు, మానసిక బలంకోసం. మూడో అడుగు, కష్టమైనా, సుఖమైనా కలిసి బతకడం కోసం. నాలుగో అడుగు, ఆరోగ్యం కోసం. అయిదో అడుగు, పశుసంపదల వినియోగం కోసం. ఆరో అడుగు, రుతుసంపదలు అనుగ్రహించటం కోసం. ఏడో అడుగు, హోమాల్ని చేసే అవధూతల ఆశీర్వాదం, అనుగ్రహం కోసం- ఇలా వైవాహిక బంధానికి పునాది అయిన సంప్రదాయాల వల్లనే మన వివాహ వ్యవస్థను అన్ని దేశాలవారూ గౌరవిస్తున్నారు. కొంతమంది విదేశీయులూ వీటిని అనుసరిస్తున్నారు.

ఇది పురాణకాలం నాటి కథ. ఒక పండితుడు వేదాంత సారాన్ని ఔపోసనపట్టిన మహాజ్ఞాని. బ్రహ్మచారిగా ఉండిపోయి, బ్రహ్మ సూత్రాలమీద వ్యాఖ్యానం చేయడానికి నిర్ణయించుకున్నాడు. వృద్ధుడైన తండ్రి అభీష్టం మేరకు వివాహానికి తలొగ్గక తప్పలేదు. వివాహం జరిగినా, తన ధ్యాస, ధ్యానం అంతా బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం మీదే ఉండేది. అతను ఆ ఉద్గ్రంథ రచనలో ఎంతగా తలమునకలు అయ్యాడంటే తనతో కాపురానికి వచ్చిన సహధర్మచారిణి సంగతే మరచిపోయాడు. అయినా ఆ ఇల్లాలు ఆయనను చంటిబిడ్డలా సాకేది. నిరంతరం కావలసినవి సమకూరుస్తూ ఉండేది. అతడి ఏకాగ్రతకు భంగం అవుతుందేమోనని ఎప్పుడూ ఎదురుపడేది కాదు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ఆయన తాళపత్రగ్రంథాల్లో వ్యాఖ్యానాలు రాస్తూనే ఉండేవాడు. సాయం గడిచేసరికి ఆయనకోసం దీపం వెలిగించేది. అలా ఎన్నో ఏళ్లు గడిచాయి. ఆయన గ్రంథ రచన పూర్తయ్యింది. అప్పటికి ఈ లోకంలోకి వచ్చాడు. తనవద్దనుంచి దీపాన్ని తీసుకువెళుతున్న భార్యవంక ఆశ్చర్యంగా చూసి 'ఎవరు నువ్వు? నా కోసం ఇంత శ్రమపడుతున్నావ్...' అన్నాడు. అప్పుడామె అంది- 'నేను మీ భార్యను... కొన్ని సంవత్సరాలక్రితం మనకు పెళ్ళయ్యింది. మీరు రాస్తున్న గ్రంథ రచనలో నేను చేయగలిగిన సహాయం చేస్తున్నాను...' అప్పుడాయన కళ్ళ వెంబడి అశ్రుధారలు కురిశాయి. అవి చెంపలమీదనుంచి జారి చెరువులయ్యాయి. అవిశ్రాంతంగా దుఃఖించి, 'చాలా ఆలస్యం జరిగిపోయింది... ఈ గ్రంథరచన పూర్తయిన వెంటనే సన్యాసం స్వీకరిస్తానని ప్రమాణం చేశాను. ఇన్నేళ్ళుగా నా భర్త ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినా, భార్యగా నీ సేవలు అందించావు... అందుకు కృతజ్ఞతగా ఇన్నేళ్ళు యజ్ఞంగా భావించి రాసిన ఈ మహాగ్రంథానికి నీ పేరే పెడుతున్నాను...' అన్నాడు. ఆయనే బృహస్పతి. ఆయన భార్యపేరు భామతి. కొన్నివేల సంవత్సరాల క్రితం బృహస్పతి తన భార్య 'భామతి' పేరుతో రాసిన ఆ బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం నేటికీ నిలిచి ఉంది. పవిత్రమైన వివాహవేడుక ద్వారా ఒకటై, ఎన్నో ఏళ్లు వేర్వేరుగా ఉన్నా ఒకే ఆత్మగా బతికిన అపురూపమైన దంపతుల ఆదర్శ దాంపత్య కథ ఇది.

నాటి పురాణ యుగంనుంచి నేటి పరమాణు యుగానికి వస్తే- వేగవంతమైన బతుకు చక్రంలో సాగుతున్న వివాహబంధాలు కొంతమంది విషయంలో తెగిపడి, విడిపడి చేదు జ్ఞాపకంగా, అపశ్రుతిలా మారడం మనం చూస్తున్నాం.

ధర్మ మార్గంలోనూ, అర్థ సంపాదనలోనూ, దాని వినియోగంలోనూ, దైహిక మానసిక కోర్కెలను సాధించడంలోనూ నా సహధర్మచారిణిని అతిక్రమించను, వేరొకరితో కలిసి నన్ను అంకితం చేసుకోను అనే వివాహ ప్రతిజ్ఞ- దంపతుల మనసుల్లో బలమైన ముద్ర వెయ్యాలి.

స్వచ్ఛమైన ప్రేమ, ఒకరిపట్ల ఒకరికి నమ్మకం సడలని విశ్వాసం పునాదిగా ఏర్పడిన వివాహబంధం సామరస్యంగా బలపడినప్పుడే ఆ దాంపత్యం నిండు నూరేళ్లు శుభప్రదంగా ముందుకు సాగుతుంది.

మాంగల్య సూత్రధారణలో మూడుముళ్ళు వేయడానికి కారణం- వారి శరీరం, మనసు, ఆత్మలు లయం కావడం ద్వారా, ఆ మూడుముళ్ల బంధం ఏడేడు జన్మల బంధంగా మారుతుందని, ఆదర్శ దాంపత్యంగా నిలుస్తుందని, నూరేళ్ల పంటగా స్థిరపడుతుందని.

అలాంటి దాంపత్యం దీపంలా వెలుగుతుంది. ఆ దీపం మరిన్ని దీపాలను వెలిగిస్తుంది. భార్య, భర్త, వారి సంతానం... అలా ఒక కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే సమాజం. ఆదర్శవంతమైన దంపతుల కలయికతో సమాజమూ ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటుంది.

- డాక్టర్ ఎమ్.సుగుణరావు