ᐅహనుమారాధన




హనుమారాధన 

వాల్మీకి రచించిన మహాకావ్యం రామాయణం విశ్వజనీనమైన, సార్వకాలికమైన దివ్య మంత్ర సంహిత. అందులోని పాత్రలు అమృతం నింపుకొన్న సజీవమూర్తులు. శ్రీరాముని, హనుమంతుని గుడి లేని వూరు లేదు. ఇది ఆబాలగోపాలానికి తెలిసిన కథ. ఇప్పటికీ విద్వాంసులకు అంతుచిక్కని సంకేతాలు ఉన్న పురాణం. తోక ఉన్న దైవం, పది తలల రాక్షసుడు, ప్రాణం పోసుకున్న రాయి, అగ్నిలోకి దూకిన పాతివ్రత్యం- ఇవి ఆధునిక మానవుడికి సవాలు విసిరే రహస్యాలు!
హనుమంతుడెవరు, ఆయన జన్మరహస్యం ఏమిటి? ఆయన మహిమను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కానీ, ఆదిశేషువు, అగ్ని కానీ చెప్పటం కష్టమని పెద్దలంటారు. పురాణాల ప్రకారం- వైశాఖ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రంలో బహుళ దశమి శనివారంనాడు వైధృతి యోగంలో విష్ణుభక్తి తేజోస్వరూపుడైన హనుమ జన్మించాడు. ఒకసారి దేవలోకంలో దేవేంద్రుని సభలో పుంజికస్థల అనే దేవకాంత బృహస్పతి వద్దకు వెళ్లి హాస్యప్రసంగం చేసింది. ఆమె వికృత భావాలకు బృహస్పతి మండిపడి 'నువ్వు మానవలోకంలో వానర స్త్రీగా జన్మిస్తావు' అని శపించాడు. శాప విమోచన కోసం ఆమె అర్థించగా, నువ్వు హనుమంతునికి జన్మ ఇచ్చిన పిమ్మట తిరిగి స్వర్గలోకానికి చేరుకొంటావని బృహస్పతి అనుగ్రహించాడు.

అంజనాదేవిగా భూలోకంలో వానర కన్యగా పుట్టిన పుంజికస్థల కేసరి అనే వానర రాజును ప్రేమించి పెళ్లి చేసుకొంటుంది. రాక్షససంహారం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సును ఈశ్వరుడికి ఇస్తారు. దాన్ని పరమశివుడు పార్వతికి ఇస్తాడు. ఆ శక్తిని పార్వతి భరించలేక అగ్నికి ఇచ్చింది. అగ్ని దాన్ని వాయువుకు ఇచ్చాడు. తనకు అతిలోక పరాక్రమంగల పుత్రుడు కలగాలని తపస్సు చేస్తున్న అంజనాదేవికి వాయుదేవుడు ఒక పండును ప్రతిరోజూ ఆహారంగా ఇచ్చేవాడు. ఒక రోజున శివ తేజస్సును పండుగా చేసి ఆమెకిచ్చాడు. దాన్ని తిని ఆమె హనుమంతుణ్ని కన్నదని, ఆయన సూక్ష్మ శరీరం వాయుప్రేరితం కాబట్టి వాయుపుత్రుడని పేరు వచ్చిందని చెబుతారు. హనుమ నివాసం కిష్కింధ. అది నేటి బళ్లారి ప్రాంతమనీ, వాలి సుగ్రీవులు ఆంధ్రులేననీ చెబుతారు. వారు కోతులు కాదని, సవర జాతికి చెందినవారని విద్వాంసుల వివరణ.

త్రిపురాసుర సంహారంలో విష్ణువు శివుడికి సహాయ పడతాడు. అందుకు ప్రతిఫలంగా శ్రీరాముడి కోసం రుద్రుడే ఆంజనేయుడిగా రావణ సంహారానికి తోడ్పడినట్లు పరాశరసంహిత వర్ణించింది.

అల్లరి చిల్లరిగా తిరుగుతూ అతడు మునుల తపస్సును భగ్నం చేసేవాడు. వారు కోపగించి 'నీ శక్తి నీకు తెలియకుండా పోతుంది. ఎవరైనా గుర్తుచేస్తేనే నీ శక్తి నీకు తిరిగి వస్తుంది' అని శపించారు. అందుకే స్వామిని మనం ఎంతగా స్త్రోత్రం చేస్తే అంతగా సంతృప్తి చెంది మనపై వరాలు కురిపిస్తాడని చెబుతారు.

స్వామి చిన్నతనంలో సూర్యునివల్ల సకల విద్యలు నేర్చుకుని అచిరకాలంలోనే సర్వవిద్యా ప్రవీణుడైనాడు. సీతాన్వేషణకాలంలో హనుమ పాత్ర మిక్కిలి ప్రశంసనీయమైనది. శ్రీరామనామ జపంలోని దివ్య మాధుర్యాన్ని గ్రోలి, స్వామిభక్తి పరాయణుడిగా, నవ వ్యాకరణవేత్తగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర పారంగతుడయ్యాడంటారు. అతణ్ని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అనే పలునామాలతో భక్తులు కీర్తిస్తుంటారు. యుద్ధంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని బతికించడానికి సంజీవనిని తేవడం హనుమ సాహసానికి మచ్చుతునక. సంసారసాగరం దాటి లోకాతీత సౌందర్యరాశి అయిన జగన్మాత సీతను కనుగొనడంలో మనకు తోడ్పడే హనుమ సాహసం సుందరకాండగా ప్రసిద్ధికెక్కింది.

రామాయణంలో హనుమంతుడి పాత్ర విలక్షణమైనది. వానరుడి లాంటి మనిషి భక్తితో భగవంతుణ్ని సేవిస్తే ఆయనతో తాదాత్మ్యం చెందితే, దైవంలాగే తాను ఆరాధనీయుడవుతాడని రామాయణం బోధిస్తున్నది.

- కె. యజ్ఞన్న