ᐅనేనే విశ్వం!
'నేనెవరు?' అన్న ప్రశ్నకు ఎడతెగక నీలో నీవు ప్రత్యుత్తరం అన్వేషించుకుంటే నీ సత్యమైన ఆత్మను తెలుసుకొని ముక్తుడవుతావు'- ఇది రమణమహర్షి బోధన. ఆయన మార్గనిర్దేశం మనిషి తనలోనికి తాను అంతర్ముఖం చెందడానికి సహాయపడుతుంది.
అలా అంతర్ముఖం చెందిన మనసు తనలోని ప్రతి అణువును శోధించగలిగితే 'నేను' అనే భావం ఎక్కడ, ఎలా ఉద్భవిస్తుందో అవగతమవుతుంది. ఆ అవలోక స్థితిలో శరీరంలోని ప్రతి నాడి, ప్రతి కణం తమలోని భావ ప్రకంపనాలను విప్పి చెబుతాయి. ఆ ప్రకంపనాలన్నీ సముద్రపు అలల్లా ఒకదానితో ఒకటి కలిసి, ఎగసి ఉత్తుంగ తరంగమై వూర్ధ్వముఖ ప్రయాణం కావించి హృదయస్థానాన్ని అధిరోహిస్తాయి. ఆ హృదయమే భావ ప్రకటన కావిస్తుంది. ఆ తరంగం అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, క్రోధం కావచ్చు, దుఃఖం కావచ్చు లేదా ప్రేమ కావచ్చు. భావం ఏదైనా మనిషి శరీరాన్ని నిలువునా కంపింపజేస్తుంది. ఆ భావమే 'నేను' అంటే ఫలానాగా గుర్తింపజేస్తుంది. ఆ గుర్తింపు మనిషి వయసుతోపాటు ఎదుగుతూ కొత్త కొత్త పోకడలను పోగుచేసుకుంటూ హృదయంలో స్థిరమై అహంగా రూపుదిద్దుకుంటుంది. ఆ అహమే వలయమై బందీని చేస్తుంది. స్వేచ్ఛా స్వతంత్రాలను హరించివేస్తుంది. కనుకనే మనిషి వాటినుంచి బయటపడాలనే ఆలోచన చేస్తాడు. ఆ క్రమంలో తనలో జనించే ప్రతి భావాన్ని అర్థం చేసుకుంటూ నేతి... నేతి (ఇది కాదు... ఇది కాదు) అని తోసిపుచ్చుతూ సాగిపోతున్నప్పుడు- చివరకు అత్యద్భుతమైన భావాతీత స్థితిని గోచరింపజేసుకోగలడు. తనలోని ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోగలడు. ఆ అవగాహనలో నేను, నీవు అంటూ వేర్వేరు భావాలుండవు. అంతా భగవన్మయమే అవుతుంది. 'అహం బ్రహ్మాస్మి' (నేను అంటే భగవంతుడు) అనే స్థితిని అనుభూతి చెందుతాడు.
శ్రీకృష్ణుడు చిన్నతనంలో మట్టి తిన్నాడు. తల్లి నోరు తెరచి చూపమంటే, నోటిలో పద్నాలుగు లోకాలు వీక్షింపజేశాడు. నేను శరీరం, మనసు కాదు; ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకున్నవాడు అన్నింటిలోనూ నేను ఉన్నాను, నాలో అన్నీ ఉన్నాయి అని నిరూపించగలడు. తనలోనే విశ్వమంతటినీ దర్శింపజేయగలడు.
ఆ మహానుభావులు వెళ్ళలేని చోటు లేదు. దాటలేని అడ్డంకులు ఉండవు. తలుపులు, గోడలు, చివరకు అరణ్యాలు, సముద్రాలు కూడా వారిలోని అంతస్సరూపాలే. వారి భౌతికరూపం పరుల కొరకే, నిజానికి వారి శరీరం అనంతమైన ప్రకృతిలో భాగమైపోతుంది.
'సమస్త చరాచర ప్రాణికోటిపట్ల సమదృష్టి కలవాడు తనను సర్వభూతాల్లో సర్వభూతాలు తనలో ఉన్నట్లు భావిస్తున్నాడు' అనేది శ్రీకృష్ణుడి గీతాబోధన.
మనిషి తానేమిటి అనే అన్వేషణలో చివరకు- నేనే విశ్వం, విశ్వమే నేను అని తెలుసికొని- ఈ దుఃఖపూరితమైన జీవితం నుంచి విడుదల పొందగలడు, ఆనందస్థితిని కైవసం చేసుకోగలడు.
- డాక్టర్ డి.చంద్రకళ