ᐅఒకడే సైనికుడు



ఒకడే సైనికుడు 

ప్రపంచం పాడైపోయింది! సంస్కృతీ సంప్రదాయాలు నాశనమైపోయాయి! స్వార్థం, దౌర్జన్యం, అవినీతి రాజ్యమేలుతున్నాయి! ప్రతివారిదీ ఇదే ఆరోపణ. ఇదే ఆవేదన. నిజమే. కానీ, ప్రపంచం అంటే ఎవరు? ప్రపంచంనుంచి మనం విడిగా ఉన్నామా? మనతో కలిసినదే ప్రపంచం. ప్రపంచంలో మనమూ ఒక భాగం. లోకం, ప్రపంచం, సమాజం... ఏదైనా సరే. ఇందులో ఏమున్నా అందులో మన భాగం ఉంది... మంచిగానీ, చెడుగానీ. గోరు వెచ్చని ఎండను ఆనందించే మనం మండుటెండనూ అనుభవించాల్సి ఉంటుంది. తొలకరి చినుకులను ఆస్వాదించే మనం తుపానునూ భరించాల్సి ఉంటుంది. సమాజంలోని మంచిలో మాత్రమే మనకు భాగం ఉందని, చెడులో భాగం లేదని, బాధ్యతా లేదని అనుకోవడం అన్యాయం. 'పిదపకాలం పిదప బుద్ధులు' అనుకోవడం సహజమే అయినా- కాలం ఎప్పుడైనా ఒకటే. బుద్ధి మాత్రమే వక్రమార్గం పట్టింది. ఆ బుద్ధినే సంస్కరించుకోవాల్సి ఉంది. రాముడి కాలంలోనే రావణుడూ ఉన్నాడు. కృష్ణుడి కాలంలోనే దుర్యోధనాదులూ ఉన్నారు. 'పిదప కాలం' అని రాముడు వూరుకోలేదు. రావణ సంహారం చేశాడు. 'పిదప బుద్ధి' అని కృష్ణుడు చేతులు ముడుచుక్కూర్చోలేదు. పాండవుల ద్వారా ధర్మ సంస్థాపన చేశాడు. అధర్మాన్ని అణిచేందుకు, ధర్మ సంస్థాపన చేసేందుకు రాముడే దిగిరానక్కర్లేదు, కృష్ణుడే అవతరించనక్కర్లేదు. నాడు ప్రభుస్వామ్యం. రాజులుండేవారు. ధర్మరక్షణ ఆయనది బాధ్యత. నేడు ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు, ప్రతి పౌరుడూ ప్రభువే. ధర్మ రక్షణలోనూ ప్రతివారికీ బాధ్యత ఉంది. 'మేమేం చేయగలం!?' 'మేమొక్కరం ఏం చేయగలం!?'- చాలామంది వేసే ప్రశ్న ఇది. ఇంతకంటే మూర్ఖమైన ప్రశ్న మరోటి లేదు.
రామ సేతు నిర్మాణంలో హనుమంతుడు అప్రతిహత శక్తిమానుడై సముద్రాన్ని లంఘించాడు. ఒక అల్పప్రాణి ఉడుత ఇసుకలో దొర్లి, సిమెంటు పూతలా రాళ్ల మధ్య ఇసుకను రాల్చింది. దాని సేవను, శ్రమను, ప్రేమను హనుమంతుడి సమానంగా అంగీకరించి, రాముడు దాని వీపున శాశ్వత రామ నామాలను ముద్రించాడని చదువుకున్నాం. ఎవరి శక్తి వారిది. ఎవరి సమర్పణ వారిది. భావం ముఖ్యం. బాధ్యత ముఖ్యం. మహా వృక్షమైన మర్రిచెట్టు తన పరిమాణానికి తగిన కాయలు కాస్తే తన నీడలో విశ్రాంతి పొందే బడుగు జీవులు, అవి రాలి పడినప్పుడు గాయపడతారని- బఠాణీ గింజంత పళ్లను ఇస్తుంది. లేలేత నాజూకు గుమ్మడి తీగ, మోయలేనంత బరువైన గుమ్మడికాయల్ని తాను మోయలేకపోయినా నేల మీదే అల్లిబిల్లిగా అల్లుకుని, ఉన్నచోటే కడివెడంత కాయల్ని కాచి మనకు అందిస్తోంది. ఎంత ప్రేమ! ఎంత బాధ్యత! ఎంత త్యాగం! మనిషెందుకలా ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకలా చేయలేకపోతున్నాడు! ఈ లోకం మనది. ఈ సమాజం మనది. ఎవరికేం చేసినా అది మనకు మనం చేసుకున్నట్లే. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే నేనొక్కణ్నీ ఏం చేయగలను? ఇంత విశాల ప్రపంచాన్ని నేనేం సంస్కరించగలను? అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టిన గాంధీజీ సైనికుడిలా సమరానికి సమయాత్తమై నిశ్శబ్ద యుద్ధభేరి మోగించారు. మొదట నిలబడింది ఒక్కడే. ఆ తరవాతే కోట్లాది భారతీయులు ఆయన్ననుసరించారు. ప్రపంచమంతా అల్లుకుపోయిన నిరీశ్వర వాదాన్ని తుత్తునియలు చేసి పాదచారియై భారతదేశమంతా ముమ్మారు సుడిగాలి పర్యటన చేసి, ఈశ్వర తత్వాన్ని, అస్తిత్వాన్ని, అద్వైతాన్ని స్థాపన చేసింది చిరుప్రాయపు శంకర భగవత్పాదుడొక్కడే.

విషయం ఏదైనా సాధ్యాసాధ్యాలు, కాఠిన్యసౌమ్యాలు ఎంచక, అసలా ఆలోచనే లేక బాధ్యతను గ్రహించినవాడు, అంగీకరించినవాడు 'ఒక్కణ్నా!' అని వెనకడుగు వేయడు. పదిమంది పిల్లల తండ్రి కూడా 'ఒక్కణ్నే!!!' అని గుండెలు బాదుకుని పిల్లల బాధ్యతను విస్మరించడు. ఈ ప్రపంచం పట్ల మనకు బాధ్యతే ముందు... తరవాతే హక్కు. తన గూట్లో కోయిల గుడ్లను పొదిగి ఆ పిల్లలను ప్రపంచ తోటకు 'పాటల మేళా'కు అందించే కాకులున్న ప్రపంచం మనది. బలహీనమైన తీగలను ప్రేమమీద, హృదయంమీద పైపైకి ఆహ్వానించి గుండెలమీద విశ్రమించనిచ్చే వృక్షాలు పెరిగే ప్రకృతి మనది. మనుషులం మనం. మనసున్నవాళ్లం. మానవత్వమున్నవాళ్లం. అన్యాయాన్ని, అవినీతిని గెలవటం అరచేతిలోని ఉద్దరిణతో జలాన్ని ఔపోసన పట్టినంత నీలాజాలం. ఔను... సముద్రాన్ని ఔపోసన పట్టిన జాతి మనది. మనుషుల కోసం పక్షులు (జటాయువు), పక్షుల కోసం మనుషులు (శిబి చక్రవర్తి) శరీరాన్ని త్యాగం చేసిన నీతి మనది. ప్రపంచ సామ్రాజ్యం మీదే శ్వేత శాంతి బావుటా ఎగురవేయాల్సిన బాధ్యత మనదే.


- చక్కిలం విజయలక్ష్మి