ᐅకాలం విలువ




కాలం విలువ 

మనిషి గుండె అత్యంత లయబద్ధంగా 'లబ్-డబ్' అంటూ సంగీత ధ్వనులు చేసు కొంటూ అనుక్షణం మృత్యువు వైపు పయనిస్తుంటుందని ఆంగ్లకవి హెచ్.డబ్ల్యు.లాంగ్‌ఫెలో వ్యాఖ్యానించారు. అంటే, క్షణాలు గడుస్తున్న కొద్దీ మనం మరణానికి చేరువవుతున్నట్లే. అందరికీ ఈ స్థితి అనివార్యమని తెలిసినప్పటికీ... పోయిన వారి కోసం పోబోయేవారు విచారించడం సృష్టిలోని పెద్దవింతగా హిరణ్యకశిపుడు, ధర్మరాజు విస్మయం వ్యక్తం చేస్తారు. మరి ఇంత విలువైన కాలాన్ని ఎంత మంది సద్వినియోగం చేసుకొంటున్నారు?
మన దైనందిన జీవితాల్లో రోజులో అత్యధిక భాగం అనవసర విషయాలకే వెచ్చిస్తుంటాం. ప్రాధాన్య క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. విజ్ఞానాన్ని పక్కనపెట్టి వినోదానికి పెద్దపీట వేస్తుంటాం. అర్ధరాత్రీ అపరాత్రీ అని లేకుండా టీవీలకు అతుక్కుపోతున్న వారెందరో. మనకిష్టమైన అభిరుచులను ఆస్వాదించడం తప్పు కాదు గానీ... విలువైన వాటిని విస్మరించి మన ఆధీనంలో లేనివాటివెంట పరుగులెందుకు? మన స్వాధీనంలో ఉన్న జ్ఞానతృష్ణ తీర్చుకుంటే లబ్ధి పొందేది మనమే! దీనిలో ఓటమన్నదే లేదు కదా!

ప్రపంచంలో ప్రముఖులైన విద్యావంతులు, శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలను పరిశీలిస్తే... అత్యధికులు ప్రణాళికాబద్ధమైన జీవితాలు గడిపి ఒక్కో మెట్టూ అధిరోహించిన అలుపెరగని యోధులే! అలా విజయాలు సాధించుకుంటూ ముందుకుపోవడమొక్కటే వారికి తెలుసు. కాలం విలువ వారికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు. ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్నది ముందుగా నిర్ధారిస్తారు. వాటిని పకడ్బందీగా అమలు చేస్తారు. అందుకే వారు ఎప్పుడూ అందరికంటే ముందు వరసలో ఉంటారు. ఎందరికో ఆదర్శప్రాయులవుతారు.

అంతిమ క్షణాల్లో రావణబ్రహ్మ లక్ష్మణుడికి రాజనీతి వివరిస్తూ 'మంచి పనులు వాయిదా వెయ్యకు... కాలం విలువ మరచిపోకు' అని బోధిస్తాడు. కాలం విలువ తెలిసినవారే లక్ష్యాన్ని ఛేదించగలరు, అనుకున్నది సాధించగలరు. ఈ ప్రపంచాన్నే శాసించగలరు!


- కిల్లాన మోహన్‌బాబు