ᐅమోహమే మరణం
మనిషిని భ్రమింపజేసేదీ, సత్యం నుంచి వంచితుని చేసేదీ మోహమే. అశాశ్వతమైన వాటిపట్ల ఆసక్తిని, ఆకర్షణను, చివరకు విడదీయరాని బంధాన్ని కలిగించేది మోహమే. మనిషి పదేపదే మోహంలో పడి మోసపోతూ, పశ్చాత్తాపపడుతూ జీవితగమనాన్ని సాగిస్తుంటాడు.
మోహం వల్లనే ఆత్మజ్ఞానాన్ని పొందలేక, పొందినా నమ్మలేక మనిషి సతమతమవుతుంటాడు. మోహవశునికి కర్మబంధాలూ, దోషాలు తప్పవు. క్షీరసాగర మథనం కేవలం అమృతసాధనకోసమే దేవతలు రాక్షసుల మధ్య ఒడంబడికతో జరిగింది. చెరిసగం పంచుకోవాలన్న షరతు పెట్టుకున్నారు. చివరకు జరిగిందేమిటి? అమృతం లభించాక రాక్షసులు మోహిని అందానికి దాసులై, భ్రమచిత్తులై వంచితులయ్యారు. మరణాన్ని జయించాలనుకుని భంగపడ్డారు. మోహంవల్ల మరణం అనివార్యమైందన్నమాట. మోహిని పేరులోనే మోహం ఉంది. ఆ కథలో గొప్ప సందేశమూ ఉంది.
మోహంవల్ల కులక్షయం పొందిన ధృతరాష్ట్రుడూ గొప్ప ఉదాహరణగా మిగిలిపోయాడు. మితిమీరిన మోహమే వ్యామోహం. ధృతరాష్ట్రుడికి పుత్రవ్యామోహం. దుర్యోధనుడి చర్యలు అధర్మమైనవని తెలిసీ నివారించలేకపోయాడు. కులపెద్దలు, ఆచార్యులు, చివరకు శ్రీకృష్ణపరమాత్మ హితవుల్నీ పెడచెవిన పెట్టాడు. ఫలితంగా తాను జీవించి ఉండగానే నూరుగురు పుత్రులను పోగొట్టుకున్నాడు.
దుర్యోధనుడు రాజ్యవ్యామోహంతో మరణాన్ని కోరితెచ్చుకున్నాడు. రావణుడు స్త్రీవ్యామోహంతో మృత్యువుపాలయ్యాడు. బలిచక్రవర్తి త్రిలోకచక్రవర్తి కావాలనే అధికారవ్యామోహంతో పాతాళానికి దిగిపోయాడు. ఇలా మోహ వ్యామోహాల బారినపడిన వారందరూ పతనమయ్యారు.
ధర్మాన్ని ఆశ్రయించినవారికి మరణం ఉండదన్న పెద్దల మాటల్లో ఎంతో అంతర్థాముంది. ప్రపంచంలో అత్యధికులు శరీరంతోపాటు నశించిపోతారు. వారి మరణం తరవాత ఎవరూ వారిని స్మరించరు. దీన్నే మోహకారణ మరణమంటారు. కీర్తిని శాశ్వతం చేయగల ధర్మకార్యాలు చేయనివారు ఇలాగే మరణిస్తారు.
శ్రీరాముణ్ని 'రామోవిగ్రహవాన్ ధర్మః' అంటూ ధర్మస్వరూపుడిగా తరతరాలుగా స్మరిస్తూ పూజిస్తున్నాం. ధర్మంతో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
మనిషికి ధర్మవ్యామోహం ఉండాలి. కామవ్యామోహం కాదు. ధర్మమోహితులు ప్రాపంచికంగా కష్టాలు పడాల్సివచ్చినా, వాటిని ఇష్టంగా భరిస్తారు. సత్యహరిశ్చంద్రుడు సర్వస్వాన్నీ కోల్పోయినా ధర్మమార్గాన్ని వదల్లేదు. అందువల్లే ఆయన కీర్తికాయానికి మరణం లేదు.
స్వార్థపరులు, కామమోహితులు అన్యాయార్జితంగా కోట్లు కూడబెట్టినా, వారికి శేషకీర్తి అంటూ ఏమీ ఉండదు. అపకీర్తి మాత్రం తప్పక ఉంటుంది.
వ్యాధి అంటే వేధించేది. ధర్మవ్యాధుడనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన్ను ఎప్పుడూ ధర్మచింతనే వేధిస్తుండేది. ఆయన ఘనతను ఇప్పటికీ తలుస్తున్నామంటే ఆయన కీర్తి అజరామరమే కదా!
మనం కూడ ధర్మవ్యాధులం కావాలి.
అధర్మవ్యాధులం కాకూడదు. అప్పుడు మన కీర్తికాయానికి మరణం ఉండదు.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్