ᐅఎవరు త్రిగుణాతీతుడు?




ఎవరు త్రిగుణాతీతుడు? 

ప్రపంచంలోని జీవరాశులన్నీ ప్రకృతికి లోబడిఉన్నాయి. ఈ జీవరాశుల్ని ప్రకృతి మూడు గుణాలతో కట్టి జగత్ చక్రంలో గిరగిర తిప్పుతోంది. జీవచైతన్యం ఈ ప్రకృతి ప్రభావానికి గురికావటం వల్ల తనని తాను ప్రకటించుకోలేకపోతోంది. పరమాణువులో నిగూఢమైన శక్తి తమోగుణంవల్ల నిర్మాణమై ఉంది. అది మిగతా రెండింటిని- అంటే రజోగుణాన్ని, సత్వగుణాన్ని అణచిపెట్టిందన్నమాట. వృక్షజాతి విషయంలో ఇది కాస్త తారుమారుగా కనిపిస్తుంది. అందులోని ప్రాణశక్తి తమోగుణాన్ని దాటి రజోగుణం చేరుకోవటం వల్ల, జీవస్పందన ప్రకటితమవుతోంది. నీళ్లు లేకపోతే మొక్క వాలిపోతుంది. తగినంత సూర్యరశ్మి, నీటివనరు సమకూర్చగానే మళ్లీ అది జీవించగలుగుతున్నది. కాని, వాడిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవటానికి, చిగురించగానే ఆనందబాష్పాలు రాల్చటానికి దానికి సత్వగుణం అందుబాటులో లేదు. ఇక జంతువు విషయానికి వస్తే- తమోగుణం దండిగానే ఉన్నా, తామస సర్గానికి చెందిన ఈ జీవి, రజోగుణానికి దగ్గర కావటం వల్ల మనోవికారాలకు స్పందించగలుగుతోంది. సత్వానికి దూరంగా ఉంటూనే బాధ్యతారహితంగా జీవిస్తోంది. పులికి జంతువుల్ని వేటాడి కడుపు నింపుకోవటం తప్ప పాపపుణ్యాలు బేరీజు వేసుకొనే పరిస్థితి లేదు. అలా వేటాడి చంపేది పులి కాదు- దాని సహజమైన ప్రకృతి. ఆకలి తీరాక చంపకపోవటమూ సహజత్వమే.
మానవ జన్మ ఈ మూడింటికీ భిన్నంగా ఉన్నతమైందని గుర్తింపు పొందడానికి కారణం- బుద్ధి. గమనించటం, అర్థం చేసుకోవటం, అంగీకరించటం, ఒప్పుకోకపోవటం, ఇవ్వటం, ఆపటం- ఇలాంటి లక్షణాలు బుద్ధిజీవికి మాత్రమే సాధ్యం. మరోరకంగా చెప్పాలంటే, మిగత జీవరాశులు తమ స్వభావానికి అనుగుణంగా మసలుకొంటాయి. మనిషి బుద్ధిజీవి కాబట్టి స్వధర్మానికి కట్టుబడి జీవనం కొనసాగించాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని ఆరంభంలోనో ఆ తరవాతనైనా ఉపయోగించుకోకపోతే, ఓ మెట్టు దిగినట్టే. తమో రజో గుణాలను నివారించి సత్వగుణాన్ని పెంపుచేసుకునే అవకాశం నిరర్థకం అయిపోతుంది. భవ్య జీవితాన్ని సుసంపన్నం చేసుకుని దివ్యమానవుడిగా ఎదగటానికి ఈ సత్వగుణాన్ని ఒక సోపానంగా ఉపయోగించుకోవాలి.

దివ్య జీవనానికి సాత్విక గుణ సంపన్నత మాత్రమే చాలదు. తాను మంచివాడు, మంచి పనులు చేస్తున్నానన్న భావన ఒక బంగారు సంకెలగా మారిపోగలదు. ఆకుచాటు పిందెలా పిసరంత అహంకారం ఆ భావనలో కనిపిస్తుంది. సత్వ, రజో, తమో గుణాలు మూడింటికి ఆవల- 'పెను చీకటికవ్వల' వెలుగు చూడగలవాడే దివ్యమానవుడు! దివ్య మానవుడు దేవతా వస్త్రాలు ధరించి, ఆకాశపుటంచుల దాకా ఎగిరిపోనవసరం లేదు. ఈ లోకంలో జీవిస్తూ ప్రాకృతిక శక్తుల్ని అదుపు చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఏ కోరికలూ బంధించలేవు. ఏ కర్మఫలమూ శాసించలేదు. అతను కొందరు కోరుకునే మోక్షాన్ని కూడా ఆశించడు. త్రిగుణాతీతుడైన వ్యక్తే జీవన్ముక్తుడు. స్థితప్రజ్ఞుడు, భగవద్భక్తుడు, అతివర్ణాశ్రమి- అన్నీ ఆ పేరుకు పర్యాయపదాలు.

- వి. రాఘవేంద్రరావు