ᐅవైరాగ్యపాఠాలు




వైరాగ్యపాఠాలు 

మనిషి జీవితాన్ని అనుక్షణం దైవమాయ ప్రభావితం చేస్తుంటుంది. దీని కారణంగానే మనిషి సమస్యలు, సంఘర్షణలు, ఆనందం, విషాదం వంటి అనుభవాలు పొందుతుంటాడన్నది ఆధ్యాత్మికవాదుల మాట.
మాయ ప్రధానలక్షణం భ్రమ.

ప్రపంచంలో మనం చూసేవన్నీ భ్రమలే.

భ్రమను వేదాంతులు మిథ్య అనీ అంటారు.

మిథ్యావేదాంతం ఆధ్యాత్మ ప్రయాణంలో ఆఖరి మజిలీ. ఆ మజిలీకి అందరూ చేరుకోలేరు. కొందరికి జీవితకాలం పట్టవచ్చు. అదృష్టవంతులు అనతికాలంలోనే చేరుకోవచ్చు.

సద్గురువు లభించడమే అదృష్టం.

సద్గురువుకు మంచి శిష్యుడైతేనే ప్రయోజనం ఉంటుంది. సద్గురువుకు సర్వశరణాగతి చేయడం ద్వారానే సంపూర్ణ అనుగ్రహానికి అర్హత లభిస్తుంది. అప్పుడు సద్గురువు అమూల్యమైన ఆధ్యాత్మిక సత్యాలను అవగాహనాత్మకంగా బోధిస్తాడు!

అందరికీ సద్గురువులు లభించరు కద?

మరి, వారి పరిస్థితి ఏమిటి?

సద్గురువు లభించకపోయినా 'విధి' అదృశ్యంగా అదే పాత్రను పోషిస్తుందన్నది పెద్దల మాట.

అదెలాగో చూద్దాం.

త్రిగుణాల ప్రభావంవల్ల మనిషి అనేక కోరికలు కలిగి ఉండి, అవి నెరవేరటానికి అనేక పద్ధతులు అవలంబిస్తుంటాడు. వాటిలో దైవ ప్రార్థనలు, మొక్కుబడులు, పూజలు, కానుకలు- ప్రముఖస్థానం వహిస్తాయి. భగవంతుడు శిలారూపంగా ఉండకపోతే భక్తుల కోరికల ఘోషతో బధిరుడవటమో, పారిపోవటమో జరిగేదేమో.

భగవంతుడు తన కోరికలు తీర్చాడని మనిషి భావించినప్పుడు మహదానంద పడిపోతాడు. తీరని కోరికల గురించి నిత్యప్రార్థనల్లో విసిగిస్తూనే ఉంటాడు. కానీ, ఎంత ప్రార్థించినా కొన్ని కోరికలు తీరవు. అవి అలా తీరని కోరికల్లా మిగిలిపోతాయి. అప్పుడు బహుకాల ప్రార్థనలతోనూ కోరికలు తీరకపోవడంవల్ల మనిషిలో నిరాసక్తత ఏర్పడుతుంది. 'ఇక ఈ కోరిక తీరదు' అని అర్థమయ్యాక వైరాగ్య భావనలు మొదలవుతాయి. ఈ స్థితినే వేదాంతులు 'అభావే విరక్తిః' అంటారు. ఏది అలభ్యమో, అది విరక్తిని కలిగిస్తుంది.

ఇలాంటి ఆశాభంగాలు అధికంగా కలగడానికి అతిగా ఆశలు కలిగి ఉండటమే కారణం. సత్వగుణం కలవారు దీనికి సవ్యమైన అర్థాలు చెప్పుకొంటారు. 'ఇలాంటి కోరికలు పెట్టుకోవడం నాదే తప్పు' అని దారితప్పిన ఆలోచనల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి తెచ్చుకుంటారు. ఇలాంటి స్వయం నియంత్రణకు దోహదపడేదే విధిలీల. జీవితానుభవాల ద్వారా 'విధి' మనకు అనేక ఆధ్యాత్మిక మౌన బోధలు చేస్తుంటుంది. ఆ విధంగా అది 'సద్గురు పాత్ర' పోషిస్తున్నట్లే కదా!

ఈ సందర్భంగా రవీంద్రనాథ్ టాగూర్ కవిత స్మరించుకుందాం 'భగవంతుడా! నా కోరికల్ని తీర్చినందుకు కృతజ్ఞుణ్ని. మరెన్నో కోరికలు నువ్వు తీర్చలేదు. అందుకు అత్యంత కృతజ్ఞుణ్ని!' ఆలోచించండి. ఇందులోని ఆధ్యాత్మికతను గుర్తించండి.


- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్