ᐅసత్య సౌందర్యం



సత్య సౌందర్యం 

ఒక సిద్ధార్థుడు, ఒక అశోకుడు, ఒక విశ్వామిత్రుడు, ఒక జనకుడు, ఇంకా ఎందరో, ఎందరెందరో... ఎవరూ వీళ్ళంతా? క్షత్రియులు, రాజులు, రారాజులు, మహా ఐశ్వర్యవంతులు! రాజభోగాలు, అధికారం, స్వేచ్ఛ... ఈ అన్నీ కాదనుకుని, కాలదన్నుకుని ఎందుకు కఠినతరమైన సత్యశోధనా మార్గాన్ని పట్టారు? ఎందుకంటే అదృష్టవశాన కానీ, జన్మజన్మల సుకృత ఫలాన కానీ వారిలో నిత్యానిత్య వస్తు వివేకం మేల్కొంది. సత్యం ఏది, మిథ్య ఏది అన్న జిజ్ఞాస రగుల్కొంది. నిప్పుల మీద నడిచినట్లు 'సంసారం' తరిమికొట్టింది. ముఖ్యంగా లీలామాత్రంగా అవగాహనలోకి వస్తున్న 'సత్యసౌందర్యం' వారిని పరమ పథాన కాలుపెట్టించింది. వారివారి మనో పరిపక్వత రీత్యా, జిజ్ఞాస తీవ్రత రీత్యా సత్యశోధనతో సాధనా మార్గాన్ని ఎన్నుకుని సాగిపోయారు.
ఎందరెందరో జ్ఞానులు, సత్యాన్వేషణకై ఎన్నెన్ని మార్గాలను ఆవిష్కరించారు? ఆ సత్య సౌందర్యాన్ని కనీసం వూహామాత్రంగానైనా, లీలామాత్రంగానైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, 'కనీస ప్రయత్నం' చేసినప్పుడు ఈ ప్రాపంచికమైన సాధనలు, శోధనలు ఎంత అల్పమైనవో, ఎంత రుచిహీనమో కొంత తెలిసివస్తుంది. హిమాలయాల ముందు చిన్న రాళ్ల దిబ్బల్లా, సాగరం ముందు పిల్ల కాలువల్లా... హాస్యాస్పదంగా! ఒక ఎవరెస్ట్ శిఖరారోహణ, ఒక చంద్రమండల యాత్ర... సాధారణ మానవ దృష్టికి గొప్ప ఆవిష్కరణలుగా, గొప్ప విజయాలుగా తోచవచ్చు. కానీ జ్ఞానమార్గావలంబికి ఒక నిర్లిప్త పరిశీలనా మాత్ర వీక్షణం. అంతే. సువిశాల, సమున్నత హిమాలయ పర్వత పాదం దగ్గర ఓచోట చిన్న అణుమాత్రంగా నిలబడి అచ్చెరువుగా చూస్తున్న వ్యక్తికి కలిగే న్యూనతా భావమే సత్య శోధకుడికి తనలోని భౌతిక ప్రీతి పట్ల కలుగుతుంది. సముద్రమంత సత్యం ముందు అసలు పరిగణనలోకే తీసుకునే వీలు లేనంత, బుడగంత తన జీవిత పరిధి, ప్రమాణం... నిజమైన సాధకుడికి, శోధకుడికి విరక్తిని, వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అయితే ముందు ఆ దృష్టి ఏర్పడాలి. అలా పోల్చి, చీల్చి చూసుకునే జిజ్ఞాస ఏర్పడాలి. అలా ఏర్పడినవాళ్లే సిద్ధార్థుడు మొదలైనవారు.

ప్రపంచంలో నిండా మునిగినవాడికి అర్థం కాదుకానీ సత్యపథం అత్యంత ఆకర్షణీయం. అలెగ్జాండర్‌వంటి యుద్ధ పిపాసినీ ఆకర్షించి క్షణాల మీద వైరాగ్యవంతుణ్ని చేసింది. వివేకాన్ని మేల్కొల్పింది. విశ్వవిజేత అయినా వెంట తీసుకువెళ్ళేదేమీ లేదనే సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేలా తన ఖాళీ చేతుల్ని బయటికి కనిపించేలా తనను సమాధి చేయాలని కోరాడు. ఏమీ తీసుకువెళ్ళేది లేనప్పుడు దేనికోసమో అమూల్యమైన, దుర్లభమైన జీవిత పరమార్థాన్ని పణం పెట్టవలసిన అవసరం లేదు. దేని కోసం ఈ మానవ జన్మ లభించిందో ఆ స్పృహతో జీవించాలి. అదే ధర్మపథం, పరమపథం, సత్యపథం.

మనం కూడా ఆలోచించాలి. భౌతిక దృష్టికి ఎంతో గొప్పవనుకున్న, అన్ని విధాలా ఐశ్వర్యవంతమైనవనుకున్న తమ జీవితాలను కడగంటనైనా చూడకుండా సత్యమార్గం వైపు కట్టుబట్టలతో, ఇంకా కౌపీనధారులై వెళ్లిపోతున్నారంటే- అది ఇంకెంత ఆకర్షణీయమైన, ఐశ్వర్యవంతమైన, ఆనంద రసపూర్ణమైన జీవితమై ఉండాలి? ధన, సౌందర్య, అధికార అహంకారాలన్నిటినీ పాము కుబుసంలా ఉన్నపాటున విడిచి నిర్లిప్తంగా వెళ్ళిపోతున్నారంటే- ఆ సత్యసౌందర్యం ఇంకెంత అద్భుతమై ఉండాలి! బంధుప్రీతి, మమత్వం శోధకుడి నిర్వికారపు చూపు కింద ఆవిరైపోతున్నాయంటే- ఆ భగవదున్మత్తత, ఆయన ప్రేమ ఎంత గాఢమై ఉండాలి!


- చక్కిలం విజయలక్ష్మి