ᐅబుద్ధ జయంతి




బుద్ధ జయంతి 

జనన మరణాల రహస్యం ఏమిటి? ఈ దుఃఖాలు, కష్టాలు, బాధలు, ఎందుకు? వీటికి మూలం ఏమిటి? వీటికి అంతం లేదా? ఇలా... అనేకానేకమైన ప్రశ్నలు మెదిలాయి ఒక రాకుమారుడి మదిలో. వాటికి సమాధానాలు అన్వేషించడానికి భార్యను, బిడ్డను, రాజ్యాన్ని, సర్వసౌఖ్యాలను విడిచి మహాభినిష్క్రమణ చేశాడతడు. ఫలితంగా 'సంబోధి' (జ్ఞానోదయం) పొందాడు. అది పొందినవాడు కాబట్టి అతడికి 'బుద్ధుడు' అనే పేరు వచ్చింది. అతడి అసలు పేరు సిద్ధార్థుడు. పినతల్లి అయిన గౌతమి పెంపకంలో పెరిగాడు. అందువల్ల 'గౌతముడు' అనీ పిలుస్తారు అతడిని.

సిద్ధార్థుడు పుట్టినప్పటి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు, రెండు రకాల ఫలితాలు చెప్పారు. 'ఈ జాతకుడు బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఉంటే చక్రవర్తి అవుతాడు. లేకపోతే విరాగి అయి లోకోపకారం కోసం ఇల్లు విడిచి వెళ్లిపోతాడు' అని చెప్పారు. అందుకే సిద్ధార్థుడికి రాజమందిరంలోనే సకల సౌకర్యాలు ఏర్పరచాడు చక్రవర్తి అయిన తండ్రి. కష్టం అనే పదమైనా తెలియకుండా పెంచాడు. పెద్దవాడయ్యాక లోకోత్తర సౌందర్యవతి అయిన యశోధరతో వివాహం జరిపించాడు. ఆమె సాహచర్యంలో సకల సౌఖ్యాలు పొందుతున్న సమయంలో... అనుకోకుండా చూసిన విషాద దృశ్యాలు అతడి మదిని కలచివేశాయి. ఆ స్థితిలో ఉన్న అతడికి వృద్ధాప్యం, వ్యాధులు, మరణం లాంటి వాటి గురించి సమగ్రంగా వివరించాడు- ఎప్పుడూ వెన్నంటి ఉండే 'ఛన్నడు' అనే సారథి. ఆ మాటలు విన్న సిద్ధార్థుడిలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను సైతం విడిచి సత్వాన్వేషణకు బయలుదేరాడు. 'ఉరువేల' అనే ప్రదేశంలో తపస్సుకు కూర్చున్నాడు. అనేక అడ్డంకుల తరవాత జ్ఞానోదయమైంది. మానవుల కష్టాలకు, బాధలకు, మూలం ఏమిటో అర్థమైంది. వాటి నివారణకోసం ఒక మార్గాన్నీ కనుగొన్నాడు. అదే అష్టాంగయోగం. అందులో ఎనిమిది సూత్రాలు. అవన్నీ ఎవరికివారే సులువుగా అవలంబించగలిగేవి. తద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడేవి. పాళీ భాషలో వాటి పదాలు యథాతథంగాను, సంస్కృతంలో పలికే తీరు, వివరణలు.

  • సమ్మాదిట్టి (సమ్యక్‌దృష్టి): కావలసింది ఏది, అక్కర్లేనిది ఏదనే వివేచన దృష్టి కలిగి ఉండు.

  • సమ్మా సంకప్పో (సమ్యక్‌సంకల్పం): దేనివల్ల మంచి జరుగుతుందో దాన్ని సంకల్పించుకో.

  • సమ్మా వాచా (సమ్యక్ వచనం): ఎదుటి వారికి మంచి, ఆనందం కలిగే విధంగా మాట్లాడాలి. తద్వారా నీవూ ఆనందం పొందగలగాలి. అలాంటి మాట తీరును అలవాటు చేసుకో.

  • సమ్మా కమ్మలతో (సమ్యక్ కర్మ): పరులకు ఉపకారం, సాటివారికి సాయం చెయ్యి. ఆ కర్మ ఫలితంగా నువ్వు సత్ఫలితాలు పొందుతావు.

  • సమ్మా జీవో (సమ్యక్ జీవనం): నియమానుసారం నీతిమార్గాన జీవించు. అదే నీ జీవిత ఔన్నత్యానికి జీవగర్ర.

  • సమ్మా వాయామో (సమ్యక్ వ్యాయామం): మనోధైర్యం, ఆత్మ నిగ్రహం, ఆత్మ స్త్థెర్యం కలిగి ఉండే ఆలోచనలు చేయడం మానసిక వ్యాయామం. దాన్ని చేస్తే మనసంతా ఆరోగ్యమే... దానితో పాటు శరీరం కూడా.

  • సమ్మా సతి (సమ్యక్ స్మృతి): మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటావు. దానివల్ల నీకూ ఇతరులకీ మేలు జరుగుతుంది.

  • సమ్మా సమాధి (సమ్యక్ సమాధి): నిన్ను నీవు ఉద్ధరించుకోవడం కోసం నీలోకి నీవు అంతర్ముఖుడవై ఉండు. నిత్యం నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడమే సమ్యక్ సమాధి.

పైవన్నీ ఆచరించగలిగితే నిన్ను ఎవరో ఉద్ధరించనక్కరలేదు, నీవే ఉద్ధరించుకోగలుగుతావు అని బోధించాడు. ఆ బోధనలను అనుసరించే వారంతా బౌద్ధులు అని, వారు అనుసరించే మతం బౌద్ధమతమనీ ప్రసిద్ధి పొందింది.


- అయ్యగారి శ్రీనివాసరావు