ᐅతారకమంత్రం
ఈ ప్రపంచం మనల్నించి ఎప్పుడూ అద్భుతాలనే ఆశిస్తుంది. ఒక్కసారి కాదు. ప్రయత్నించిన ప్రతిసారీ. మైదానంలో అడుగిడిన ప్రతిసారీ సచిన్ శతకం కొట్టాలి. ప్రాంగణంలో ఆడిన ప్రతిసారీ సానియా గెలవాలి. వేదికపై జకీర్ హుస్సేన్ ఎల్లప్పుడూ సభికుల్ని రంజింపజేయాలి... ఇది అన్నిసార్లూ సంభవమా? కాదు. చిత్రమేమిటంటే వాళ్ళు తరచుగా విజేతలు కావటం ఎవరికీ వింతకాదు. ఒక్కోసారి ఓడిపోవటమే ఎంతోమందికి కలిగే ఆశ్చర్యం!
గొప్ప విజేతలే ఒక్కోసారి ఘోరంగా పరాజితులు కావటం జరుగుతుంది. ఎందుకని? పరిపూర్ణ విజయరహస్యాన్ని రుషులీవిధంగా నిర్వచించారు- గమ్యసాధనకు మనిషి నిర్విరామ కృషిచేయాలని, ఏ క్షణంలోనూ పట్టు సడలించకూడదని. మనుషులంతా పుట్టుకతో మేధావులు కారు. మేధ, మూర్ఖత్వం మనిషిలో కలగలిసే ఉంటాయి. చేపట్టిన పనిలో ఏకాగ్రత, పట్టుదలల్నిబట్టి వాటి పాళ్లు మారిపోతుంటాయి. ప్రతి మనిషిలోనూ ఆత్మ ఒక్కటే. కానీ, శరీరంలోనే ఆ అంతరం ఉంటుంది.
సృష్టిలో ప్రాథమిక వర్ణాలు- ఎరుపు, నీలం, పసుపు పచ్చ. వీటిని రకరకాల పాళ్ళల్లో కలిపితే అనేక రంగులు ఏర్పడతాయి. అలాగే సత్త్వ రజో తమో గుణాల నిష్పత్తే మనిషిని తీర్చిదిద్దుతుంది!
ప్రశాంతత, జ్ఞానతృష్ణ, పరిపూర్ణతలతో శోభిల్లే మనిషి మనసు సత్త్వగుణ పూరితం. ఏకాగ్రతతో కూడిన గమ్యసాధనపైనే ఉంటుంది అతని దృష్టి. ఒక శాస్త్రజ్ఞుడు, కవి, తత్వవేత్త... వీరీకోవలోకి వస్తారు. కోరిక, అహం, స్వార్థంతో నిండిన మనిషి మనసు రజోగుణ భరితం. ఆలోచనల్లో లోపాలు, ప్రయత్నంలో అవకతవకలు, గమ్యాన్ని సుగమం చేయవు. దీనికతడు ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఇతరులతో వైరం, అంతర్మథనం, దుర్భర దుఃఖం వెంటాడుతూంటాయి. సాధారణంగా ఒక వ్యాపారి, పారిశ్రామికవేత్త, ఉద్యోగస్థుడు... వీరీ కోవలోకి వస్తారు.
తమోగుణ పూరితుడికంతా అగమ్యగోచరమే. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో తెలియదు. సోమరితనం అతడికి ఇష్టం. శారీరక జడత్వమే అతడి తత్వం. విజ్ఞుల సలహాలితనికి విషం. ఇంకొకరు ఎలా సుఖపడుతున్నారో చూసి నేర్చుకోడు సరికదా, తనకేది నిజంగా సుఖాన్నిస్తుందో కూడా గుర్తించడు. ఇక పరులకితడు ఉపయోగపడటం ఎలా సాధ్యం?
అదృష్టవశాత్తూ మనిషి మారడానికి భగవంతుడు అన్ని అవకాశాలూ సమకూరుస్తాడు. పుట్టుకతోనే పరిపూర్ణత ఎలా సాధ్యంకాదో ఒకే గుణంతో జన్మించటమూ జరగదు. పరిశీలనతో, అనుభవంతో, చిత్తశుద్ధితో ఈ మూడు గుణాల నిష్పత్తినీ మార్చుకుంటూ చివరికి అత్యుత్తమ దశకు చేరుకోవచ్చు. తమో గుణాన్ని తొలగించుకుంటూ, రజోగుణాన్ని తగ్గించుకుంటూ, సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ మనిషి చేసే ప్రయత్నం సర్వోత్తమం. చివరికి గమ్యం చేరలేకపోయినా అతని జీవితం అగమ్యగోచరం కాదు. ప్రయత్నలోపం లేని అతని ప్రగతి పథం దూరం కాదు. అవిరళ కృషే విజయానికి దగ్గరి దారి. ఇదే తారకమంత్రం!
- తటవర్తి రామచంద్రరావు