ᐅదారి తప్పిన దారులు
మనిషి ఎప్పుడు పుడతాడో, ఎంత కాలం జీవిస్తాడో, ఎప్పుడు మరణిస్తాడో ఎవ్వరూ చెప్పలేరు. పుట్టిన ప్రతి మనిషీ తన జీవితకాలాన్ని సుఖమయం చేసుకోవాలనీ, మనశ్శాంతి సంపాదించుకోవాలనీ ప్రయత్నిస్తుంటాడు. అలాంటి మనిషికోసం మహర్షులు మూడు దారులు చూపించారు. అవే కర్మ-భక్తి-జ్ఞానాలు.
కర్మ చేయకుండా మనిషి ఒక్కక్షణం కూడా ఉండలేడని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. మనిషి తనకూ, తన చుట్టూ ఉన్న సమాజానికీ హితాన్ని కలిగించే కర్మలే చేయాలనీ, హితంకాని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని శాస్త్రం చెబుతోంది. కర్మ అంటే కేవలం బాహ్యంగా కనబడే ఇంద్రియాలను నిగ్రహించడం కాదనీ, మనసునూ నియంత్రిస్తేనే కర్మ అవుతుందనీ పెద్దలమాట. కర్మలు చేసే సమయంలో వాటి ఫలాలకోసం ఎదురుచూడటం, అవి రాకపోతే దుఃఖించడం మానవనైజం. ఇది చాలా పొరపాటు పద్ధతి అనీ, కర్మల్ని ఆచరించి వదిలేయాలే కాని, ఫలాలవెంట పరుగులు తీయరాదని భగవద్గీత చెబుతోంది. అన్ని ప్రయత్నాలూ సక్రమంగా చేసి, ఫలితంమీద దృష్టిపెట్టకుండా ఉండటమే 'కర్మ'.
భక్తి గురించి సామాన్యుడు అనుకునేది ఒకటైతే, శాస్త్రాలు చెబుతున్నది మరొకటి. సాధారణంగా బాహ్యపూజలు, నియమాలు, తీర్థక్షేత్ర సందర్శనలు, వ్రతాచరణలూ... ఇవే భక్తికి స్వరూపాలని చాలామంది అనుకొంటారు. కానీ సర్వప్రాణులమీద దయగలిగి ఉండటం, ఏ ప్రాణినీ ద్వేషించకపోవడం, ప్రాణులన్నింటితోనూ స్నేహభావంతో ఉండటం, కరుణ కలిగి ఉండటం, అన్ని సంపదలూ నావి కావనుకోవడం, అహంకారం అణువంతకూడా లేకపోవడం, సుఖదుఃఖాలను సమానంగా చూడటం, సహనాన్ని అన్ని వేళల్లోనూ కలిగి ఉండటం, ఎప్పుడూ సంతృప్తితో ఉండటం, యోగాన్ని నిరంతరం అభ్యసించడం, ఎప్పుడూ ఆత్మోన్నతికై ప్రయత్నం చేస్తూ ఉండటం, దృఢసంకల్పాన్ని కలిగి ఉండటం, భగవంతునికి మనసునూ, బుద్ధినీ అర్పించడం, ఎవరికీ కించిత్తుకూడా బాధను కలిగించకపోవడం, ఉద్వేగానికి గురికాకుండా ఉండటం, అసూయ లేకపోవడం, భయం లేకపోవడం, దేన్నీ కాంక్షించకపోవడం, పవిత్రంగా జీవించడం, శరీరాన్ని, ఇంద్రియాలనూ, మనసునూ నిర్మలంగా ఉంచుకోవడం, అన్నింటినీ సాధించగల సామర్థ్యం కలిగి ఉండటం, అన్ని పనుల్లోనూ గర్వించకుండా ఉండటం 'భక్తి' అని భగవద్గీత చెబుతోంది. వీటిలో అన్నీ కాకపోయినా, కొన్నైనా ఉంటే చాలు- అలాంటివారే నిజమైన భక్తులు. వాసనలేని పూలు దేవునికి ఇష్టం కావు. సుగుణాలు లేని 'భక్తి' కూడా దేవునికి ఇష్టం కాకపోగా, కోపానికి కారణం అవుతుంది. కనుక సుగుణమే 'భక్తి' అని అందరూ గ్రహించాలి.
సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. ఏం తెలుసుకొన్న తరవాత, ఇక తెలుసుకోవలసింది ఏదీ మిగలదో అదే జ్ఞానం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అంటాడు. ఈ దృష్టితో చూస్తే లోకంలో 'మేము మహాజ్ఞానులం' అనుకుంటున్నవాళ్లలో చాలామంది అజ్ఞానులేనని బోధపడుతుంది. అందుకే 'జ్ఞాని', 'భగవంతుడు' ఒక్కడే. జీవులంతా అజ్ఞానులే. వాళ్ళ జ్ఞానం చాలా పరిమితం. స్వల్పాతిస్వల్పం. అంతదానికే ఎంతో విర్రవీగడం మనిషికి పుట్టుకతో వచ్చిన స్వభావమే కాని మరొకటి కాదు. గర్వించడం అజ్ఞానం. గర్వం లేకుండా ఉంటేనే జ్ఞానం. భగవంతుడు మాత్రమే శాశ్వతుడు, తదితరమైనదంతా అశాశ్వతం అని తెలుసుకోవడమే జ్ఞానం. దీన్ని తెలుసుకోవడానికే తపస్సులు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు.
మనిషిని సంపూర్ణంగా తరింపజేయవలసిన ఈ మూడు మార్గాలూ నేడు దారి తప్పుతున్నాయి. అన్నీ పనికిమాలిన పనులు చేస్తూ అవే సత్కర్మలని నమ్మించేవాళ్లు లోకంలో పుట్టుకొనివస్తున్నారు. నేడు ఘనకార్యాలంటే అవినీతితో పుష్కలంగా డబ్బు సంపాదించడం, శరీరం మత్తెక్కేంతగా సుఖపడటం అని చెలామణీలోకి వచ్చాయి. ఇదెంత ఘోరం! ఇక భక్తి గురించి చెప్పవలసిన పనిలేదు. రక్తికీ, భుక్తికీ ఇదొక సోపానం అని భావించేవాళ్ల సంఖ్య అమితం. సర్వస్వ పరిత్యాగమే భక్తి. అంతేకానీ, గుడినీ, గుడిలోని లింగాన్నీ కూడా మింగడం భక్తికాదని గ్రహించాలి. అన్నింటిపై నిస్పృహ ఉండడమే జ్ఞానం. సమదర్శనమే జ్ఞానం. అన్ని దోషాలనూ కడిగి వేసుకోవడమే జ్ఞానం.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ