ᐅవిగ్రహారాధన
నిరాకార భగవంతుణ్ని ఆరాధించడం, ఆలయాల్లోని సాకార విగ్రహాలను పూజించడం ఒక్కటే. నిజమైన తత్వవేత్తలు, నిరుపమాన భక్తులు విగ్రహాల్లో భగవంతుడి అలౌకిక సాన్నిధ్యాన్ని దర్శిస్తారు. ప్రతిమ భగవంతుని సన్నిధానానికి దివ్యప్రతీక. భగవంతుణ్ని మనసారా పూజించాలని, నిర్మల హృదయంతో ప్రార్థించాలని, ఏదో అడగాలని కాకుండా తమను సమర్పించుకోవాలని అనుకొనేవారు చాలా తక్కువమంది ఉంటారు. అటువంటివారు లక్షల్లో ఒక్కరుంటాడు. నిశ్శబ్ద నీరాజనమే నిజమైన పూజ. విగ్రహంలో సైతం విశ్వాతీత పరతత్వపు సజీవరూపం చూడగలిగినవారు ధన్యులు. భక్తి అన్నది భగవంతునిపట్ల వినమ్రభావంగా, సేవానిరతిగా భాసించాలి. భగవంతుణ్ని తలుచుకొని విలపించడం, యాంత్రికభజన చేయడంకన్నా అటువంటి భక్తి మరింత నిజం, మరింత శక్తి ప్రదం. మరింత దివ్యం.
భగవంతుణ్ని అన్వేషించడం, ఆయన అమృతస్పర్శకోసం ఆకాంక్షించడం, ఆయనకు సమీపంలో జీవించడం, ఆయనను తనవానిగా చేసుకోవాలనుకోవడం- ఇవన్నీ ఆంతరంగిక ఆరాధన అనవచ్చు. అప్పుడు భక్తుడే ఆలయం అవుతాడు. ఆలోచనలు, సంవేదనలు నిత్య ఆకాంక్షగా, నిత్య ప్రార్థనాగీతంగా రవళిస్తాయి. జీవితమే బాహ్యపూజగా, బాహ్యసేవానిరతిగా పరిఢవిల్లుతుంది. బాహ్యపూజను వదిలిపెట్టకూడదు. అది క్రమానుగతంగా అంతరంగ ఆరాధనగా, భక్తి ప్రవాహంగా మారుతుంది. ఆత్మతరంగమే మంత్రవాక్కుగా, సంకేత ఆచరణగా ఉప్పొంగుతుంది.
శివలింగంలో శివుణ్ని చూడగలిగిన నిరక్షరాస్యుడు కన్నప్పకు మోక్షం లభించింది. విగ్రహారాధనవల్ల కైవల్యం పొందవచ్చు. మనలో చాలామంది ప్రతిరోజూ ఆలయాలకు వెళ్తుంటారు. వారందరికీ ముక్తి వస్తుందా అని ఒక సందేహం. విగ్రహంలో భగవంతుణ్ని నేరుగా చూడగలిగినవారికి మోక్షం వస్తుంది. ఇది శాస్త్రప్రవచనం.
సంపూర్ణ సమర్పణ భావంతో, సముదాత్త ఆకాంక్షతో విగ్రహాన్ని ఆరాధిస్తే తప్పక మేలు కలుగుతుంది. మన ఆలోచనలు ఎక్కడో పెట్టుకుని, విగ్రహంలో భగవంతుణ్ని చూడలేకపోతే- అది రాయిలాగే నిలిచిఉంటుంది ఎప్పటికీ.
కోటానుకోట్ల లోకాలుగా, లక్షలాది జీవరాశులుగా భగవంతుడు కనిపించగలిగినప్పుడు, గుడిలో విగ్రహంగా మాత్రం ఎందుకు కనిపించడు- అన్న ప్రశ్నకు సమాధానం కూడా అందులోనే ఉంది.
- కె.యజ్ఞన్న