ᐅపద్మనాభ చతుర్దశి
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో విష్ణువు స్థితికారకుడు (పోషించేవాడు). ఇతడు ఆది, మధ్య, అంతం లేనివాడు. కాబట్టే 'అనంతుడు' అనీ నామాంతరం. ఇతడి నాభినుంచి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో బ్రహ్మ ఉద్భవించాడని, అక్కడినుంచే సృష్టి చేస్తూంటాడనీ పురాణ కథనం. ఈ నేపథ్యంలో విష్ణువుకు 'పద్మనాభుడు' అనే నామాంతరమూ ఉంది. అనంతుడైన పద్మనాభుడు కాబట్టి 'అనంత పద్మనాభుడు' అనీ మరొక నామం.
సృష్టికర్తకు సైతం ఒకస్థితి(ఉండేచోటు)ని కల్పించినవాడు కాబట్టి ఆ రకంగానూ విష్ణువు స్థితికారకుడే. సృష్టి గమనానికి, ఎదుగుదలకు, అభివృద్ధికీ దోహదం చేసేవాడు ఆ అనంతుడే. అంతటి వేలుపును, తమకు మంచిస్థితి కల్పించమని ప్రార్థించేటందుకు ఉద్దేశించిన తిథి అనంత పద్మనాభ చతుర్దశి. భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఈ వ్రతం చేయడం ఆనవాయితీ.
అనంత పద్మనాభ చతుర్దశి పండుగ కాదు. వ్రతం మాత్రమే. దీన్ని ఆచరించడానికి కొన్ని నియమాలు చెబుతున్నాయి పురాణాలు. త్రయోదశితో కూడిన చతుర్దశి పనికిరాదని, పూర్తి చతుర్దశి ఉన్న రోజైతే సాధారణ ఫలితం ఇస్తుందనీ, ఏమాత్రమైనా పున్నమి ఘడియలు కలగలిస్తే సర్వశ్రేష్ఠమనీ భవిష్యోత్తర పురాణం చెబుతోంది.
ఈ వ్రతానికి పద్నాలుగు (చతుర్దశి) సంఖ్యకు అవినాభావ సంబంధం బలంగా ఉంది. విష్ణువు ఏడేడు (ఏడు+ఏడు= పద్నాలుగు) లోకాలకూ స్థితి కారకుడు. ఆ పద్నాలుగూ భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకాలనే ఏడు ఊర్ధ్వలోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ... మొదలైన ఏడు అధోలోకాలు. వెరసి పద్నాలుగు. అందుకే ఆ సంఖ్యకు అంత ప్రాధాన్యమని విష్ణుపురాణ కథనం. పూజా విధానంలోనూ పద్నాలుగు సంఖ్యే అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. పద్నాలుగు పోగుల దారంతో తోరం (చేతికికట్టే కంకణం) తయారు చేయాలని, దానికి పద్నాలుగు ముడులు ఉంచాలని, ప్రతి ముడికీ పసుపు, కుంకుమలను అద్ది, అర్చించి, పూజానంతరం ధరించాలని విష్ణుపురాణం చెబుతోంది. పద్నాలుగు రకాల పిండివంటలను ఇరవైఎనిమిది చొప్పున (రెట్టింపు) నివేదన చేయాలి. వాటిలో పద్నాలుగు వాయనం ఇవ్వాలి. మిగిలిన పద్నాలుగూ ప్రసాదంగా స్వీకరించాలి. ప్రతి పద్నాలుగు సంవత్సరాలకూ(జీవితాంతం చేసే వ్రతం కాబట్టి) ఉద్యాపన చేయాలి. దానిలో భాగంగా పద్నాలుగు రకాల పిండివంటలను, పద్నాలుగు రకాల పూలను, పద్నాలుగు మంది సువాసినులకు వాయనం ఇవ్వాలనీ భవిష్యోత్తర పురాణం చెబుతోంది. యమునానది ఒడ్డున, సత్యసంధతకు నిదర్శమైన (గోవ్యాఘ్ర సంవాదంలో) గోవు సత్యనిష్ఠకు నిదర్శనంగా మొట్టమొదట ప్రారంభమైంది ఈ వ్రతం అని; అందువలన యమునా నదిని సైతం ఈరోజున పూజిస్తే అత్యంత పుణ్యప్రదమని శాస్త్రవచనం.
ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుకు వివరించినట్లు భాగవత కథనం. ధర్మరాజు అడిగిన ఒక ధర్మసందేహానికి సమాధానంగా కృష్ణుడు 'అనంతుడంటే నేనే... పగలు, రాత్రి, దిన, వార, పక్ష, మాస మొదలైన కాలం నా స్వరూపమే. ఇలా నా స్వరూపుడైన కాలపురుషుడే అనంత పద్మనాభుడు. అతడిని పూజిస్తే కాలపురుషుణ్ని పూజించినట్లే. కాలపురుషుని పూజించినవాడు సాక్షాత్ భగవత్స్వరూపుడు అవుతాడు' అని భాగవతం చెబుతోంది.
వ్రతవిధానం పరిశీలిస్తే- తెల్లవారుజామునే లేచి, శుచియై, తూర్పు, ఉత్తర, ఈశాన్య(అవకాశాన్ని బట్టి) దిక్కుల్లో ఏదో ఒకచోట గోమయంతో అలికి, అష్టదళ పద్మం అలంకరించి, దానిమీద పూర్ణకలశం ఉంచాలి. దాని పక్కన దర్భలతో పద్నాలుగు పడగలకు ప్రతీకగా ఆదిశేషుని (ఇతడికీ అనంత పద్మనాభుడనే నామాంతరం ఉంది) ప్రతిమను చేసి నిలపాలి. అప్పుడు షోడశోపచారాలతో, విష్ణు సహస్రసామాలతో పూజించాలి. పూజానంతరం, గతసంవత్సరం కట్టుకున్న తోరాన్ని విసర్జించి, కొత్తదాన్ని ధరించాలి. (ఒకసారి కట్టిన తోరం సంవత్సరకాలం ఉండాలనేది నియమం).
ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరించేది మహారాష్ట్రులు, రాజస్థానీయులు, వంగదేశీయులు అని చరిత్ర చెబుతోంది. దక్షిణాదిలో వైష్ణవ సంప్రదాయానుయాయులు ఎక్కువగా ఆచరిస్తారు. పద్మనాభ చతుర్దశినే ఉత్కళ ప్రాంతీయులు 'అఘోర చతుర్దశి'గా వ్యవహరిస్తారు. పాలీ చతుర్దశీ వ్రతం అని, కదళీవ్రతం అనీ కొన్నిచోట్ల పిలుస్తారు.
- అయ్యగారి శ్రీనివాసరావు