ᐅవాసన - ఉపాసన




వాసన - ఉపాసన 

'కన్నుమూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, ఈ మధ్యదే జీవితం!' అన్నాడో కవి. ఈ అత్యల్ప జీవితంలో ఘర్షణలు, సంఘర్షణలు, వేదనలు, ఆవేదనలు, కష్టాలు, సుఖాలు... అనంతం. వీటన్నింటికీ మూలం ఒకటే, వాంఛ! దీని విషవలయంలో చిక్కుకుని దైవోపాసనకు దూరమైపోతున్నాం. వాంఛనే 'వాసన' అంటారు. ఈ 'వాసన' లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అని మూడు రకాలుగా విస్తరించి మానవుణ్ని సంక్షోభంలో పడేస్తోందని ఆదిశంకరులు హెచ్చరించారు. మనుషులంతా ఏదో సమయంలో, ఏదో ఒక కారణంగా ఈ మూడు వాసనల్లో ఏదో ఒకదానికి బానిసలు అయిపోతున్నారు.
'ఈ లోకంలో ఎవ్వరూ నన్ను విమర్శించకూడదు... నాలోని లోపాలు ఎత్తి చూపకూడదు... నన్ను అంతా ప్రశంసించాలి... నా నడకను, నడతను మెచ్చుకోవాలి... నేను చెబుతున్నదీ, చేస్తున్నదీ సరియైనదేనని అంగీకరించా'లన్న బలమైన కోరిక మనసులో పాతుకుపోయిందంటే- అది 'లోకవాసన'. ముముక్షువు కాదలచుకున్నవాడికి ఇది పెద్ద అవరోధాన్ని కలిగిస్తుంది. భక్తిలతల్ని నిలువునా దహించే దావాగ్ని లాంటిది ఈ వాసన. మనిషి తనమాట, నడతను సరిదిద్దుకునే ప్రయత్నంలో సాధన చేయాలికాని, అవన్నీ మానేసి అంతా తననే పొగడాలి అని తపించటం, ఆరాటపడటం ఎంత అవివేకం!

తన గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడుకోకూడదని అనుకున్నా శ్రీరామచంద్రుడికే ఆరోపణలు తప్పలేదు. ఇక సామాన్య మానవుడి సంగతేం చెప్పగలం? మన ప్రయత్నం, కృషి, అధ్యయనం, సత్సంగం, సాధన, పట్టుదల సక్రమంగా ఉంటే- ఈ లోకవాసన నుంచి బయటపడగలం. సమాజంలో ప్రతివ్యక్తీ ఎదుటివాడిని పనికట్టుకుని విమర్శించటమో, ఆరోపణలు చేయటమో, దూషించటమో, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. తానేమిటో, తన గురించి తెలుసుకోలేకపోవడమే అందుకు ముఖ్య కారణం. ఇటువంటి లోకవాసనకు దాసుడైనవాడు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేడు. అటువంటివాడి దైవోపాసన నైష్ఠికతకు దూరమై కళంకితమవుతుంది. నిరర్థకమవుతుంది.

ఇక 'శాస్త్రవాసన'. 'శాస్త్రాలను విపరీతంగా అధ్యయనం చేయాలన్న తపన, కోరిక! ఇందులో పాఠవ్యసనం, శాస్త్రవ్యసనం, అనుష్ఠానవ్యసనం- అని మూడు విధాలు. ఎప్పుడూ చదువుతూనే ఉండాలనుకోడం పాఠవ్యసనం. ఉన్న శాస్త్రాలన్నీ పరిశోధించి ఔపోసన పట్టాలనుకోవడం శాస్త్రవ్యసనం; విపరీతమైన, మూఢాచారంతో అనుష్ఠానంలో మునిగిపోయి లౌకిక ధర్మాలను, వృత్తిధర్మాలను, ఆశ్రమ ధర్మాలను విస్మరించడం అనుష్ఠాన వ్యసనం. ఈ మూడు రకాల శాస్త్రవాసన మనిషికి విజ్ఞానాన్ని కలగజేస్తుందేమోకాని, జ్ఞానాన్ని ప్రసాదించలేదు. కొంతజ్ఞానం కలిగినా, దాన్నిమించిన అహంకారాన్ని మనసులో నింపేస్తుంది. ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోతే అంతా నిరర్థకమే! శాస్త్రపఠనంవల్ల ఎంతటి వైదుష్యాన్ని సంపాదించినా, సామాజిక జీవన ధర్మంతో దాన్ని సమన్వయం చేసుకోలేకపోతే అంతా వ్యర్థమే. అటువంటి శాస్త్ర పరిజ్ఞానం భుక్తికేకాని, ముక్తికి ప్రయోజనకారి కాదు. ధన సముపార్జనకై శాస్త్ర బోధన చేయడం మరింత పాపకృత్యం. శాస్త్రవాసన ఇటువంటి పాపకృత్యాలకే ప్రేరణ ఇస్తుంది.

మూడోది- దేహవాసన. ఇది మరీ ప్రమాదకరం. తన శరీరం మీది మమకారం, వాంఛ పెరిగినకొద్దీ మానవుడు భగవదుపాసనను నిర్మలంగా కొనసాగించలేడు. ఐహికాముష్మికాలను పెంచేది, అవి తీరిన కొద్దీ ఊరుతూండే వాసనలను ఉపాసించేది ఈ దేహవాసనే! మానవుణ్ని 'ఈ దేహమే నేను' అన్న భ్రమలో పడవేసి కోరికలకు రెట్టింపు దుఃఖాలను తెచ్చిపెట్టి జీవితాన్ని నరకప్రాయం చేసేది ఇదే! జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సౌశీల్యాన్ని, సామాజిక ధర్మాన్నీ దూరంచేసి అధఃపతనంలో నరుణ్ని పడవేసేది. దేవాలయంగా భావించదగిన ఈ దేహాన్ని నిర్మలంగా, పవిత్రంగా చూసుకోవలసిన మాట నిజమైనా, వ్యామోహ దాహానికి బలిచేయకూడదు. కోరికల పుట్టలు మొలిపించకూడదు. వాసన(వాంఛ) ఉప్పునీటి లాంటిది. ఉప్పునీరు తాగినకొద్దీ ఎలా దాహం పెరుగుతూంటుందో, తీరినకొద్దీ వాసనా పెరుగుతూనే ఉంటుంది. మోహం ఉన్నచోట మోక్షానికెలా తావుండదో, వాసన ఉన్నచోట ఉపాసనా అలాగే సార్థకం కాదు.

వాసనలను జయించిననాడు ఉపాసన సులభమవుతుంది. అప్పుడు ఉపాసనలో ఏకాగ్రత, నిష్ఠ, క్రమశిక్షణ, తాదాత్మ్యత సాధ్యమవుతాయి. ఏకాదశ భక్తిసూత్రాల్లో ఏదైనా ఇట్టే అలవడుతుంది. నవవిధ భక్తి స్వరూపాల్లో దేనిద్వారానైనా దైవోపాసన నిరాఘాటంగా కొనసాగించవచ్చు. వాసనారహితుడే మోక్షప్రాప్తికి అర్హుడు. దేహరక్షణ కోసమే వాసన. దేహ విలాసాల కోసం కాదు. మోహసంతృప్తి కోసం కాదు. ప్రతిఫలాపేక్ష లేని ఉపాసన ప్రగతి సౌధానికి ప్రథమ సోపానం. ఉపాసనలో అంకితభావం, చిత్తశుద్ధి ఉండాలి. ఆత్మసమర్పణాభావం ఉండాలి. అప్పుడే మోక్షద్వారం తెరుచుకుంటుంది. ఉపాసకుడికి లక్ష్యం చేరువవుతుంది. అందుకు వాసనాతీతుడు కావటం వినా గత్యంతరంలేదు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి