ᐅఅదుపులేకుంటే అనర్థమే
అన్ని వేగాలను మించింది మనోవేగం. దాన్ని మించింది లేదు. ప్రయాణంలో అతివేగం అనర్థదాయకమని భావిస్తున్నప్పుడు, మనోవేగమూ అలాగే అనర్థాలు తెచ్చిపెడుతుందని గ్రహించాలి.
రూపంలేనిది మనసు. అది సకల అనుభూతులకు నిలయం, నవరసాలు పొంగి పొరలే కాసారం.
లిప్తకాలంలో గిరిశిఖరంపై నర్తిస్తుంది. ఉత్తరక్షణంలోనే అగాధమైన లోయల్లో పడిపోతుంది.
శాఖామృగంలా విచ్చలవిడిగా విహారం చేస్తుంది. ఈ శాఖామృగాన్ని అదుపుచేయడం, కట్టిపడవేయడం దుర్లభమేకానీ దుస్సాధ్యం కాదు.
వాయువేగాన్ని మించిన ఈ మనసువేగం అనాలోచిత నిర్ణయాలకు, వక్రగతులకు, ప్రతికూల పరిస్థితులకు, ఆక్రోశాలకు, అలజడులకు, అస్తవ్యస్త విధానాలకు, అశాంతిమయ ప్రపంచానికి దారితీస్తుంది.
స్వారీచేసే అశ్వానికి కళ్ళెం లేకుంటే ఎంతటి ఘటికుడైన రౌతు అయినా కింద పడిపోక తప్పదు.
వేగానికి పరిమితి అత్యంతావశ్యకం. మనోవేగానికి, దూకుడుకు పరిమితి విధించే సాధనం నిగ్రహం. నిగ్రహం అంకుశంలా పనిచేస్తుంది.
మనోవేగానికున్న శక్తి, దాని వైపరీత్యాలు తెలుసు కాబట్టే పరమభాగవతోత్తములైన మహనీయులు భగవత్ సాక్షాత్కార సమయాల్లో 'ఎప్పుడూ నా మనసు నీయందే లగ్నమై ఉండే విధంగా వరం అనుగ్రహించు స్వామీ' అంటూ వేడుకొనేవారని శాస్త్రపురాణాదుల్లో ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి.
నిగ్రహం ఏ విధంగా సంప్రాప్తిస్తుంది? ధ్యానంవల్ల. ధ్యానమంటే ఏమిటి? ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానియందే మనసును లగ్నం గావించుకొనే ప్రక్రియే ధ్యానం. భగవదనుగ్రహం పొందడమనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యసిద్ధికి భక్తిమార్గాన్ని అవలంబిస్తాం. శరీరసుఖాలను త్యాగంచేసి, ఏకాగ్రచిత్తంతో నిరంతర చింతనే ధ్యేయంగా కలిగి ఉండటమే ధ్యానం. పొద్దస్తమానం కర్షకుడు, శ్రామికుడు ప్రతిఫలాలకై స్వేదం చిందిస్తారు... అదీ ధ్యానమే.
నూతన ప్రయోగాల సృష్టిలో శాస్త్రవేత్త తలమునకలుగా, అదే లోకంగా కృషి చేస్తాడు. అదీ ధ్యానమే.
అంకితభావంతో చేసే ప్రతి కార్యమూ ధ్యానమే. వేగాన్ని నియంత్రించే నిగ్రహ సంపత్తి ఈ ధ్యాన మార్గాల ద్వారానే సాధ్యం.
ఇక్కడొక విషయాన్ని గుర్తించాలి.
మహావేగంగా కదిలే సుడిగాలి దుమ్ము, ధూళి మిశ్రితంగా ఉంటుంది. వ్యర్ధపదార్థాలతో నిండి ఉంటుంది.
అలానే మనసులో గూడుకట్టుకొని ఉంటాయి కామక్రోధాలనే అరిషడ్వర్గాలు. మనసు వేగంగా కదిలేవేళ 'మేమున్నాం' అంటూ జత కలుస్తాయి. నియంత్రణ కరవైన మనోవేగానికి ఇవి జతకలిస్తే, ఈ వ్యర్థాలు తోడైతే- పయనం పాతాళకుహరంలోకే... కచ్చితంగా.
రంగుల లోకం- భ్రమల్లో ముంచెత్తుతుంది. ఆశాపాశాలు ప్రభావం చూపుతుంటాయి. నిగ్రహంతో మనసును మన చెప్పుచేతల్లోకి తీసుకునే విజ్ఞత అవసరం. మనోవేగం ఏ మేరకు అవసరమో నిర్ధారించుకునే విచక్షణ అవసరం.
నిగ్రహశక్తి పరిణతికి సూచిక. అది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది. అంధకారం నుంచి వెలుగులోకి, అజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం వైపు, మూఢత్వంనుంచి చేతనత్వం వైపు నడిపే మహాశక్తి... నిగ్రహం. కాలవాహినిలో ప్రతి క్షణం విలువైందే. సమయాన్ని వ్యర్థం చేయకుండా నిర్దేశించుకున్న లక్ష్యంవైపు తదేక చిత్తంతో సాధనలో సాగిపోవాలి.
ఆ సాధనే ధ్యానం. ఆ ధ్యానమే నిగ్రహసంపత్తిని అందించే మహాయుధం. ఈ ఆయుధమే ఇష్టం వచ్చినట్లు పరుగులు తీసే మనసును నియంత్రించే సాధనం.
- దానం శివప్రసాదరావు