ᐅఅట్లతద్దె
ఆశ్వయుజ మాసంలో పున్నమి తరవాత తదియ రోజున 'అట్లతద్దె'ను తెలుగువారు ఘనంగా జరుపుకొంటారు. ఈ వ్రతానికి 'చంద్రోదయ గౌరీవ్రతం' అని కూడా పేరుంది. పెళ్ళికాని పిల్లలు ఈ వ్రతాన్ని మంచి భర్తకోసం ఆచరించడం అనూచానంగా వస్తున్న ఆచారం. పెళ్త్లెనవారు కూడా తమ భర్త ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని అట్లతద్దెను ఆచరించటం కద్దు. ఆంధ్రదేశంలోనే కాకుండా ఉత్తర భారతంలోనూ కన్నెపిల్లలు, వివాహితలు జరుపుకొంటారు. ఈ అట్లతద్దె 'కర్వాచౌత్'గా ఉత్తర భారతంలో ప్రసిద్ధం. దేశాలు వేరైనా, మతాలు-ఆచారాలు వేరైనా మనుషులందరూ ఒకటే. వారి మనోభావాలూ ఒకేలా ఉంటాయి. ఇందుకు ఉదాహరణగా 'రోమ్' నగరంలో 'సెయింట్ ఆగ్నెస్ ఈవ్' అన్న పేరుతో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం గమనించదగ్గ విశేషం.
అట్లతద్దెనాడు ఉదయం నిద్ర లేవగానే కన్యలు, వివాహితలు శుచిగా గోరింటాకు పెట్టుకుని, ఉపవాస దీక్ష పాటిస్తారు. సాయంత్రం వరకు ఉయ్యాలలాట ఆడుతూ ఆనందంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు. సాయంత్రం చంద్రోదయం కాగానే, అట్లు (దోశెలు) తయారుచేసి ఉపవాసం పూర్తిచేస్తారు. ఉపవాసం ముగించే ముందు గౌరీపూజను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. మొదట పసుపుతో గణపతిని చేసి, గణపతి పూజ తరవాత గౌరీదేవిని పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజించి ఆ తరవాత ఉపవాసాన్ని విరమిస్తారు. కొందరు చద్ది అన్నాలు గోంగూర, పెరుగుతో తిని వ్రతాన్ని ప్రారంభించటం కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తోంది. పదకొండు అట్లు, పదకొండు రకాల కూరగాయలతో చేసిన పులుసు, బియ్యం మరియు బెల్లం కలిపిన తీపి పదార్థం ఆరగించటం మరికొన్ని ప్రాంతాల్లో రివాజు. తోరణాలు అలంకరించుకుని పదకొండు మంది స్త్రీలకు వాయనాలు ఇవ్వటం ఈ కార్యక్రమంలో భాగం.
ఈ వ్రతానికి సంబంధించి ఒక పౌరాణిక గాథ బహుళప్రచారంలో ఉంది. 'కావేరి' అనే రాజకుమారి తన చెలికత్తెలతో కలిసి, సద్గుణ సంపన్నుడు, అందగాడు అయిన భర్త కోసం అట్లతద్దె వ్రతాన్ని ఆచరించిందట. ఆ వ్రత మహాత్మ్యం వల్ల చెలికత్తెలందరికీ చక్కని భర్తలు లభించారు. కానీ పాపం రాజకుమారికి తగిన సంబంధం కుదరనే లేదు. అప్పుడు కావేరి, అడవికి వెళ్ళి శివపార్వతుల గురించి తపస్సు చేసింది. ఆదిదంపతులు ప్రత్యక్షమై, 'వ్రతలోపం వల్ల నీ అభీష్టం నెరవేరలేదు' అని కావేరికి చెప్పారు. ఆ లోపానికి కారణం కావేరి అన్నయ్యలు. ఉపవాసంవల్ల చెల్లి నీరసించిందని ఆమెకు వ్రతభంగం కలిగించడానికి అద్దంలో చంద్రుడిలాంటి ఒక బింబాన్ని చూపించారు. చంద్రోదయం అయ్యిందని నమ్మిన కావేరి ఉపవాసం విరమించింది. ఈ విషయం తెలియగానే మరింత భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరించి, తనకు ఈడు-జోడు, అందగాడు అయిన భర్తను కావేరి పొందగలిగిందని కథ.
ప్రకృతి, పురుషుల సంయోగమే ఈ సృష్టికి మూలకారణం. ప్రకృతి పార్వతి, పురుషుడు శివుడు, చెరిసగమై 'అర్ధనారీశ్వరులు'గా మన పురాణాల్లో కనిపిస్తారు. ఈ అర్ధనారీశ్వరతత్వం ఆదర్శ దాంపత్యానికి చిహ్నం. అందుకే స్త్రీలు ఇలాంటి ఆదర్శ దాంపత్యం కోసం అట్లతద్దె వ్రతం భక్తిశ్రద్ధలతో పాటించటం మన సంస్కృతిలో ముఖ్యమైన సంప్రదాయంగా నిలిచిపోయింది.
- ఉప్పు రాఘవేంద్రరావు