ᐅభయంపై జయం
మనిషిని రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. నిర్భయంగా జీవిస్తున్న మానవుడు లేడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. భయం సహజమైన అనుభవమే! మనం నివసిస్తున్న సామాజిక వ్యవస్థలో ఉద్వేగాలు అనుమానాలు భావాలు భ్రమలు కారణంగా ప్రతి మానవుడూ భయానికి ఎప్పుడో ఒకప్పుడు లోనుకాక తప్పదు. రుణభయం రోగభయం లేమిభయం కలిమినెలా కాపాడుకోగలమోననే భయం... చివరికి మరణ భయం... ఇదంతా మానవుణ్ని పట్టి పీడిస్తున్న భయపరంపరే!
భయం మన మానసంనుంచి పుడుతుంది. మనం ఎదుర్కోబోయే అస్థిరత్వానికి, ప్రమాదాలకు భయాన్ని ఒక సంకేతంగా భావించాలి. అస్థిరత్వాన్ని, ప్రమాదాలను ఎదుర్కొని పరిష్కరించుకోవడానికి భయం మనిషిని సమాయత్తం చేస్తుంది. గతంలో ఇలాంటి స్థితి నుంచి బయటపడటానికి మనం చేసిన ప్రయత్నాలను భయం జ్ఞాపకం చేస్తుంది. అంతేకాని- భయం శాపం కాదు... అదొక సూచిక! భయంవల్ల మనిషి భౌతికంగా మానసికంగా కుంగిపోతాడు. మానసిక భయం మంచి పరిణామం కాదు. ఒక్కోసారి మనం ఎదుర్కోబోయే ప్రమాదాలను అస్థిరత్వాన్ని అధికం చేసి రకరకాల భ్రమలు కలిగిస్తుంది. అందుకే భయం ఆవహించినప్పుడు ప్రశాంతతను సాధన చేయాలి. భయం అనే రేఖకన్నా ఆత్మవిశ్వాసమనే పెద్దరేఖను గీసినట్లు ఊహించుకొని పరిష్కరించుకొనే దిశగా ప్రశాంతంగా ప్రయత్నించాలి. పంచేంద్రియాలకు అతీతంగా మరో ఇంద్రియం మనిషిలో ఉంటుందని విశ్లేషకులు అంటారు. కొన్నిసార్లు దిలాసాగా ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని, కారణం లేని భయం ఆవహిస్తుంటుంది. చాలావరకు అప్రయత్నంగా అకస్మాత్తుగా సంభవించే అస్థిరత్వాన్ని ఇలాంటి అనూహ్య భయం సూచిస్తుందని అంటారు. ఏదో ఊహించని ఉపద్రవం కలిగినప్పుడు ఇలాంటి భయం చోటు చేసుకుంటుందని మానసిక నిపుణులు అంటారు. మనిషిని అప్రమత్తం చేయడానికి భయం సహకరిస్తుంది.
పెద్దలంటే భయం, దైవమంటే భీతి కలిగిన మనిషి నడవడిక సజావుగా సాగుతుంది. నేరం చేస్తే శిక్షకు భయపడాలి. తప్పుచేస్తే తనకు తానే భయపడాలి. సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే సమాజం ఈసడిస్తుందని భయపడాలి. ఎవరికీ తెలియకుండా తప్పుచేస్తే మన ఆత్మకు భయపడాలి. చీకటికి భయపడితేనే వెలుగుకోసం ప్రయత్నించగలం.
తనను తాను నమ్మినవాడికీ, దైవాన్ని నమ్మినవాడికీ భయం ఉండదని భాగవతంలో ప్రహ్లాదుడంటాడు. ఎవరిని చూసి ద్వేషిస్తామో వారంటే భయం కలుగుతుంది. హిరణ్యకశపుడికి శ్రీహరి అంటే భయం. శ్రీహరిని నమ్మిన ప్రహ్లాదుడికి భయమే లేదు. బలహీనులకు దైవమే దిక్కని చెబుతాడు. దైవాన్ని నమ్మి ఆ దైవం మనల్ని రక్షిస్తాడనే ధీమా ఉంటే భయం మనకు ఆమడ దూరంలో ఉంటుంది. మనం చేసే పనిలో నిజాయతీ ఉంటే, మనం నిర్వహించే కర్మలు నిర్మలంగా ఉంటే మనం ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదన్నది భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినమాట. జననం లాంటిదే మరణమని శ్రీకృష్ణుడు ఉద్బోధించాడు. మరణం జీవప్రక్రియలో భాగమని నమ్మితే మరణానికి భయపడాల్సిన అవసరం ఉండదు. శుకుడు పరీక్షిత్తుతో భాగవత కథల్ని వివరిస్తూ మరణానికి భయపడకూడదని సూచిస్తాడు. 'పరీక్షిత్ మహారాజా! మానవుడు అన్ని భయాలను జయించాలంటే ఒకే ఒక్క సూక్తిని మనసులో స్మరించుకోవాలి... కౌపీనం కన్నా దారిద్య్రం లేదు, మరణం కన్నా మిక్కిలి లేదు' అని అంటాడు శుకుడు.
- అప్పరుసు రమాకాంతరావు