ᐅస్తోత్ర మాధుర్యం




స్తోత్ర మాధుర్యం 

స్తుతి అంటే పొగడ్త. అదంటే, ఇష్టపడని వారుండరు. సర్వాంతర్యామి అయిన భగవంతుడికీ స్తోత్రం అంటే ఎంతో ఇష్టం, అందుకే దేవతలను స్తోత్రప్రియులని అంటారు పెద్దలు. ఆదిమ సాహిత్యాలైన వేదాలన్నీ భగవత్ స్తుతులే. స్తోత్రాలతో భగవంతుణ్ని వశం చేసుకోవచ్చునని భక్తుల కథలు నిరూపిస్తున్నాయి. పొగిడితే భగవంతుణ్నే పొగడాలి కానీ, పనికిరానివాళ్లను పొగిడితే ఏం ప్రయోజనం అనేవాళ్లూ ఉన్నారు. ఈ మాట నిజమే. భగవంతుణ్ని స్తుతించడంలోని మాధుర్యం అనిర్వచనీయం. ఈ విషయాన్నే రుజువు చేస్తూ సంస్కృత మహాకవి జగన్నాథ పండితరాయలు ఇలా అన్నారు- 'నేను నా జీవితంలో ఎన్నోసార్లు మధురమైన ద్రాక్షపండ్ల రుచి చూశాను. తియ్యని కలకండను తిన్నాను. అమృతం లాంటి పాలను తాగాను. స్వర్గానికి వెళ్లినట్లు కలలు గన్నప్పుడు అక్కడి అమృతాన్నీ రుచి చూశాను. కానీ ఇన్ని సందర్భాల్లోనూ పొందలేనంతటి మాధుర్యాన్ని 'కృష్ణా!' అనే రెండు అక్షరాల పిలుపులోని అనుభూతితో పొందాను. కనుక ఓ కృష్ణా! నీ స్తోత్రంలోని మధురిమ ముందు ఏదీ పనికి రాదు'
భగవంతుణ్నే ఎందుకు స్తుతించాలి? భవబంధాల విముక్తి కోసం అని చెబుతారు పెద్దలు. ఈ బాధలను తోటి మానవులు పోగొట్టలేరు. కనుకనే బాధలను పోగొట్టే భగవంతుణ్ని స్తుతించాలి అనే మాటలో ఎలాంటి సందేహమూ లేదు.

అందుకే శంకరభగవత్పాదులు- 'కళ్లు తెరచి చూస్తున్నంతలోనే ఆయుష్యం హరించుకొనిపోతోంది. యౌవనమూ జారిపోతోంది. రోజులు గడచిపోతున్నాయేగానీ తిరిగి రావడంలేదు. కాలం ఈ ప్రపంచాన్నే కబళించాలని చూస్తోంది. ధనధాన్యాది సంపదలూ కడలికెరటాలవలె చూస్తుండగానే చంచలమై నశిస్తున్నాయి. జీవితం మెరుపుతీగలా మెరిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి దశలో- కాపాడే భగవంతుణ్ని స్తుతించడం తప్ప మరొకదారి లేదు' అంటారు.

భగవంతుని స్తుతించడంలోనూ కొందరు వైరుధ్యాలను ప్రదర్శిస్తుంటారు. తాము శైవులం కనుక శివుణ్నే స్తుతిస్తామని కొందరూ, తాము వైష్ణవులం కనుక విష్ణువునే ధ్యానిస్తామని మరికొందరూ, తాము శాక్తేయులం కనుక శక్తినే కొనియాడతామని కొందరూ అంటుంటారు. ఇలా అనంత రూపాల్లో కనబడే పరమదైవం ఒకటేననీ, భేదం చూపులోనే కానీ, సత్యంలో లేదనీ అంటారు పెద్దలు. మానవులు తమతమ కర్తవ్యాలను సాధించుకోవడానికి ఎలా అనేక మార్గాలు ఎన్నుకుంటారో, అలాగే ఎన్ని రూపాల్లో దేవుణ్ని వర్ణించినా, అవన్నీ ఒక్కడైన పరమేశ్వరుణ్నే చేరతాయనీ, నదులన్నీ సముద్రంలోనే కలిసినట్లు వివిధ దేవతారూపాలన్నీ చరమగమ్యమైన ఒక్క రూపాన్నే చేరతాయనీ అంటారు కాళిదాస మహాకవి తన రఘువంశంలో.

కృష్ణునిపై అపారభక్తిభావంతో ముకుంద మాలా స్తోత్రాన్ని పలికిన కులశేఖరాళ్వార్- 'అనంతా! వైకుంఠా! ముకుందా! రామా! జనార్దనా! ఆనందా! నిరామయా! ఇన్ని మధురనామాలు కలిగిన నిన్ను స్తుతించకుండా ఈ మనిషి ఎప్పుడూ వ్యసనాల్లోనే మునిగి తేలుతూ పతనమవుతున్నాడే!' అని వాపోయాడు.

పాపాల కూపాల్లో మగ్గిపోతున్న మనుషుల ప్రవృత్తి గమనించిన ఒక భక్త కవివరేణ్యుడు- 'ఓ భగవంతుడా! నేను ఇంతవరకు ఒక్క మంచిపనినైనా చేయలేదు. ఇప్పటిదాకా చేసినవన్నీ పరమ పాపకృత్యాలే. ఇలా సిగ్గుమాలినవాడనైన నేను నీతో ఏమని మనవి చేసుకోవాలి? నాకు అడగడానికి సిగ్గేస్తోంది... నా స్తుతిని మన్నించి నీవే నాకు ఉచితమైంది ప్రసాదించు!' అని మానవుల పక్షాన స్తుతించి చరితార్థుడయ్యాడు.

భగవంతుణ్ని తప్ప, ఇతరమైన దేన్ని స్తుతించినా ఇంతటి ఆర్ద్రత కానరాదు. స్తోత్రం అంటే దేవతాస్తుతి మాత్రమే. దాన్ని ఆచరిస్తూ, అందులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ, జీవితాన్ని ఆనందధామంగా మార్చుకోవడంకన్నా మనిషికి ముఖ్యమైంది వేరే ఏముంటుంది?

- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ