ᐅపైడిమాంబ జాతర
చిన్న చిన్న తేడాలతో గ్రామ దేవతల పండుగలు దేశమంతటా జరుగుతాయి. గ్రామ శివార్లలో నివాసం ఉండి, తమ గ్రామాన్ని అన్ని రకాలుగా రక్షిస్తున్నందుకు కృతజ్ఞతగా ప్రతి ఏటా కొన్నాళ్లు ఆ దేవతను ఊరిలోకి తెచ్చి, ఉత్సవాలు జరిపి, ఆపై సాదరంగా సాగనంపడం ప్రతి గ్రామదేవత పండుగలోనూ ఆనవాయితీ. వాటిలో కొన్ని ప్రఖ్యాతి పొందుతాయి. ఆ కోవకు చెందినదే విజయనగరంలో జరిగే 'పైడిమాంబ జాతర'. ఆధ్యాత్మికతతోపాటు చారిత్రక నేపథ్యం కలిగినదీ జాతర. ఉత్తరాంధ్రలో విజయనగరం, బొబ్బిలి ప్రసిద్ధమైన సంస్థానాలు. వాటి పాలకులు స్నేహ సౌహార్దాలతో మెలగుతున్న సమయంలో, విదేశీయుల కుట్రల ఫలితంగా శత్రువులుగా మారారు. ఫలితం ఇరు సంస్థానాల మధ్య యుద్ధం. ఈ మారణహోమం ఎలాగైనా ఆపాలనుకుని ఎంతగానో ప్రయత్నించింది విజయనగరం సంస్థానాధీశులైన గజపతుల ఆడపడుచు పైడిమాంబ. (ఆనాటి గ్రామదేవత పేరునే ఆమెకు పెట్టారని, ఆమె దేవీ ఉపాసకురాలని ఒక కథనం) ఆమె ప్రయత్నం ఫలించకుండానే బుస్సీదొర కుట్రఫలితంగా బొబ్బిలి రాజప్రతినిధి అయిన తాండ్ర పాపారాయుడి చేతిలో పైడిమాంబ సోదరుడైన పెదవిజయరామరాజు హతమయ్యాడు. విషయం తెలిసి పైడిమాంబ కుప్పకూలిపోయి, అసువులు బాసింది. 'ఈ మారణహోమం చూడలేక ప్రాణత్యాగంచేసి, దేవి మూలవిరాట్ స్వరూపంలో లీనమై పోతున్నానని, పెద్ద చెరువు (రాజుల కాలంలో విహార చెరువు) పశ్చిమ భాగాన దేవీమూర్తిగా వెలుస్తానని, ప్రజలంతా సామరస్యంతో ఉండేటట్లయితే తన ప్రతిమకు ఆలయం కట్టించమని ఆ కుటుంబ శ్రేయోభిలాషికి కలలో కనిపించి చెప్పిందని అంటారు. 1756 (ధాతనామ) సంవత్సరం విజయదశమి గడిచిన తరవాతి మంగళవారం పెద్ద చెరువులో వేట చేస్తున్న జాలరుల వలల్లో చిక్కి పైకి వచ్చింది పైడిమాంబ ప్రతిమ. ఆ చెరువుకు పడమర గట్టునే ఆమెను ప్రతిష్ఠించి ఆలయం కట్టారు. ఆ ఆలయానికి 'వనంగుడి' (వనం=నీరు, నీటినుంచి అమ్మవారు బయటపడింది కాబట్టి) అని పేరు. ప్రజాశ్రేయం కోసం ప్రాణత్యాగం చేసినందుకు కృతజ్ఞతగానూ, ఆమె ఆరాధ్యదేవత అయిన జగదంబలోనే ఐక్యమొందింది కాబట్టి, రాజుల ఆడపడుచు అయిన పైడిమాంబనే అప్పటినుంచి అమ్మవారి ప్రతిరూపంగా కొలుస్తున్నారని చెబుతారు. ఆ మరుసటి ఏడాది ఈశ్వరనామ (1757) సంవత్సరం, విజయదశమి గడిచిన తరవాతి మంగళవారంనుంచీ ఆ దేవతకు ఉత్సవాలు జరుగుతున్నాయని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆమె పుట్టినిల్లయిన కోటకు దగ్గరలో మరొక ఆలయం నిర్మించారు. దీనికి 'చదురు గుడి'గా పిలుస్తారు. చదురు అంటే, నలుచదరంగా ఉండే పెద్ద చాప. వైశాఖ శుద్ధ దశమినాడు వనంగుడినుంచి చదురు గుడికి అమ్మవారిని తీసుకొని వస్తారు. ఆరు నెలల అనంతరం ఉత్సవాలు చేసి ఆశ్వయుజమాసాంతంలో వనంగుడికి సాగనంపుతారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం 'సిరిమానోత్సవం'
అమ్మవారు ఆజ్ఞాపించిన (ప్రతి ఏటా తనకు సిరిమాను కాబోయే చెట్టు ఏదో ఎక్కడ ఉందో పూజారికి కలలో కనిపించి చెబుతుందనేది ప్రచారంలో ఉన్న కథ) చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు జరిపి దాన్ని నరికి తెస్తారు. 33 మూరల పొడవుతో వంశపారంపర్య శిల్పులు దాన్ని సిరిమానుగా మలుస్తారు. బండికి అమర్చుతారు. ఆ మాను చివర అమ్మవారి ప్రతిరూపంగా ఆలయపూజారి అధిరోహిస్తాడు. ఆ సమయంలో పూజారిని అమ్మవారు ఆవహించి ఉంటుందనేది ప్రజల ప్రగాఢ నమ్మకం. ఆ సిరిమాను రథాన్ని ఆలయం నుంచి, ఆమె పుట్టినిల్లయిన కోట వరకు మూడుసార్లు తిప్పుతారు. దేవతకు గ్రామ సందర్శన చేయించడంతోపాటు, ఆమె పుట్టిన స్థలాన్ని ఆమెకు చూపడం ఇందులోని ఆంతర్యం. తిరువీధిలో తమకు ప్రత్యక్ష దర్శనం ఇస్తున్న ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఆపదలు తొలగిపోతాయని, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ సంబరంలో సిరిమాను రథానికి ముందుగా మరి నాలుగు రథాలు బయలుదేరతాయి. మొదటిది బెస్తరల రథం. బెస్తవారు వెదికి, వెలికి తీసినందుకు వారికి కృతజ్ఞతా సూచకంగా ఈ రథం. రెండోది పాలధార. కోటను రక్షి(పాలి)ంచే వీరుల స్మృత్యర్థం కదిలే రథం ఇది. మూడో రథం యె(తె)ల్ల ఏనుగు. గజపతుల కుటుంబానికి అభిమాన పాత్రమైన వాహనానికి ప్రతీక. పైడిమాంబ దీనిమీద విహారం చేయడానికే ఇష్టపడేదని చెబుతారు. నాలుగోది అంజలి రథం. పైడిమాంబకు సపర్యలు చేసే పరిచారికలను కృతజ్ఞతాపూర్వకంగా తలచుకునే ఉద్దేశంతో రూపొందించిన రథం.
సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రధాన ఘట్టాలు అయిదు. అవి- తొలేళ్లు ఉత్సవం, సిరిమాను ఉత్సవం, తెప్పోత్సవం, ఉయ్యాల-కంబాల, చండీయాగం, పూర్ణాహుతి. ఈ అయిదో ఘట్టంతో జాతర ఉత్సవాలు పూర్తవుతాయి. అనంతరం దేవిని వనంగుడికి సాగనంపుతారు. ఆ రోజునుంచి వైశాఖమాసం వరకు అమ్మవారు అక్కడే వసిస్తుందని ప్రతీతి.
- అయ్యగారి శ్రీనివాసరావు