ᐅసహజగుణం




సహజగుణం 

ఈ ప్రపంచం ఎన్నో వింతలమయం. కొన్ని అనుభవాలు ఆనందమయం. మరికొన్ని చేదు చేదు. ఒక్కోసారి ఎందుకిలా జరుగుతోంది అన్నదానికి సరైన జవాబు దొరకదు. కానీ, ప్రతిజీవీ తన సహజ గుణాన్ని వదలిపెట్టదన్నది నిజం!
ఒక గ్రామంలో నది ఒడ్డున ఓ కుర్రవాడు ఆడుకుంటుండగా దగ్గరలో వలలో చిక్కుకున్న మొసలి తనను రక్షించమని వేడుకుంది. 'నువ్వు క్రూరపాణివి... బయటికి వచ్చాక నన్ను చంపుతావేమో' - అన్నాడా కుర్రవాడు భయపడుతూ. 'ఉపకారికి అపకారం చేస్తానా!' అని నమ్మబలికింది మొసలి. తీరా ఆ కుర్రవాడు సగం వలను కోశాక తల బయటికి పెట్టిన మొసలి తన దవడలతో వాడి కాలు దొరకపుచ్చుకుంది. 'మాటతప్పి మోసం చేస్తావా?' అని గోలపెట్టాడు కుర్రవాడు. 'ప్రపంచమే అంత! నా సహజ గుణాన్ని నేనెలా వదులుతాననుకున్నావు?' అంది మొసలి.

తాను చనిపోతున్నందుకు కుర్రవాడు బాధపడలేదు. మొసలి విశ్వాస ఘాతుకాన్ని భరించలేకపోయాడు. చెట్టుపైనున్న పక్షులకు చెప్పి వాపోయాడు. 'మేమెవరితో చెప్పుకోము? ఈ మారుమూల గూడు పెట్టుకుంటుంటే పాము వచ్చి మా గుడ్లను తింటోంది. మేము దానికి ఏమి అన్యాయం చేశామని! ఈ ప్రపంచం తీరే అంత... అది దాని నైజగుణం!' అన్నాయి పక్షులు.

అటుగా గెంతులేస్తూ వచ్చిన కుందేలుతో తన బాధ చెప్పుకొన్నాడు బాలుడు. ఇది అన్యాయమని అరిచింది కుందేలు. తనకు మద్దతునిచ్చే ప్రాణి దొరికిందని వాడు ఉత్తేజితుడయ్యాడు. మొసలి నవ్వుతూనే కుందేలుతో వాదన వేసుకుంది. 'నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు. వాడి కాలు వదలి మాట్లాడు' అంది కుందేలు. 'నువ్వు వాణ్ని విడిపించటానికి తెలివిగా అలాగంటున్నావని నాకు తెలుసులే!' అంది మొసలి. 'వాడి కాలు నీ నోట్లో ఉన్న మూలంగా నాకు నీ మాట అర్థం కావటంలేదు. అయినా, నువ్వు వాడిని చంపాలనుకుంటే బయటికి వచ్చాక నీ తోకతో ఒక్క దెబ్బవెయ్యగలవు కదా!' అని నవ్వింది కుందేలు. ఆ మాటలకు బోల్తాపడిన మొసలి వాడి కాలు వదిలేసింది. అది వలలోంచి పూర్తిగా బయటికి వచ్చేలోపల, కుందేలు మాటల చాతుర్యంతో తనను ఎలా రక్షించిందో గ్రహించిన కుర్రవాడు కాలికి బుద్ధిచెప్పాడు.

వూళ్ళోకి వెళ్ళి తన వాళ్లనందర్నీ వెంటబెట్టుకు వచ్చాడు. అప్పటికే మొసలి నదిలోకి పారిపోయింది. కానీ, ఆ కుర్రవాడి వెంట వచ్చిన వాడి పెంపుడుకుక్క ఆ కుందేలు వెంట పడింది. 'అయ్యో... దాన్నేం చేయకు. అదే నన్ను మొసలినుంచి రక్షించింది' అని ఆ కుర్రవాడు అడ్డుకునేలోగా- ఆ కుక్క కుందేలును కరచి కరచి చంపింది.

ఈ ప్రపంచంలో న్యాయానికే కాదు, అన్యాయానికి కూడా స్థానముంది. కృతజ్ఞతకే కాదు, కృతఘ్నతకీ తావుంది. వీటితో సంబంధం లేకుండానే ప్రతిప్రాణీ తన సహజ గుణానుసారం నడుచుకుంటుంది. మనిషి సహజ గుణం- ఎవరికీ అన్యాయం చేయకపోవటం, చేసిన మేలు మరువకపోవటం, అడక్కుండానే ఎదుటి వ్యక్తికి సహాయం చేయటం. ఈ గుణాలే మనిషిని దైవత్వానికి దగ్గరికి తీసుకు వెళ్ళగలుగుతాయి!

- విమలారామం