ᐅసమష్టియాత్ర
ప్రపంచం, ప్రకృతి ఒక సమన్వయ సృష్టి. సామూహిక క్రియాశీలత కలిగింది. సమష్టి యాత్రకు నిర్దేశితమైంది. రకరకాల జీవరాసులు. మళ్లీ ఏ జాతికా జాతి ప్రత్యేకం. జాతికో శారీరక ప్రకృతి, ప్రత్యేక సంస్కృతి, వైవిధ్య జీవన విధానం. అయినా మళ్లీ సృష్టి మొత్తం ఏక రాసిగా, స్నేహం, సహకారం, త్యాగం, పరస్పరాంగీకారం. ఇది ఎంత అందమైన సృష్టి! ఎంత పకడ్బందీ వ్యవస్థ! ఎంత కట్టుదిట్టమైన నియమావళి! ప్రపంచం ఏ జాతికా జాతి విడివిడి జీవన సరళిలో, ప్రత్యేక పరిధిలో జీవిస్తున్నా మళ్లీ ఒకే భూమిపై పరస్పరాధారిత విధానంలో ఒకే తాటిపై నడవాలంటే సమష్టి సూత్రం, సామూహిక నియమావళి అవసరం. భగవంతుడు ఆ ఏర్పాటు చేసే జీవుల్ని సృష్టించాడు. వృక్షాలు, జంతువులు, సర్పాలు, క్రూరమృగాలు, కీటకాలు, సముద్ర జీవులు, మానవులు... ఇంత వైవిధ్య జీవుల్ని కూడా పరస్పరం అంగీకరించే, ఆదుకునే సంస్కృతిని ప్రసాదించిన భగవంతుడు కేవలం మానవుల మధ్య మాత్రం ఆ సంస్కృతిని పాదుగొల్పకుండా ఉంటాడా? పాదుగొల్పే ఉన్నాడు.
మనం ఈ ప్రకృతిని అంగీకరించాలి. ప్రకృతి మనకు వేరుగా లేదు. మనిషి, సమాజం, ప్రకృతి... ఈ మూడింటి సమాహారం, సహజీవనం... ఇదే జీవితం. చూసేందుకు, భావించేందుకు విడివిడిగా ఉన్నా ఇదంతా ఒక కుటుంబం. ఒక ఆత్మీయ బంధం. అందువల్ల మనం ఏ స్థాయిలో ఉన్నా ప్రకృతిని, సమాజాన్ని అంగీకరించాలి. మన జీవితంలోకి అనుమతించాలి. గౌరవించాలి. దేన్నయినా, ఎవరినైనా మన అనుకున్నప్పుడు దాన్నించి మనం దేన్నైనా పొందే వీలు, హక్కు కలుగుతుంది. అదే సమయంలో మనం అవతలివారికి ఏమైనా, ఎప్పుడైనా ఇచ్చే, చేసే బాధ్యతా ఉంటుంది.
ఈ ప్రకృతినుంచి, సమాజంనుంచి మనం ఎన్నో పొందుతున్నాం. ఆ స్థాయిలో మనం ఏమైనా చేస్తున్నామా, ఇస్తున్నామా? మన పూర్వీకులు ప్రకృతి పట్ల ఎంతో విధేయులై ఉండేవారు. కృతజ్ఞులై ఉండేవారు. ప్రపంచ దేశాలన్నీ అమాయకత్వంతో నవ్వినా- ఇక్కడ చెట్లను పుట్టలను పూజించేవారు. పశువులకు పండుగ చేసేవారు. రెండు చెట్లు నాటాకగానీ అవసరార్థం ఒక చెట్టును కొట్టేవారు కాదు. పెంపుడు జంతువులకు, కాకులకు ఆహారం పెట్టనిదే విస్తరిముందు కూర్చునేవారు కాదు. అతిథి లేనిదే ఆహారం ముట్టేవారు కాదు. ఎంత అందమైన సంస్కృతి! ఎంత ఆత్మీయమైన జీవనగతి! ఎందుకింత స్వార్థపరులమైపోయాం!? ప్రకృతి అలాగే ఉంది. మనిషి తప్ప మిగిలిన జీవజాలాలు, రుతువులు యథావిధిగా తమ బాధ్యతల్ని నెరవేరుస్తూ, హక్కుల్ని అనుభవిస్తూ, త్యాగాన్ని ఆనందిస్తూ...! మనుషులమే మారిపోయాం... బుద్ధిజీవులం కదా! మానవులుగా జన్మించిన రాముడు, కృష్ణుడు కూడా ప్రకృతిని, ప్రపంచాన్ని నిర్లిప్తంగా చూడలేదు. రాముడు సమాజంలో మమేకమయ్యే జీవించాడు. ఆటవికులతో, వానరులతో స్నేహం చేశాడు. పక్షులు, ఉడుత లాంటి అల్పప్రాణులు కూడా ఆయన కరుణాదృష్టి నుంచి దాటిపోలేదు. కృష్ణుడు గోవులతో, గోపికలతో, గోపాలురతో, గోవర్ధన పర్వతంతో కూడా స్నేహం నెరిపాడు. ప్రకృతిని, ప్రపంచాన్ని వారు సమభావంతో, ఏకాత్మ భావంతో స్వీకరించారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు.
మనం వేసిన మామిడి చెట్టు మన భావి తరాలకు ఫలాలనిస్తుంది. దానికున్న కృతజ్ఞత మనకు లేదు, రాదు. మన రూపాయి మనమే ఖర్చు పెట్టుకోవాలి. మనం వండుకున్న అన్నం మనమే తినాలి. ఇంకా వీలైతే పక్కవారిది కూడా. దేవుడు మనకై కేటాయించిన సంస్కృతి ఇది కాదు. నేర్పాలనుకున్న సంస్కారం ఇది కాదు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న సంస్కృతి మనం సొంతంగా నేర్చుకున్నది. సహజ సంస్కృతి కాదు. మనం సహజత్వాన్నుంచి వైదొలిగినప్పుడు మనలోని అసలు సహజత్వమూ, సహజ స్వరూపమూ, స్వస్వరూపమూ మన స్మృతిపథంలోకి రావు. మనం పరమపదం గురించి ఆశించేముందు, ముందుగా సహజపథం గురించి ఆలోచిద్దాం. సహజత్వాన్ని, ప్రకృతిని ఆరాధిద్దాం. అనుసరిద్దాం.
- చక్కిలం విజయలక్ష్మి