ᐅనిస్వార్థమే నిశ్చలానందం




నిస్వార్థమే నిశ్చలానందం 

స్వార్థచర్యలే సమస్యలకు విత్తనాలు. 

స్వార్థంవల్లనే అవినీతికి ఆకర్షితులవుతారు. స్వార్థం వల్లనే తెలిసి తెలిసి తప్పులు చేస్తారు. వీటినే 'ప్రజ్ఞాపరాధాలు' అంటారు. తెలిసి తప్పు చేసేవారికి అధిక దండన విధించమంటాయి శిక్షాశాసనాలు.
స్వార్థం వల్లనే మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. స్వార్థానికి మించిన దుర్గంధం లేదు. అయినా అదే పరమసుగంధంగా స్వార్థపరులు నిర్లజ్జగా, నిస్సంకోచంగా సంచరిస్తుంటారు.

భగవంతుడి అనుగ్రహం కోసం చేసే పూజలు, పునస్కారాలు, జపతపాలు స్వార్థంతో కూడుకుని ఉన్నంత కాలం దైవం స్పందించడంటారు. అందుకు దైవాన్ని నిందించటం అవివేకం. ఆత్మ కల్మషరహితమై పరిశుద్ధాత్మగా పరివర్తన చెందినప్పుడే పరమాత్మ మనపట్ల ఆకర్షితుడవుతాడన్నది విజ్ఞుల వాక్కు. బంగారాన్ని అగ్నిపునీతం చేసినప్పుడే దాన్ని నగలుగా మలచడానికి వీలవుతుంది. ఆత్మను స్వార్థమనే కాలుష్యం ఆవరించుకున్నంత కాలం అది సహజశక్తిని కలిగి ఉండదు. సూర్యుడి తేజస్సును మబ్బు కప్పి ఉంచడం లాంటిదే ఇది.

మనం నిస్వార్థంగా ఉండగలమా? 
దీన్ని ఆచరణసాధ్యంగా ఎలా మలచుకోవాలి? 
జిజ్ఞాసువుల్ని ఈ ప్రశ్నలు వేధిస్తాయి.

స్వార్థంవల్ల కలిగేది తాత్కాలికానందమే. మన స్వార్థం వల్ల ఇతరులకు దుఃఖం కలుగుతుందనేది మన గమనికలో ఉండదు. తద్వారా మనల్ని ప్రేమించేవారు తగ్గిపోతుంటారు. వారిలో కొందరు తీవ్ర స్వభావులు మనకు శత్రువులుగా కూడా మారతారు. ఇదొక గొలుసు ప్రక్రియలాంటిది. ఒకదానికొకటి జతకూడి అంతిమంగా అనర్థదాయకమవుతుంది. మనసులో అశాంతి తిష్ఠవేస్తుంది. తనకేసి అందరూ స్నేహరహితంగా, ఏవగింపుగా చూడటం వల్ల అపరాధ భావన పెరిగి అదే అశాంతికి కారణమవుతుంది.

ఆధ్యాత్మిక జీవితానికి పునాదిరాళ్లలో నిస్వార్థం ముఖ్యమైనది. 
స్వార్థంవల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ అనే విషయం అర్థం కావాలి. అంతవరకు నిస్వార్థంగా ఉండటం అసాధ్యం. నిస్వార్థానికి దారి త్యాగాలతో అరంభమవుతుంది. చిన్న త్యాగాలవల్ల మనకు ఆనందం అనుభవంలోకి వస్తుంది. త్యాగం ద్వారా ఎవరికి మేలు జరిగిందో వారి ఆనందానికి ప్రతిస్పందనగానే మనకు ఆనందం లభిస్తోందనే రహస్యం అర్థమయ్యాక, మన మనసు ఆ ఆనందంకోసం మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంది. అలా అభ్యాసం అయ్యాక, స్వార్థం మనలోంచి క్రమంగా నిష్క్రమిస్తుంది. పోనుపోను మన మనసు నిస్వార్థానికి నిలయమవుతుంది. అప్పుడు నిశ్చలానందంతో మన మనసు స్థిరత్వాన్ని సంతరించుకుంటుంది. మన మొహం ప్రశాంత దర్పణమవుతుంది.

స్థిరబుద్ధి వల్లనే పరమాత్మకోసం ఏకాగ్ర సాధన చెయ్యడం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక ప్రగతికి సోపానాలు ఇక్కడినుంచే ఆరంభమవుతాయి. 
'భగవంతుడా! నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దు' అనే స్థితికి చేరుకున్నాక, మన గమ్యం అదేనని అర్థమవుతుంది.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్