ᐅకాలంతో పోరాటం
ఏ విషయంలోనైనా మనం కష్టాన్ని ఎదుర్కోవాలంటే లేదా విజయాన్ని సాధించాలంటే దాని చేతుల్లోకి మనం వెళ్లకూడదు. మన చేతుల్లోకి దాన్ని తీసుకోవాలి. కాలమైనా అంతే. కష్టమైనా అంతే. కష్టం ఏదైనా కాలం అధీనంలోదే, కాలంలో భాగమే కాబట్టి ఈ సందర్భంలో మనం కాలాన్నే కష్టంగా తీసుకోవలసి ఉంది. 'కష్టకాలం' అని అందుకే అంటారు. అందువల్ల మన పోరాటం కాలంతోనే, మనం ఎదుర్కోవలసిందీ కాలాన్నే. కాలాన్ని ఎదుర్కొనేందుకు రెండు విధానాలున్నాయి. మొదటిది, అన్నింటికీ భగవంతునిపైనే భారం వేసి ఏదివచ్చినా భరించే తత్వాన్ని అలవరచుకోవటం. రెండోది, నూరుశాతం 'పురుష ప్రయత్నం' చేయటం. కాలం ఏమిచ్చినా ఔదలదాల్చటంలో కూడా రెండు పద్ధతులున్నాయి. కష్టనష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేక, విధిలేక తలొగ్గి లొంగిపోయే దృష్టితో అంగీకరించటం. ఇది పిరికివాడి క్షమాగుణం లాంటిది (పిరికివాడికి క్షమాగుణం ఉన్నా లేకున్నా ఒకటే). మరోటి, వివేకంతో కూడిన అంగీకారం. భగవంతుని నిర్ణయంపట్ల ప్రసాదభావం. ఇది యుక్తమైనది. ఉత్తమమైనది. ఈ పద్ధతిలో వ్యక్తికి తలొగ్గడంలో వినయం ఉంటుంది. సమర్పభావం ఉంటుంది. వైరాగ్యముంటుంది. ఆనందముంటుంది. ముఖ్యంగా అనివార్యతపట్ల అవగాహన ఉంటుంది. ఈ వివేకం, వివేచనతో కూడిన అంగీకారం ఆ వ్యక్తికి దుఃఖాన్ని కలిగించదు. భగవంతుని కార్యంగా చేసే ఈ కర్మ ఫలాన్ని కూడా ఇవ్వదు.
ఇక కాలాన్ని ఎదుర్కొనే రెండో విధానం పురుష ప్రయత్నం. భగవంతుడే పురుష ప్రయత్నాన్ని సూచించాడు. మనిషి నుంచి ఆశించాడు (తండ్రి కొడుక్కు విద్యాబుద్ధులు నేర్పించి స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చి స్వయంకృషితో బతకమని ఆశీర్వదించినట్లు). సృష్టి ఉనికి రీత్యా పురుష ప్రయత్నం అనివార్యం. అందువల్ల కాలం మనకు గాయం చేసినప్పుడు, లేదా చేస్తుందని తెలిసినప్పుడు దానికా అవకాశం ఇవ్వకుండా నిలువరించే ప్రయత్నం చేయాలి. మన దృష్టిలోకి రాకుండానే, రాకముందే గాయం అయిపోతే అనివార్యత పేరిట, అంగీకారం పేరిట గాయాన్ని గాలికి వదలివేయకుండా తగిన ఔషధాన్ని ఉపయోగించాలి. అంటే కాలంపట్ల, అది చేసే గారడిపట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. దానిది పైచేయి కానివ్వకూడదు. పురాణాల్లో సుమతి కాలం చేతుల్లోకి తాను వెళ్లలేదు. సూర్యుడుదయిస్తే ఆమె భర్త మరణిస్తాడు. కాలాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోలేదామె. కాలాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. భర్త ప్రాణాలకు హామీ దొరికేదాకా సూర్యుణ్ని ఉదయించకుండా ఆపేసింది. సావిత్రి భర్త ప్రాణాలను తీసికెళ్ళిపోతున్నాడు యముడు. కాలం కలిసిరాలేదని చూస్తూ ఊర్కోలేదు సావిత్రి. యమపురి వరకూ వెంట నడిచింది. పతి ప్రాణాలతో తిరిగివచ్చింది. ధీశక్తి ఉంటే సుమతి, సావిత్రులేకాదు- ఎవరైనా కాలానికి ఎదురొడ్డగలరు. ఓడించగలరు. బిడ్డను కబళించడానికి వస్తే బలహీనురాలైన స్త్రీమూర్తి పులినే ఎదిరించగలదు. దేనినైనా ఎదిరించేందుకు సాధించేందుకు కావలసింది మృగబలం కాదు, మనోబలం. ధైర్యం, వివేకం, విచక్షణ, పిరికితనాన్ని పారద్రోలాలనే స్థిర నిర్ణయం కావాలి. ప్రతివారికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. అధిగమించడానికి ప్రతివారికీ బలం ఉండదు కదా! ధైర్యం ఉండాలి. ధైర్యం ఒక్కటే ఉన్నా సరిపోదు. ఏనుగును బంధించాలంటే మనదగ్గర తాడు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎలా బంధించాలన్న అవగాహన ఉండాలి. సమయస్ఫూర్తి ఉండాలి. అవి వివేకంతో వస్తాయి. వాటిని మనం పెంపొందించుకోవాలి. ఈ శక్తి మిగిలిన జీవరాసులకు లేదు. వాటి జీవన శైలి నిర్ణీతమైనది. పరిమితమైనది. పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా మాత్రమే అవి చరిస్తాయి. శక్తియుక్తులున్న మనుషులు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దుఃఖాన్ని కొనితెచ్చుకుంటున్నారు. దుఃఖం కుక్కలాంటిది. భయపడినట్లు పసిగడితే మీదపడి రక్కుతుంది. ధైర్యంతో ఎదురుతిరిగితే తోక ముడుస్తుంది. అందువల్ల దైవ స్వరూపమైన కాలానికి ఒక నమస్కారం పెట్టి గౌరవంతో దాన్ని మనకు అనుకూలంగా మలచుకోవాలి.
ప్రాపంచిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ధైర్యంగా ఉన్నవారే పారమార్థిక విషయాల్లోనూ ధీమంతులుగా ఉండి గమ్యాన్ని చేరగలరు.
- చక్కిలం విజయలక్ష్మి