ᐅవిజయసోపానం
అంకిత భావంతో చేసిన కార్యం ఫలిస్తుంది. కార్యకుశలత, కఠోర పరిశ్రమ, క్రమశిక్షణ విజయానికి ఆయువుపట్లుగా పనిచేస్తాయి. చిత్తశుద్ధిలేని కార్యం రాణించదు. ఎంత ప్రతిభాశాలి అయినా చేసే పనిలో సంపూర్ణంగా నిమగ్నం కాకపోతే, కార్యసఫలత ప్రశ్నార్థకమే అవుతుంది.
మన వృత్తిలో, చదువులో, ఆటలో- అన్ని వేళలా కార్యసాధనకు అత్యంత ఆవశ్యకమైనది దీక్షాదక్షతలతో కూడిన అంకిత భావం. అదే విజయానికి దిక్సూచిలా పనిచేస్తుంది. అహరహం ఒక తపనతో, కదన కుతూహలంతో విధిని నిర్వర్తించాలి. ఒక పనిలో మనసును పూర్తిగా లగ్నం చేయలేకపోతే విజయం సిద్ధించదు. విజయసోపానాలు అధిరోహించేందుకు మొక్కవోని దీక్ష, సహనం ఆలంబనగా ఉంటాయి.
పోరాటంలో విజయం సాధించేందుకు యోధుడిలో ఆరాటంతోపాటు కృషి, కసి ఉండాలి. లేకపోతే గెలుపు లభించదు. జలధిలో దూకే ముందు తాను ఆవలి ఒడ్డుకు చేరగలనా లేదా, ఎగసిపడే తరంగాలకు ఎదురొడ్డి నిలవగలనా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి. లేకపోతే కెరటాల తాకిడికి, దూకుడుకు ప్రవాహ ఝరిలో కొట్టుకుపోక తప్పదు. కృతనిశ్చయుడై, కార్యరంగంలోకి దిగాక అలుపన్నది మరచి, నిరంతరాయంగా పరిశ్రమిస్తే గెలుపు పిలుపు జీవితాన్ని మేలుమలుపు తిప్పుతుంది. 'ఇప్పటికే నేను చాలా అలసిపోయాను... ఇంకేమి శ్రమించగలను' అని తలపోసినవారికి- చేరువలోని లక్ష్యం దూరమై విజయ ద్వారాలు దాదాపుగా మూసుకుపోతాయి.
విజయానికి నాందిగా నిలిచే మహోత్కృష్ట సుగుణాల్లో వినయం ఒకటి. ఎంతటి ఘనుడైనా ఒదిగి ఉండే సుగుణం కలిగి ఉంటే, విజయసుధలను మధురంగా సేవించడం సులభతరమవుతుంది. అనితర సాధ్యమైన శక్తిసంపదలు, బల పరాక్రమాలు, అద్వితీయమైన పాండితీ ప్రకర్ష ఉన్నా అతి నిరాడంబరమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ఆంజనేయుని దివ్య చరితం ఏనాటికీ ఉన్నత వ్యక్తిత్వ వికాసానికి వన్నె తరగని ఉదాహరణ. రామాయణంలో సీతాన్వేషణ ఘట్టంలో సముద్రాన్ని లంఘించే విషయంలో వానర వీరులు తమ తమ సామర్థ్యాన్ని ఉత్సాహంగా జాంబవంతుడికి చెబుతున్నారు. వంద యోజనాల సముద్రాన్ని దాటే బృహత్తర కార్యంలో నేను పది యోజనాలు దాటగలనన్నాడు ఒక వానర వీరుడు. ఇరవై యోజనాల వరకు దాటగల చురుకుదనం తనలో ఉందన్నాడు ఇంకో వానర శ్రేష్ఠుడు. ఇలా ఎవరికి వారు తమ బలాలను చెప్పుకొంటూ సంబరపడుతున్న వేళ, వారితో అన్నాడు వయోవృద్ధుడూ, జ్ఞానవృద్ధుడు అయిన జాంబవంతుడు. 'నాయనలారా! మీమీ బలాలను ఎంతో ఉత్సాహంగా తెలియజేశారు. చాలా సంతోషం. ఇంత సందడిలోనూ, ఎంతో మౌనంగా, సుదీర్ఘ ఆలోచనా ముద్రలో ఉన్న హనుమంతుణ్ని చూడండి. వంద యోజనాలు కాదు, వేయి యోజనాల సముద్రాన్నీ అవలీలగా దాటగలిగిన ప్రతిభాశాలి హనుమ. అతడు తలచుకుంటే సప్తసముద్రాలూ లంఘించగలడు. ఏ ఆర్భాటమూలేని అతని ప్రవర్తనను తిలకించండి. హనుమ ఎంతటి వినయ సంపన్నుడో తెలుస్తోంది కదా? అతని ఆలోచనల్లో సముద్రాన్ని దాటాక లంకలో ఎలా ప్రవర్తించాలన్న విషయం అణువణువునా నిండిపోయినా ఏమీ ఎరుగని అమాయకునిలా నిలబడి ఉన్నాడు చూడండి! వాయువేగ, మనోవేగాలతో పురోగమించి చేబూనిన కార్యంలో విజయ దుందుభి మోగించగలిగిన సామర్థ్యం హనుమ సొంతం. మాటల్లో మౌనం. చేతల్లో మాత్రం మహా ఘనం. ఇదే నాయనా! ఉత్తములైన కార్యసాధకుల లక్షణం' అంటూ... వానరవీరులకు వినయంతో విజయాన్ని సాధించే విధానాన్ని బోధిస్తాడు.
అనంతరం ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించటం, అశోకవనంలో సీత జాడ కనిపెట్టడం, లంకా నగరాన్ని విధ్వంసం చేసి, రావణుడి అమేయమైన మనోస్త్థెర్యాన్ని దెబ్బ తీయటం... తెలిసినవే. విశాలమైన సాగరాన్ని దాటే సమయాన విశ్రమించమని కోరిన మైనాకుడి కోరికను సున్నితంగా తిరస్కరిస్తూ, హనుమంతుడు 'నాయనా! నేను రామకార్య సాధనకై సీతాదేవిని అన్వేషించటానికి వెళుతున్నాను. కార్యంలో సఫలీకృతుడనై, విజయాన్ని సాధించేవరకు మార్గంలో ఎక్కడా ఆగకూడదనేది నా నియమం' అంటాడు. ఆ మాటల్లో- తలపెట్టిన కార్యం నెరవేరేవరకు సాధకుడు విశ్రమించకూడదన్న సందేశం అంతర్లీనంగా ద్యోతకమవుతుంది. చేసే పనిలో అంకితభావం, కఠోరదీక్ష, తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వినయ సంపన్నత, కార్యదీక్షలో విజయం సాధించే వరకు విశ్రమించకపోవటంవంటి ఉత్తమలక్షణ సంజాతుడైన ఆంజనేయుని దివ్య చరితం వైవిధ్య భరితమైన భారతీయ సంస్కృతికి వెలకట్టలేని ఆభరణం. సదా పరిశ్రమించే కార్యసాధకులకు నిత్యస్మరణం.
- వెంకట్ గరికపాటి