ᐅకాలాయనమః



కాలాయనమః 

మనిషి ఎదిగాడు. నిరంతరం కాలాన్ని జయించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాలం అంటే- ప్రకృతికీ మనిషితోపాటు ప్రతి జీవరాశికీ మధ్య మారే సంబంధాల పరిణామక్రమమే. పరిణామం లేకపోతే కాలం ఆగిపోతుంది.
విశ్వవ్యాప్తమైన ప్రకృతి నిరంతరం కాలంతోపాటు పరిణామం చెందుతూనే ఉంటుంది. విత్తనం భూమిలో పడి అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తుతుంది. మొగ్గ తొడుగుతుంది. పూవుగా మార్పు చెందుతుంది.

వికృతరూపియైన గొంగళి, సీతాకోకచిలుకగా రూపొందటం ఎంత అందమైన పరిణామం!

మనిషి జననం, మరణం, మధ్యలో సాగే బాల్యం, యౌవనం, కౌమారం, వృద్ధాప్యం... కాలం గడుస్తోందనటానికి తార్కాణాలు.

కాలం ఆగేది కాదు. పగలు, రాత్రి రూపంలో క్షణాలు నిమిషాలై, నిమిషాలు గంటలై, రోజులై, సంవత్సరాలై కనులముందు దొర్లిపోతూ ఉంటాయి.

ఈ క్షణం మరుక్షణానికి గతంగా మారుతుంది. భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఇలా నిరంతరం మార్పుచెందుతూ ఉండే కాలం, ప్రకృతి ఒక దానితో ఒకటి అనుబంధంగా సాగిపోతూ ఉంటాయి. ఎవరు కాదన్నా వద్దన్నా జరిగిపోతూనే ఉంటుంది. అందుకే 'ఈ క్షణం అనివార్యం' అంటారు ఆధ్యాత్మికులు.

ఇలా అన్నీ తెలిసినా మనిషి మనసు మాయలో పడి గతించిపోయిన క్షణాలను, రాబోయే క్షణాలకు ముడిపెట్టి ఏవేవో వూహించుకుంటాడు. వూగిసలాడుతుంటాడు.

అనుక్షణం ఏదో జరగాల్సినది జరగలేదనే తపన. నిజానికి ఆ క్షణంలో భగవంతుడు నిర్దేశించినది, నిర్ణయించినది జరగకుండా ఆగుతుందా!

భగవంతుడు గొప్ప కాల నిర్ణేత. ఎప్పుడు ఏది ఎలా జరగాలో నిర్దేశిస్తూ మనిషితోపాటు చరాచర జీవకోటిని నడిపిస్తున్నాడు. మనిషిని పరీక్షించడంకోసం కష్టాలు నష్టాలు కలిగిస్తూ ఉంటాడు. అంతలోనే నిద్రపోకుండా ఏడ్చే పాపాయికి, అమ్మ పాడే జోలపాటలా ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటాడు. బిడ్డ ఆరోగ్యంకోసం తల్లి చేదు ఔషధాలు తినిపించినట్లు మనిషి కాలప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలబడటంకోసం కష్టాలు, కన్నీళ్లనే చేదుమాత్రలిస్తాడు. చివరకు అవి అనుభవాలుగా తెలియజెప్పి జీవితాన్ని ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తాడు. జీవితంలో ఎదురయ్యే ప్రకృతి పరిణామాలన్నీ సహజమైనవే అనే జ్ఞానాన్ని కలిగిస్తాడు. అలా మనిషి పడే తపన, ఆరాటాలను పావులుగా చేసి గెలుపు ఓటములను చవిచూపిస్తాడు. చివరకు మిగిలేది శూన్యరూపంలో తానుగా ఉన్న భగవంతుడే అని నిరూపిస్తాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు 'చేసేది, చేయించేది అంతా నేనే. అంతా నాలోనే ఉంది' అని చెప్పాడు.

కాలంతోపాటు ప్రకృతిలో జరిగే మార్పులు సంభవాలు అన్నీ భగవంతుని అంతర్భాగాలే అనే సూక్ష్మజ్ఞానాన్ని అవగాహన చేసుకుంటే కాలంకంటే ముందే మనసును పరిగెత్తించకుండా, జరుగుతున్న క్షణాన్ని యథాతథంగా అనుభవించగలుగుతాం. ఆనందంగా జీవించగలుగుతాం. అందుకే కాలానికి నమస్కారం. కాలాయనమః!

- డాక్టర్ డి.చంద్రకళ