ᐅహృదయ దర్పణం
అంకుశాన్ని లెక్కచేయని మదగజం మాదిరిగా, కళ్లానికి లోబడని అశ్వంలాగా, మంత్రాన్ని అతిక్రమించే సర్పంవలె ఏదైనా ఉన్నదా అంటే- అది నిస్సంశయంగా 'మనసు' అని సమాధానం! మనసు కోతి వంటిదనీ, దాన్ని స్థిరంగా నిలిపినవాడే గొప్ప యోగి అనీ వేమన పలుపద్యాల్లో పేర్కొన్నాడు. సాధన ఉంటే దేనినైనా సాధ్యంచేయడానికి ప్రయత్నించవచ్చు. సాధనమూ తానే సాధ్యమూ తానే అయిన మనసును లోబరచుకోవడం కష్టం.
మన మనసును బట్టే లోకం మనకు కనబడుతుంది. మనసును నిష్కల్మషంగా, సంతోషంగా నిలుపుకొన్నవారికి లోకమంతా ఉత్సాహమయంగా, ఆనందప్రదంగా గోచరిస్తుంది. ఈర్ష్యాసూయలు పరవళ్లు తొక్కే హృదయం కలవారికి లోకంలో ఎక్కడ చూసినా అవే గోచరిస్తాయి.
ఒక మహాత్ముడి వద్దకు వెళ్ళి 'నాకు ఏదైనా జీవితానికి ఉపయోగపడే వస్తువును ప్రసాదించండి!' అని ప్రార్థించాడు ఒక సంసారి. ఆ మహాత్ముడు ఒక దర్పణాన్ని సంసారికి ఇచ్చి 'ఈ అద్దాన్ని ఎవరివైపు తిప్పితే వారి మనసులో ఉన్నది ఇందులో కనబడుతుంది!' అని చెప్పాడు. నాటినుంచి సంసారి కనబడిన వారందరివైపూ అద్దాన్ని తిప్పి చూడసాగాడు. భార్య, పిల్లలు... అందరిలో దుర్గుణాలు కనబడ్డాయి. చాలామంది చుట్టాలు దొంగలని గ్రహించాడు. స్నేహితులు ఈర్ష్యాళువులై అద్దంలో దర్శనం ఇచ్చారు. ఆశ్చర్యంతో సంసారి తిరిగి వచ్చి, మహాత్ముడి వైపు అద్దాన్ని పెట్టగా, ఆయనలోనూ దుర్గుణాలు దర్శనమిచ్చాయి. మహాత్ముడు నవ్వుతూ 'ఆ అద్దాన్ని నీవైపు తిప్పుకో' అని ఆదేశించాడు. సంసారి అలాగే దాన్ని తనవైపు తిప్పుకొని చూశాడు. ఆ దర్పణంలో సంసారి హృదయం లోపలఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలు వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షం కాగా, అతడు భయంతో వణికిపోయాడు. 'నాయనా... చూశావుగా! ఈ దుర్గుణాలన్నీ నీలోనే ఎక్కువగా ఉన్నాయి. నీ హృదయంలో ఉన్న గుణాలనే ఇతరుల్లో చూస్తున్నావు. నీ మనసుకు పట్టిన మకిలిని శుభ్రంచేసుకుంటే, లోకమంతా స్వచ్ఛంగా కనబడుతుంది' అని ఆ మహాత్ముడు సంసారికి ఉపదేశం గావించాడు.
కామం సర్వదుష్టగుణధామం. క్రోధం గలవారు గురు వధకైనా వెనకాడరు. పాపాలకు అధిష్ఠానం లోభం. అది పర ధన, దార వాంఛలకు మూలం. అజ్ఞానానికి అదే కారణం. ఇక మోహం, ఇది 'కాని పని' అని తెలిసి కూడా చేయడం మానలేరు; తిరిగి పోవాలని తెలిసీ తిరిగిపోరు; విడవాలని తెలిసీ విడవలేరు- అటువంటి దుర్లక్షణాలు కలిగింది ఈ మోహం. ఇక మదం సంగతి- సముద్రాన్ని పుక్కిలిస్తానంటాడు; భూమండలాన్ని పెళ్లగిస్తానంటాడు; మేరువు గడ్డిపోచ అంటాడు- మదసన్నిపాత వ్యాధిగ్రస్తుడు! ఇక మాత్సర్యంకంటే కీడు మరిలేదు. ఇవన్నీ పుట్టేదీ పెరిగేదీ మనసులోనే. అపకీర్తికీ, ఆపదలకూ ఇవే కారణం. ఇవి ఎవరిమనసులో ఉంటాయో వారికి, అవి ఇతరుల హృదయాల్లోఉన్నట్లు గోచరిస్తాయి.
ఒక యోగి పుంగవుడు సమాధి అవస్థలో కదలక మెదలక దారి పక్కన పడిఉన్నాడు. దొంగ ఒకడు యోగిని చూశాడు. 'ఇతడెవరో రాత్రంతా దోపిడి చేసి, అలసిపోయి ఇలా పడి, గాఢనిద్రలో ఉన్నాడు. ఇక్కడ నేనుంటే రక్షకభటులు నన్ను కూడా బంధిస్తారు!' అనుకొంటూ వెళ్లిపోయాడు. ఒక తాగుబోతు వచ్చి, వీడికంటే నేనే నయం... పడిపోయేంత తాగను!' అని తనను తాను అభినందించుకొంటూ వెళ్లిపోయాడు. ఆ తరవాత ఒక సాధువు వచ్చాడు. 'ఎవరో మహానుభావుడీయన! పరమేశ్వర ధ్యానంతో ఒడలు మరచిఉన్నాడు. ఇటువంటి మహాత్ముల శిష్యరికం వలన జన్మ ధన్యంఅవుతుంది!' అనుకొంటూ, ఆ యోగి పుంగవుడికి సేవచేస్తూ ఉండిపోయాడు. ఈ లోకం ఆ యోగి పుంగవుడివంటిదే. సాధువు వంటి స్వచ్ఛమైన హృదయ దర్పణం గలవారికి సమాజం తాలూకు సత్యస్వరూపం కనబడుతుంది!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు