ᐅస్వర్ణ ప్రతిమ
శాంతికోసం రోజూ ప్రార్థన చెయ్యాలి. నిజమే కాని, ప్రార్థన చెయ్యడానికి శాంతిలేదు. ఇది చాలామంది పరిస్థితి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఏ పనైనా సాధించగలం. భగవంతునికోసం సాధనగాని, ధ్యానంగాని చేయాలంటే శాంతి తప్పనిసరి. ఏకాగ్రత ద్వారా శాంతిని పొందవచ్చు. మనకు బలం ఇచ్చేది ఏకాగ్రతే. మనం ప్రశాంతంగా ఒకచోట కూర్చొని ధ్యానం చెయ్యడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఫిర్యాదు చేస్తుంటాం. మనం మనస్ఫూర్తిగా శాంతిని ఆకాంక్షించినట్లయితే కోరినదాన్ని పొందడానికి సృష్టి అంతా సహకరిస్తుంది. అల్ప వివాదాలు, అల్ప విషయాల జోలికి వెళ్లి చీటికి మాటికి శాంతిని భగ్నం చేసుకొని శక్తిని కోల్పోతుంటాం. మనశ్శాంతి, ఆనందం, సామరస్యభావ మాధుర్యాలు ఎంతో విలువైనవి. వాటిని అల్ప విషయాలకోసం బలిపెట్టడం అవివేకం.
చాలాకాలం కిందట అద్భుతమైన విగ్రహాన్ని ఒక ఆలయం నుంచి మరో నూతన ఆలయంలోకి తరలిస్తున్నారు. అప్పుడు పెద్ద వర్షం ప్రారంభమైంది. భక్తులు తదితరులు వెనువెంటనే గొడుగులు తీసి ఆ విగ్రహం తడిసిపోకుండా రక్షణ కల్పించారు. కొందరు కొబ్బరి ఆకుల్ని దానిపై కప్పారు. అయినా, విగ్రహం బాగా తడిసిపోయింది. దానిపైవున్న మట్టి పొరలు కరిగిపోయాయి. ఆ మట్టి తొలగిపోగానే కళ్లు జిగేలుమనే కాంతులతో మెరిసే పరమ రమణీయ సువర్ణ ప్రతిమ భక్తులకు కనిపించింది. దొంగల దృష్టి పడకుండా కావాలనే పూజారులు ఆ ప్రతిమపై మట్టిని పేర్చారు. చాలామంది అది మట్టి విగ్రహమనే అనుకున్నారు. ఇన్నాళ్లూ ఆ భావనతోనే ఆరాధించారు.
ఇది ఆ విగ్రహం కథ కాదు. మన అందరి కథ. ప్రతిమనిషి వ్యక్తిత్వంలో అనేక పొరలు ఉంటాయి. వాటి కింద బంగారు రంగులో ధగధగా మెరిసే ఆత్మప్రతిమ భాసిస్తుంటుంది. సాధారణంగా పైన ఉన్న పొరల ఆధారంగానే లోకంలో అంతా జీవిస్తుంటారు.
స్నేహితుల వేళాకోళాలు, బంధువుల విమర్శలు, సూటిపోటి మాటలు, వాటికి ఉత్పన్నమయ్యే కోపతాపాలు అన్నీ పైపొరలకే బలంగా తాకుతాయి. అవి మనసును మెదడును బాధపెడతాయి. లోపలవున్న స్వర్ణ ప్రతిమవైపు ఆంతరంగిక యాత్ర చేయడం నేర్చుకొంటే ఈ అల్ప సంఘటనలు ఆందోళన కలిగించవు. అవి పైపొరల్ని మాత్రమే దెబ్బతీస్తాయి. వాటికి ఓర్చుకొంటే అన్ని పరిస్థితుల్లోనూ శాంతంగా, సమస్థితిలో బతకడం అలవడుతుంది. అటువంటి శాంతి సింహాసనాన్ని సుస్థిరంగా అధిష్ఠించాలంటే లోపల ఉన్న స్వర్ణ ప్రతిమను తెలుసుకోవాలి. అదే అంతర్ణిక్షిప్త జ్ఞాన తేజోరాశి. లోపలవున్న బంగారుకాంతి మన వ్యక్తిత్వాన్ని ముంచెత్తుతుంది. అందుకే జ్ఞానుల ముఖవర్చస్సు వెలిగిపోతుంటుంది. ఈ సాధనకే శాంతి కావాలి. శాంతి ఉన్నప్పుడే అంతర్గత తీర్థయాత్ర సార్థకమవుతుంది. అదే భవితవ్య శిఖరం. అదే జీవన సాఫల్యం! అమృతావిష్కారం!
- కె.యజ్ఞన్న