ᐅఆనందోబ్రహ్మ



ఆనందోబ్రహ్మ 

మానవ సంబంధాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. పుట్టుకతోనే తల్లిదండ్రులతో బంధం ఏర్పడుతుంది. ఆపై సోదరులు, ధర్మపత్ని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, కోడళ్లుగా విస్తరిస్తుంది. వారందరిలో ఒకే రకమైన అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగడం ప్రశ్నార్థకమే! ఒక్కోసారి ఆర్థిక అవసరాలు అనుబంధంతో ఆడుకుంటాయి. వీటి ప్రభావంవల్ల కొందరిపై ప్రేమానురాగాలు తాత్కాలికంగా పెరగనూవచ్చు, లేదా తరగనూవచ్చు. అనుబంధంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
రామలక్ష్మణులు, బలరామకృష్ణులు ఏకోదరులు కాకపోయినా వారిమధ్య అనుబంధం చాలా బలమైనది. కాలం మారింది. ఒక మిత్రుడు అవసరార్థం మనకు అప్పు ఇచ్చినప్పుడు అతడు దేవుడిలా కనిపిస్తాడు. అదే వ్యక్తి తన బాకీ చెల్లించమని అడిగినప్పుడు రాక్షసుడిగా మారిపోతాడు! తాను సృష్టించిన ధనం కోరల్లో మనిషే చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. సాంకేతిక ప్రగతి తారస్థాయికి చెందిందని, అన్ని సౌకర్యాలూ అందుతున్నాయని ఆనందపడుతున్నాడు. తాను కనిపెట్టిన యంత్రాలకు తానే బానిసై యాంత్రిక జీవనం గడుపుతున్నానని గ్రహించలేకపోతున్నాడు.

నేటి సమాజంలో టీవీ, సెల్‌ఫోన్, వాహనం లేని జీవితాన్ని వూహించగలమా? పొరపాటున సెల్ పోగొట్టుకుంటే అందులో బంధించిన వందలాది వ్యక్తుల నెంబర్లు గుర్తురాక... కొత్తది కొనేంతవరకూ అతడనుభవించే నరకయాతన వర్ణనాతీతం!

ఈ సౌకర్యాలేమీలేని నిరుపేద నిశ్చింతగా జీవితాన్ని గడుపుతాడు. పట్టు పరుపులపై నిద్రరాక అవస్థపడే ధనవంతుడి కన్నా... కటిక నేలపై గాఢనిద్రపోయే పేదవాడు ఎంతో మిన్న. అలాగని మనం పేదరికాన్ని కోరుకోలేం... ఆకలి జీవితాన్ని ఆహ్వానించలేం! ఐశ్వర్యం సంపాదించగలం. మనశ్శాంతిని పొందలేం. ఖరీదైన పరుపును కొనగలం... నిద్రను కొనలేం... మనిషిని జీతమిచ్చి తెచ్చుకోగలం. అతని మనసును గెలవలేం. అందలం ఎక్కగలం... ఓటమిని భరించలేం... సుఖాన్ని వెదుకుతాం... సంతోషానికి దూరమవుతాం. 'రాగద్వేషాలను జయించాలి. స్థితప్రజ్ఞత సాధించాలి' అంటుంటాం. కాని, తనదాకా వస్తే తప్పక అందరిలానే ప్రవర్తిస్తాం. ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకోలేం. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం నిజం! భూమి సూర్యుడిచుట్టూ తిరగడం సత్యం! ఈ రెంటిమధ్యనున్న సన్నని సున్నితమైన పొరను ఛేదించలేం... ఒక అదృశ్య అద్భుతశక్తి మనల్ని ఆడిస్తుందని నమ్మేవారెందరో... దానికి దేవుడు అని పేరు పెట్టుకుని అనేకరకాలుగా ధ్యానిస్తున్నాం... పూజిస్తున్నాం... కోరికలు కోరుతున్నాం... అవి నెరవేరితే దేవుడి మహిమ అంటున్నాం. నెరవేరకపోతే అదే దేవుణ్ని నిందిస్తున్నాం. లేదా కొత్తదేవుణ్ని వెతుక్కుంటున్నాం.

ఇలా నిత్యం సమస్యలు, సంక్షోభాలు, సంఘర్షణల మధ్యే మనిషి జీవితాంతం గడపాలా? సమస్యలు లేని జీవితం- కెరటాలు లేని సముద్రం వంటిది. అవి మనిషి జీవనయాత్రలో అంతర్భాగాలుగా భావిస్తే ఇక చింత ఏముంటుంది? మానవ చరిత్రలో ఏ దుఃఖమూ లేకుండా మొత్తం జీవితమంతా గడిపిన మనిషి ఉన్నాడా?

'బాధలు నన్ను వీడితే అనాథలైపోతాయి' అని ఒక కవి వ్యాఖ్యానించాడు. జీవిత మాధుర్యాన్ని అనుక్షణం ఆస్వాదించడమే ఆనందోబ్రహ్మ!

- కిల్లాన మోహన్‌బాబు