ᐅతీరు మారాలి
ఆపద్ధర్మాలంటే అత్యవసర సందర్భాల్లో లభించే రాయితీలు. అనారోగ్యంతో బాధపడేవాళ్లు అనుష్ఠానం మానేయవచ్చు- అన్నారనుకోండి. లేవలేని పరిస్థితి ఉంటే ఆ రాయితీని వాడుకోవాలి. అంతేకాని- రొంపకీ, దగ్గుకీ అనారోగ్యం అని పేరుపెట్టి నిత్యవిధులు ఎగ్గొట్టడం దోషం. 'వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణవిత్తమాన భంగమందు... బొంకవచ్చు' అని మహాభారతం మనకో రాయితీ ప్రకటించింది. మనిషి జీవితానికి సంబంధించిన సకల సందర్భాలనూ- వాటిలో దేనిలోకో నప్పించేసి అడ్డంగా బొంకడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఏ సందర్భంలో అబద్ధం ఆడినా- ప్రాణంమీదకు వచ్చిందనో, ద్రవ్యం నష్టం కాబోయిందనో, మానహాని కారణంగా అనో... సరిపెట్టుకోవడం షరా మామూలైంది. ఒక్కముక్కలో, ఆపద్ధర్మాలను నిత్యధర్మాలుగా మార్చి దుర్వినియోగం చేస్తున్నారు.
ఇంద్రుడి ద్వారా సాధించిన శక్తి ఆయుధాన్ని కర్ణుడు అపురూపంగా దాచిపెట్టుకున్నాడు. దాంతో అర్జునుణ్ని జయించాలని అతడి కోరిక. ఈలోగా ఘటోత్కచుడు దాపురించి కౌరవులను ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. గతిలేక సుయోధనుడి బలవంతం మీద ఒక్కసారి మాత్రమే ఉపయోగపడే ఆ అమోఘ ఆయుధాన్ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుణ్ని మట్టుపెట్టాడు. ఆపద్ధర్మం అంటే- అదిగో అదీ!
ఉదాత్తమైన లక్ష్యాలకు గురిపెట్టవలసిన కొన్ని జీవన సూత్రాలకు, వక్రభాష్యాలతో విపరీత వ్యాఖ్యానాలతో దుర్వినియోగం చేయడం మనమిప్పుడు తరచూ చూస్తున్నాం.
ఉదాహరణకు- 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమో, అప్పటికి ఆ మాటలాడి నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు' అని సుమతీ శతకకారుడు చెప్పిన ఉపాయాన్ని ఈ జాతి చాలా దుర్మార్గంగా వినియోగంలోకి తెచ్చింది. ఎవడిదగ్గర చెప్పవలసింది వాడి దగ్గర చెబుతూ తన చేతికి మట్టి అంటకుండా తప్పించుకు తిరిగే లక్షణాన్ని- ఆ పద్యానికి తాత్పర్యంగా అమలులోకి తెచ్చింది. పైపెచ్చు దాన్ని మాటకారితనంగా, మాటనేర్చినతనంగా మెచ్చుకుంటోంది.
'ఎప్పటికెయ్యది ప్రస్తుతం' అనే భావనకు అసలైన అర్థం తెలుసుకోవాలంటే- మనం హనుమంతుడి కథలోకి వెళ్ళాలి. మాట తీరుకు ఆచార్యుడు అంటూ ఉంటే, ఆయనెలా ఉంటాడో- వాల్మీకి మనకు హనుమంతుడి పాత్రద్వారా చూపించాడు. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఈ జాతికి గొప్పగా నేర్పిన మహనీయుడు- హనుమంతుడు. దీనికి రామాయణంలో ఎన్నో ఘట్టాలు సాక్ష్యం చెబుతాయి.
శ్రీరామచంద్రుడి బాణానికి గాయపడి వాలి అక్కడ పడి ఉన్నాడు. అంతఃపురంలోంచి తార దూసుకొచ్చింది. కొన ఊపిరితో అల్లాడుతున్న వాలి దేహంపై పడి గొల్లున విలపించింది. అంతవరకూ అరివీర భయంకరుడైన వాలి పాలనలో నిర్భయంగా జీవిస్తున్న వానరవీరులంతా రాముడి పరాక్రమానికి భయకంపితులై- సుగ్రీవుణ్ని ద్వేషంతో పరికిస్తూ ఉండగా హనుమంతుడు ముందుకొచ్చాడు. తారను ఓదార్చాడు. 'నీ కొడుకును పట్టాభిషిక్తుణ్ని చేసి వెనకనుంచి నీవు రాజ్యచక్రం తిప్పు' అన్నాడు.
ముందు జరిగిన ఒప్పందాలకు ఇది పూర్తిగా విరుద్ధం. ఇది చాలా ఆశ్చర్యకరమైన మలుపు. సంచలనాత్మకమైన పిలుపు.
అంతకుముందే కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ని పట్టాభిషిక్తుణ్ని చేస్తానని మాట ఇచ్చాకనే- రాముడు వాలిని సంహరించాడు. ఈ విషయం హనుమంతుడికి తెలుసు. అయినా, అక్కడ పరిస్థితి గమనించి ఆ మాట అన్నాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే- తమ చక్రవర్తి, మహాబలశాలి వాలి హఠాన్మరణం వానర వీరుల్లో తీవ్ర సంతాపాన్ని రేకెత్తించింది. అది క్రమంగా సుగ్రీవుడి పట్ల ద్వేషంగా పరిణమిస్తోంది. ఈ దశలో హనుమంతుడు ఆ మాట అన్నాడు. ఎప్పటికి ఏది ప్రస్తుతం- అనే మాటకు అర్థం ఫలితం గమనిస్తే తెలుస్తుంది.
వెంటనే తార 'అది ధర్మం కాదు. పెద్దవాడు సుగ్రీవుడు ఉండగా అంగదుడికి పట్టాభిషేకం తప్పు. ఈ రాజ్యం సుగ్రీవుడిది!' అంది. ఆవిడ మాత్రమే ఆ మాట అనగలదు. ఆవిడ అంటేనే- వానరవీరులంతా సుగ్రీవుణ్ని ప్రభువుగా అంగీకరిస్తారు. రేపు సీతాన్వేషణలో సుగ్రీవాజ్ఞలను శక్తివంచన లేకుండా అమలు చేస్తారు. ఈ రకమైన రాజకీయ చాతుర్యం లేకుండా రాముడి అండ చూసుకుని- సుగ్రీవుణ్ని బలవంతంగా కిష్కింధకు రాజును చేస్తే, అసమ్మతి రాజుకుని తీరుతుంది. అందుకే హనుమంతుడు ఈ చాణక్యం ప్రదర్శించాడు. మరణం వంటి అతిసున్నితమైన ఉద్వేగభరితమైన సన్నివేశంలో మానస సరోవరాల్లో చెలరేగే కల్లోల సంక్షుభిత తరంగాలను ఉద్రిక్తత వైపు కాకుండా లోకహితం వైపు ఎలా మళ్లించాలో, మనకు వాల్మీకి మహర్షి హనుమంతుడి చర్యల ద్వారా సూచించాడు.
శ్రీరామచంద్రుడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనీ, వాలిని వధించి రాజ్యాన్ని అతడికి కట్టబెడతాడనీ హనుమంతుడికి ఖాయంగా తెలుసు. అయినా అది బలవంతంగా జరిగితే ఆ తరవాత ఏర్పడే విపత్కర విపరీత పరిణామాలను ముందే హించి, దానికి విరుగుడుగా 'ప్రస్తుత' పరిణామాలను అనుకూలంగా మలచుకోవడం హనుమ చతురత. అదే అతని ప్రస్తుత లేదా తక్షణ కర్తవ్యం.
ప్రస్తుతం అనే మాటకు ఆ పూట సర్దుబాటుకు మాత్రంగానే కాకుండా, భవిష్యత్తులోని పరిణామాలకు అనుగుణంగా అనే విపులమైన అర్థం తీసుకుంటే ఆ మాట సార్థకం అవుతుంది.
- ఎర్రాప్రగడ రామకృష్ణ