ᐅపుణ్యం-పాపం




పుణ్యం-పాపం 

ఓ సాధుపుంగవుడు దేశాటన చేస్తూ ఎండవేళ ఒక వూరి మధ్య రావిచెట్టు నీడన ఆగి సేద తీరుతున్నాడు. అది గమనించిన గ్రామస్తులు ఒకరి వెంబడి మరొకరు ఆయన వద్దకు చేరి నమస్కారాలు చేయటం మొదలుపెట్టారు. అతిథిగా విచ్చేసిన ఆ సత్పురుషునికి ఓ కాయో పండో సమర్పించటం మాట అటుంచి, కనీసం గుక్కెడు మంచినీళ్ళయినా ఇవ్వాలని ఎవరికీ తోచలేదు. కొద్ది సమయం తరవాత ఆయన కళ్లు తెరిచి అందరినీ ఆప్యాయంగా కలయచూస్తూ 'నాయనలారా! నేను ఏళ్ల తరబడి కఠోర నియమ నిష్ఠలతో ఎన్నెన్నో జపతపాలు ఆచరించి ఎంతో పుణ్యాన్ని సంపాదించాను. ఆ పుణ్యఫలాన్ని అత్యధికంగా మీకు పంచి ఇవ్వాలని ఇప్పుడే నిశ్చయించుకొన్నాను. అది ఎవరెవరికి ఎంతెంత కావాలో ఆలోచించుకుని నాకు చెప్పండి' అంటూ మొదటగా ఓ వ్యక్తిని ఆహ్వానించాడు. అతడు, 'మీకు తోచినంత' అన్నాడు. మరొకాయన, 'ఎంతకైనా సిద్ధమే!' అన్నాడు. ఇంకొక పెద్దమనిషి ఆయన చెవిలో 'ఎంతేమిటి స్వామీ! అంతా నాకే!'అన్నాడు. ఆ కోరికలను చిరునవ్వుతో వింటున్న సాధువు, 'సరే... బాగుంది! కానీ, నేను ఆర్జించిన ఆ పుణ్యరాశితోపాటు కొద్ది పాపఫలం నా సద్గతికి ఆటంకమై నిలిచింది. మీకు ఇష్టమైతే... దాన్ని కూడా మీరందరూ లేశమాత్రంగా సర్దుకోవటానికి సిద్ధమేనా? భయపడవలసిందేమీ లేదు...' అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగానే, గ్రామస్తులు ముఖం చిట్లించారు. 'ఏదో పుణ్యఫలం పంచుతానంటే ఆశపడ్డాం, మీ పాపఫలం ఎవరిక్కావాలి... మీ పుణ్యానికో నమస్కారం... మమ్మల్ని ఇలా బతకనివ్వండి చాలు!' అంటూ ఆ మహాత్ముణ్ని లోలోపల తిట్టుకొంటూ తలా కాస్త పాపాన్ని మూటకట్టుకొని ఇళ్లకు చేరారు. మహాత్ముల మాటల్లోని మర్మం గ్రహించే విజ్ఞత అందరికీ ఉండకపోవచ్చు. వారు ఇతరులకు మేలే చేస్తారు తప్ప కించిత్త్తెనా కీడు తలపెట్టరని చాలామందికి తెలిసిన విషయమే. ఈ గ్రహింపుతోనైనా ఆ గ్రామస్తులు ఏ కొద్ది సంయమనం పాటించి మౌనం వహించినా, ఈ సంఘటనకు ముగింపు ఎలా ఉండేదో!
ఓ పెద్దాయన గాంధీజీతో 'ఒక పాము తన నోటికి చిక్కిన కప్పను మింగటానికి సిద్ధం కావటం మీ కంటబడితే, అహింసావాదిగా మీరేం చేస్తారు?' అన్నాడు. దానికి మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి, 'చేసేదేముందీ! చూసీ చూడనట్లు నా దారిన నేను పోతాను' అని జవాబిచ్చారట. పాపపుణ్యాలతో ముడివడిన ధర్మసూక్ష్మాలన్నీ ఇలాగే ఉంటాయి. ఏదిపుణ్యం, ఏది పాపం అనే విషయాన్ని ఇదమిత్థంగా నిర్ణయించటం అంత తేలిక కాదు. అందుకే లోతులకు పోకుండా- 'ఇతరులకు మేలు చేయటం పుణ్యం, కీడు చేయటం పాపం' అని పూర్వులు ఓ కొండగుర్తుగా చెప్పారు.

లక్షలాది జీవరాశుల్లో మానవజాతి అత్యున్నతమై నిలవటానికి కారణం వారికి ఉన్నదీ, ఇతర జీవులకు లేనిదీ- అయిన 'వివేకం' అనే గొప్ప లక్షణం. మంచిచెడులను గుర్తించే నేర్పు, మంచిని ఆహ్వానించటం, చెడుకు స్వస్తి పలకటం మానవులకే సాధ్యం. పుణ్యం కావాలంటే మంచి పనులు చేయాలి, పాపం వద్దంటే చెడ్డ పనులు మానాలి. పుణ్యం అంగట్లో దొరికే వస్తువు కాదు. దాన్ని శ్రమించి సాధించుకోవాలి. అంటే... మనిషి సద్వర్తనుడు, ఆచరణశీలి కావాలి. సాత్వికాన్ని స్వాగతించాలి, రాజసికాన్ని సంస్కరించుకోవాలి, తామసికాన్ని తరిమికొట్టాలి. సాధు సత్పురుషుల ప్రవర్తనను ఆదర్శంగా స్వీకరించి, వారి మాటల్లోని అంతరార్థాలను ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ముందుకు సాగాలి. అప్పుడే... మనసు నిర్మలమై పుణ్యసాధనకు సహకరిస్తుంది.

భగవద్గీత చెప్పినట్లు, అపేక్షించినా అపేక్షించకపోయినా చేసిన ప్రతి పనికీ తగిన ఫలం లభించక మానదు. కనుక, ఫలితాల మీద దృష్టి కేంద్రీకరించకుండా, ఆచరణ విషయంలోనే మనిషి వివేకిగా అత్యంత మెలకువతో ప్రయత్నశీలుడు కావాలి.

- ప్రొఫెసర్ పిసిపాటి వెంకటేశ్వరరావు