ᐅపారమార్థిక ప్రయోగశాల
ఒక విషయానికి సంబంధించిన నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు లోతుపాతులు తోడిపోసేందుకు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రయోగానికి వస్తువు ఇదీ అదీ అనేం లేదు. ఏదైనా కావచ్చు. వ్యాధులు, ఔషధాలు, పంటలు, వంటలు, నూతనాంశాల ఆవిష్కరణ... ఏదైనా కావచ్చు. గాంధీజీ ఇంగ్లాండులో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆహారం మీద ప్రయోగాలు చేశారు. ఆ తరవాత తన జీవితాన్నే సత్యాహింసల మీద జరిపే ప్రయోగశాలగా మార్చుకున్నారు. పూర్వం రుషులు సత్యాన్వేషణకు తమ శరీరాన్నొక పరికరంగా, ప్రయోగశాలగా మలచుకున్నారు. మనకు పరమాత్మపట్ల మోక్షాకాంక్షపట్ల నిజాయతీ ఉన్నప్పుడు మనం జీవితాన్ని పారమార్థిక ప్రయోగశాలగా ఎందుకు మార్చుకోకూడదు?
ప్రయోగశాలలో ప్రతి క్షణం, ప్రతి పని, ప్రతి వస్తువు, ప్రతి ఆలోచన ప్రయోగపూర్వకంగా ప్రయోగాభివృద్ధికి ఉపకరించేదిగా ఉంటుంది. మనం జీవితాన్నొక పరమార్థ ప్రయోగశాలగా చేసుకున్నప్పుడు మన గతి, మన మతి, మన శ్రుతి అన్నీ ప్రయోగాత్మకంగా ప్రత్యగాత్మను చేరే దిశగా ఉంటాయి. నాణానికి ఓ వైపున జీవితం చాలా పెద్దదే కావచ్చు. కానీ, మరోవైపు చూస్తే జీవితం చాలా చిన్నది. 'ముక్తిధామ పరిక్రమ'మనే బృహత్‌ప్రణాళిక ముందు మన జీవితం ఏమాత్రం సరిపోని, సరితూగని స్వల్పకాలిక సమయం. పరమపదమో- కొన్నిసార్లు జీవితాలకు జీవితాలు, జన్మ పరంపరలు వెచ్చించినా అంతుబట్టని సుదీర్ఘ పయనం, మహత్తర ప్రయత్నం. కాబట్టి ఉన్న కొద్దిపాటి చిన్న జీవితాన్ని మరేవో అర్థంలేని పనులకు, బాహ్యాడంబరాలకు, దంభాలకు, స్వార్థప్రయోజనాలకు దుబారా చేసుకుని, దుర్వినియోగపరచుకుని చివరకు జీవితం అయిపోయిందని పశ్చాతాపపడితే- తిరిగి వచ్చేందుకు అదేమీ పక్క వూరి ప్రయాణం కాదు.
ఒక వ్యవసాయదారుడి ఇంటికెళ్లినప్పుడు కొడవలి, నాగలిలాంటి పొలం పనిముట్లు, ఆవులు, ఎద్దులు, తట్టలు, బుట్టలు, తాళ్లు, కుడితి, పొట్టు, ఎరువులు, ధాన్యం బస్తాలు... ఇల్లుమొత్తం వ్యవసాయానికి సంబంధించిన వస్తువులతో నిండిపోయి ఉంటుంది. అలాగే ఏ రంగానికి చెందిన వ్యక్తుల ఇల్లు వారి ఆసక్తులకు, లేదా వృత్తులకు సంబంధించిన వస్తువులతో నిండి ఉంటుంది. మరి ఆధ్యాత్మికపరుల ఇల్లు? కృష్ణాజినం, జపమాల, ఆధ్యాత్మిక గ్రంథాలు, వ్యాసపీఠం, గంధ కర్పూరపు సుగంధ పరిమళాలు, అఖండ దీపం... ఇవి ఇవేనా? ఇవే కాదు. జీవితమే ప్రయోగశాలగా మార్చుకోదలచుకున్నప్పుడు కేవలం ఇవే, ఇవి మాత్రమే ప్రయోగశాలా, ప్రయోగ పరికరాలూ కాజాలవు. జీవితం అనేది ఓ గదో, ఓ వస్తువో, ఓ పరికరమో కాదు... ప్రయోగానికి సంబంధించిన వస్తువులతో నింపేందుకు. గడిచే ప్రతి క్షణం జీవితం. నడిచే ప్రతి అడుగూ జీవితం. పీల్చే ప్రతి శ్వాసా జీవితం. మరి, ప్రతి క్షణాన్నీ భగవత్ స్పృహతో గడపాలి. ప్రతి అడుగునూ సాధనా దృష్టితో నడవాలి. ప్రతి ఆలోచనా పవిత్రతతో నింపాలి. సాధకుడి దైనందిన జీవితంలోని ప్రతి క్షణం బ్రాహ్మీముహూర్తమే కావాలి. ప్రతి శ్వాసా సాధనగా మలచుకోవాలి. ఎలా? ఏ క్షణమూ భగవత్ స్మృతినుంచి వైదొలగకపోవటమే. అప్పుడు మనం తీస్తున్న ప్రతి శ్వాసా ప్రాణాయామంగా ఉందా లేదా, అజపా జపం చేస్తోంది కదా అనే ఆలోచనతో వస్తుంది. మనంవేసే ప్రతి గుటకా కేశవ నామంతో లోపలికి వెళ్తోందా లేదా అనే గమనింపు ఉంటుంది. తినే ప్రతి ముద్దా వైశ్వానర ప్రీతిగా వెళ్తోందా లేదా అనే ఆరాతో తింటాం. వేసే ప్రతి అడుగూ మంత్రసహితంగా ఉండాలనే శ్రద్ధ కలుగుతుంది. ప్రతి ఆలోచనా, ప్రతి మాటా ఆధ్యాత్మిక పరిమళాలతో ఉంది కదా అని నిర్ధారించుకున్నాకే బయటికి వస్తుంది. రాబోయే క్షణాన్ని 'ఆయన' స్పృహాసహితంగా ఉందా లేదా అని పరిశీలించుకున్నాకే భయభక్తులతో గౌరవంగా ఆహ్వానిస్తాం. ఆ స్థాయిలోనే వినియోగిస్తాం.
పరీక్షల సమయంలో మనకిచ్చిన రెండు లేదా మూడు గంటల సమయాన్ని కేవలం... కేవలం పరీక్ష రాసేందుకే వినియోగిస్తాం. పొరపాటున కూడా మరో ఆలోచనకు తావివ్వం. చివరి క్షణం వరకు అత్యంత అపురూపంగా అప్రమత్తంగా వాడుకుంటాం. జీవితం కూడా అంతే. ముక్తికోసం, స్వస్థానాన్ని చేరుకోవడంకోసం లభించిన జీవితాన్ని, జీవితకాలాన్ని కేవలం అందుకోసమే వాడుకోవాలి. తెలియని అమాయకత్వంతో వృథా చేసుకున్న కాలాన్ని కూడా ఇప్పటి ద్విగుణీకృత ప్రయత్నంతో ప్రయోగంతో భర్తీ చేసుకోవాలి. అందుకే జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుందాం. మనం తలపెట్టిన ఉత్కృష్ట, బృహత్తర కార్యాన్ని ఏ విధంగా ఎవరి ద్వారా, ఎలా త్వరితగతిన పూరించగలమో ప్రయోగాలు చేద్దాం. వేదాలు, శాస్త్రాలు, వీలైనంత పరమార్థ వాఞ్మయం అధ్యయనం చేద్దాం. గురుసేవచేసి, వారి శిక్షణలో జ్ఞానాన్ని పొందుదాం. మహాపురుషుల దర్శనంచేసి, తేనెటీగలా అందరి సంసేవనంలో ఒక్కో సుధాబిందువును సేకరించి హృదయమనే తేనెపట్టును నింపుకొందాం. తేనె మరి... ఎవరైనా పట్టుకుపోతారా, పిండుకుపోతారా? పోనీ. తేనె ఉన్నది అందుకే. ఈ జ్ఞాన మకరందం ఎవరు సేవించినా, ఎందరికి ధారపోసినా తరగనిది. తరిగేకొద్దీ పెరిగేది, రుచి ఇనుమడించేది.
- చక్కిలం విజయలక్ష్మి