ᐅతృప్తి
'తృప్తి' అనే పదం చాలా చిత్రమైనది. అది ఒకరిని భయపెడుతుంది. మరొకరిని ఆనందపెడుతుంది. ఇంకొకరిని సందిగ్ధావస్థలో పడవేస్తుంది.
'నాకిది చాలు. ఇక తృప్తి పడాలి' అని ఎవరైనా అంటున్నారంటే అంతకన్న ముందుకువెళ్ళే సాహసం చేయటం లేదని కొందరి భావన. పురోభివృద్ధి కోసం సాగే జీవన గమనంలో అతడక్కడే ఆగిపోదలచుకున్నాడు, అది అతనికెంతో ప్రగతి నిరోధకమైనది కదా- అని వారికి అనిపిస్తుంది.
ఒక విద్యార్థి పైచదువులకు వెడుతున్నప్పుడు తన ప్రయత్నాలతో తృప్తి పడకూడదు. ఒక ఉద్యోగి పోటీ పరీక్షలకు కూర్చునేటప్పుడు తన కృషితో సంతుష్టి చెందకూడదు. ఒక ఆటగాడు పందెంలో పాల్గొనేటప్పుడు తన శిక్షణతో సంతృప్తి చెందకూడదు. లేకపోతే వారికి విజయం కష్టసాధ్యం. ఇక్కడ వారి ప్రగతిపథానికి తృప్తి అనేది అవరోధమవుతుంది కనుక అవిరళ కృషి అవసరం!
ధన సంపాదనలో ఎవరికైనా తృప్తి అన్నది ఉండాలి. లభించినదానితో సంతుష్టి చెందకపోతే అది దురాశకు దారితీస్తుంది. దురాశ ఈర్ష్యా అసూయలకు తావిస్తుంది. ఆపైన మానసిక వ్యధ కలుగుతుంది. జీవితం అశాంతమయమవుతుంది.
ఒక కుటుంబానికొక ఇల్లు చాలు. ఎందుకైనా మంచిదని మరో ఇల్లు సమకూర్చుకుంటే తన తదనంతరం పిల్లలకు, మనవలకు పనికివస్తుందని మరో ఇల్లు కట్టాలనిపిస్తుంది. ఇలాంటి కోరికలకిక అంతం ఉండదు. దురాశ వల్లనే లోకంలో అనేక ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి. కనుక సమాజ శ్రేయం దృష్ట్యా వ్యక్తిపరమైన ఆర్థిక విషయాల్లో తృప్తిపడటం అవసరం!
ఒక పారిశ్రామికవేత్త తన సంస్థకు లభించిన సంపదతో తృప్తి పడాలా వద్దా అని తాను సందిగ్ధావస్థలో పడవచ్చు. అతనికిక్కడ స్వప్రయోజనంకన్న సంస్థ ప్రగతి ప్రధానం. తన కింద పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమంకోసం, తన సంస్థ మదుపరుల ఉన్నతికోసం ఉన్న మూలసంపదతో సంతృప్తిపడితే కాలగతిలో అది కరిగిపోవచ్చు. అందుకని తన సంస్థను విస్తరించి వారందరి ప్రగతికోసం అతను పాటుపడక తప్పదు. తన సంస్థకున్నదానితో సంతృప్తిపడటం సమాజ ఆర్థిక పురోగతికి అవరోధం కనుక, అతను తృప్తి పడకపోవడం సబబు, న్యాయం.
మనిషి భగవదారాధన విషయంలోనూ తృప్తి చెందకూడదు. భక్తిని పెంపొందించుకునే ప్రయత్నాలతో సంతుష్టినొందకూడదు. భాగవత గాథలు వింటే చాలదు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే చాలదు. కాసేపు భగవన్నామ సంకీర్తన చేస్తే సరిపోదు. సత్సంగాల్లో పాల్గొంటే సరిపోదు. ఆయన మూర్తికి పాదసేవనం చేయాలి. పుష్పాలతో పూజించి సరిపుచ్చుకోరాదు. హృదయపూర్వకంగా నమస్సులు అర్పించాలి. పదేపదే ఆయన నామాల్ని జపిస్తే చాలదు. ఒక ప్రాణస్నేహితుడితో సంభాషించినట్లు ఆయన్ని ఉద్దేశించి ప్రియాలాపాలాడాలి. ఒళ్ళు పులకలెత్తాలి. కన్నీరు పొంగిరావాలి. ఇలా సంపూర్ణంగా ఆత్మనివేదన చేసుకోగలగాలి. ఆ సర్వాంతర్యామిని తనివితీరని తృప్తితో అనుక్షణం ఆరాధించుకోవాలి. ఈ మానవజన్మకిదే పరమావధిగా భావించాలి.
- తటవర్తి రామచంద్రరావు