ᐅరాసలీల




రాసలీల 

కృష్ణతత్వం అర్థం చేసుకోవడం సామాన్యులకు కష్టమే. స్త్రీలోలుడని, గోపికాలోలుడని పైకి అనిపించే ఆ తత్వంలో అంతులేని వేదాంతం దాగి ఉంది. అందుకే దాన్ని అర్థంచేసుకోవడానికి పరిణతి కావాలి. సామాన్యులకు అర్థంకాని ఎన్నో విషయాల్లో ఇదీ ఒకటి. 'భగవానుడు ఒక్కడే పురుషుడు. అతడు సత్యస్వరూపుడు. స్వయంజ్యోతి, ఆద్యుడు, నిత్యుడు, అంతంలేనివాడు, నిర్మలుడు, పూర్ణుడు, అద్వయుడు, అమృతుడు' అని భాగవతం చెబుతోంది. తక్కిన జీవజాలమంతా స్త్రీ స్వరూపమే. ప్రకృతి, పురుషులన్నా వీరే (జీవజాలం, భగవంతుడు). జీవులకు స్త్రీత్వం ఆపాదించడం ఎందుకంటే... ప్రేమకు ప్రతిరూపం స్త్రీతత్వం. పురుషునిలోని ఔన్నత్యం, స్త్రీసహజమైన ప్రేమతత్వం. ఈ రెండింటి సమాహారమే సృష్టికి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. అందరూ సంపూర్ణులు కావాలని, ఆ సంపూర్ణత్వ సాధనకు ఆ భగవంతునిలో ఐక్యం కావాలనేది రాసలీలలోని ఆంతర్యం. స్త్రీస్వరూపంలో ఉన్న సున్నితమైన, ప్రేమమయ మాధురీభావాలను అందుకున్నకొలదీ, అందుకోవాలనే ఉంటుంది ఎంతటివారికైనా. సాక్షాత్ ఆ పరమపురుషునికి సైతం అలాగే అనిపిస్తుంది. అందుకే ఆమె (స్త్రీస్వరూపమైన జీవాత్మ)లోని సున్నితత్వం అనుభవించడానికి స్త్రీ సహవాసాన్నే కోరుకున్నాడు. స్త్రీరూపమైన జీవాత్మకు ప్రతిరూపమే గోపికలు. పరమాత్మ (పురుషుడు) చుట్టూ, జీవాత్మ (గోపికలు) పరిభ్రమించడం ఆయనలో ఐక్యం కావడానికే తప్ప- అల్పార్థంలో, అపార్థంలో స్త్రీలోలత్వం అనడం సబబు కాదు. లోతుగా ఆలోచిస్తే కృష్ణా (భగవద)ర్పణ తత్వమని అర్థమవుతుంది- పరిణతి చెందినవారికి.
సామాన్యుడినుంచి, మాన్యుడిదాకా లోకంలో అందరూ ఒకటి దొరికితే మరొకటి కావాలని కోరుకుంటారు. అలా తానే సర్వోత్తముణ్ని కావాలన్నంత వరకు కోరుకుంటూనే ఉంటారు. కాని, భగవంతునికంటే సర్వోత్తముడు మరెవరూ లేరు. ఆ విషయం తెలుసుకున్న జీవుడి ఆశలు తీరకపోతే, మారిపోయి. తానే అతడైపోవాలని అనుకుంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అహంకారాన్ని, అసత్యాన్ని, మోహాన్ని... ఒకటొకటిగా అన్నీ విడిచిపెట్టిననాడే అతడి దర్శనం (సాక్షాత్కారం) కలుగుతుంది. గోపికా వస్త్రాపహరణం దీనికి ప్రతీక. వలువలమీద, విలువలమీద, ఇహంమీద, దేహంమీద- మోహం, మమకారం వదులుకోవాలి. అదే విషయాన్ని రెండుచేతులూ జోడించి శరణు వేడుకొమ్మని చెబుతాడు శ్రీకృష్ణుడు. 'రెండు చేతుల జోడింపు' అన్న ఆ మాటలు విన్న తరవాత గోపకాంతలకు జ్ఞానోదయమైంది- జీవాత్మ, పరమాత్మల సమాగమం జరగాలని'.

ఈ లోకంలో ఎవరెవరో, ఎవరెవరికో, దేనిదేనికో, వేటివేటికో యజమానులు, హక్కుదారులు అనుకుంటూ ఉంటారు. నిజానికి వారెవరూ, వాటిలో వేటికీ హక్కుదారులు కాదు. యజమానులూ కాదు. ఎందుకంటే... అది నిన్న ఒకరిది. నేడు మరొకరిది. రేపు ఇంకెవరిదో! అందరికీ, అంతటికీ యజమాని 'నాశరహితుడు, శాశ్వతుడు' అయిన ఆ భగవంతుడొక్కడే! అంతా అతడే అయినప్పుడు చేసేదేముంది- అందరూ ఆయనను అందుకోవడానికి ప్రయత్నించడమే. అలా అందుకోవడానికే అన్నీ విడిచి ఆద్యంత (పుట్టకమునుపు, మరణించిన తరవాతి) రూపంలో తేలికైన అంతరంగాలతో 'శరణు' అన్నారు. అప్పుడు వారికి దర్శనమిచ్చాడు. సాహచర్యం లభించింది. అదే నిశ్చలభక్తి. ఆ భక్తి తత్పరత ప్రాప్తించినప్పుడు జీవుడు ఇక దేన్నీ కోరుకోడు. దేనిగురించీ దుఃఖించడు. విషయ భోగాల మీద ఆసక్తి నశించినవాడవుతాడు. అదే మోహనాశం. ఆ స్థితే రాధామాధవ తత్వం. అంతే తప్ప- గోపిక అంటే... స్త్రీరూపం కాదు. రాసక్రీడ అంటే పిల్లాట అంతకంటే కాదు. ఆ స్థితికి చేరిన గోపికలతో, శ్రీకృష్ణభగవానుడు స్వయంగా 'ఓ గోపికలారా! నా కోసం కఠినమైన గృహస్థాశ్రమ సంకెళ్లను తెంచుకుని లౌకిక ధర్మాలనన్నింటినీ విసర్జించి నన్ను భజిస్తున్నారు. అందువల్ల నేను మీకు ఆత్మస్వరూపంగా ఉంటాను' అని వారితో రాసకేళిలో మునిగిపోయాడని చెబుతారు..

రాసకేళి అంటే సంపూర్ణమైన ఆనందం. సర్వేశ్వరుడితో కూడి సంపూర్ణమైన తన్మయత్వంతో ఉన్నవారే ఆ అపూర్వమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ సంపూర్ణత్వపు ఆనందంతో ఆడి, పాడి అణువణువునా ఆనందానుభూతిని అనుభవిస్తూ ఆ అంతర్యామిలో జీవాత్మ ఐక్యం చెందడమే రాసలీలలోని ఆంతర్యం.

- అయ్యగారి శ్రీనివాసరావు