ᐅఆనందమార్గం




ఆనందమార్గం 

పరమాత్మ అంటే ఎవరనుకొన్నారు? ప్రేమమయుడు. దయార్ద్రత గలవాడు. సంరక్షించేవాడు. 'కన్నా, కష్టాలు పడుతున్నావా? నేనున్నాను కదరా!' అని వాత్సల్యంతో పలకరించేవాడు. కన్నతండ్రికన్నా మిన్నగా మనల్నందరినీ పాలించి లాలించేవాడు. ఆయనను స్మరించేవాళ్లు స్మరిస్తున్నారు. విస్మరించేవాళ్లు విస్మరిస్తున్నారు. ఈ దేహాన్ని విజ్ఞానాన్ని బ్రహ్మోపదేశమిచ్చి పెంచి పెద్దచేసిన తండ్రినే మరువగలుగుతున్న మానవులం మనం! కనపడే కన్నవారినే కలతలకు గురిచేసేవారికి కనపడని దైవంలోని ప్రేమ వాత్సల్యాలు అర్థమవుతాయా?
'నేనున్నాను కదా! నీకు చేతకాని నీవు నిర్వహించలేని అన్ని కర్మలను విడిచిపెట్టు' అంటూ ఎంతో ప్రేమతో మనిషికి వెసులుబాటు నిచ్చాడు. 'నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయి. నన్ను శరణుకోరు. నేను నిన్ను సర్వపాపాలనుంచీ కష్టాలనుంచీ కాపాడి నీలోని శోకాన్ని దూరం చేస్తాను'' అని మోక్ష సన్యాస యోగంలో దైవం అభయం ఇచ్చాడు. ఆ దేవదేవునికి మన గురించి ఇంత పరితాపం, మనపై ఇంత ఆర్ద్రత ఎందుకు? సృష్టించిన దైవానికి మనల్ని పంచభూతాలకు వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. ఆ పరమాత్మ ఆకారుడో నిరాకారుడో ఉన్నాడో లేడో అనే మీమాంసతో తర్కం చేస్తూ కాలయాపన చేయడం మనిషికి తగనిదే! అది భక్తియోగం కాదు. చైతన్యవంతమైన, ఊహకు అందని నిర్వచించలేని భగవంతుణ్ని తర్కానికి గురిచేయడంకన్నా ఆ శక్తిని ఆరాధించి శరణుకోరడం ఉత్కృష్టమైన సాధన!

కోట్లానుకోట్ల సూర్యులను, అంతులేని పాలపుంతలను, జగత్తులనూ గతితప్పక నియంత్రించే ఆ దైవానికి నీపై నాపై మనందరిపై ప్రేమ, మన గురించి తపనపడే సమయం ఉందంటే ఆ దైవం సదా అప్రమత్తుడై మనల్ని రక్షిస్తున్నాడన్నమాటే! మంచివాళ్లను (సురులను) కాపాడటానికి తాబేలుగా అవతరించి మేరుపర్వతాన్ని తన వీపుపై మోశాడు. వసుధపై వసిస్తున్న జీవరాశిని కాపాడటానికి సూకరమై జన్మించి హిరణ్యాక్షుణ్ని వధించాడు. అలా తన దశావతారాల్లోనూ జీవులను కాపాడటానికే అవతరించాడు. మనల్ని ఇలా వదిలి అలా వైకుంఠపురంలోని సౌధాల్లో నివసిస్తూ బ్రహ్మానందంలో తేలాడే పరంజ్యోతి కానేకాదు. ఆయన నైజం కన్నతండ్రిలాంటిదే. తండ్రినుంచి అపారమైన ఆ ప్రేమ పొందగలిగినవాడు బ్రహ్మతో సమమై పోతాడు. ఇదే దైవంపట్ల మనం మెలగాల్సిన రీతి. ఏదో ఆశించి ఆశ్రయించకూడదు. పదవిని కామ్యంగా చేసుకొని సేవకునిలా నటించకూడదు. మనం స్వార్థంతో పూజిస్తున్నామో, నిస్వార్థంతో సేవిస్తున్నామో ఆయన గ్రహించగలడు. దైవం ముందు నటించి మెప్పించగలమా? పరమాత్మను నమ్మాలి. ఎంతటి మహత్తర శక్తిమంతుడో గ్రహించాలి. ఆ శక్తిముందు మానవులం చీమలం!

పరమాత్మ అంటే ఎవరు? లోకాలను సృష్టించినవాడు. దేవతలకు సైతం ఆయువు! జాతవేదుడు! ముక్తికి ఆ శక్తే ద్వారం. జీవరాశులన్నింటికీ ఆయుస్సూ, ఆహారం, బలమూ ఆ పరాత్పరుడే. కంటికి కనపడని ఆ దైవస్వరూపుని ఊహించలేకున్నాం కనుక ఆ దైవంపై మనసు కేంద్రీకరించడం మన ఇష్టాయిష్టాలు సమయాసమయాలపై ఆధారపడి జీవిస్తున్నాం. ఇలాంటి దుస్థితికి దూరం కావాలంటే భక్తి దయ ఆర్ద్రత కలిగి జీవించాలి. శ్రీపతికి హృదయం సమర్పించాలి. కలలోని కష్టాలు సుఖాలు ఎలాంటివో ఈ లోకం కూడా అలాంటిదనే గ్రహించాలి. కలలనుంచి తేరుకున్నామంటే నిజం సాకారమవుతుంది. అలాగే లోకమాయనుంచి తేరుకునే ప్రయత్నం చేసి పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలగాలి. భగవంతునిపై రక్తితో జీవించాలి. ఆ దివ్యతేజస్సును అనుభవంచేత మాత్రమే తెలుసుకోగలం. ఆనందస్వరూపమది. ఆ స్వరూపాన్ని సాకారం చేసుకోవడం కోసం అడవులకు వెళ్లనవసరంలేదు. ప్రాణాయామం చేస్తూ శ్వాసను బంధించాల్సిన అవసరం లేదు. అవును... ప్రాణుల అన్ని రూపాలూ భగవంతుని ప్రతిరూపాలే. అన్నిదిక్కుల్లో ఆ తేజస్సు నిండి ఉంది. మనసా వాచా నమ్మాలి. మనల్ని సదా గమనిస్తూ ఉన్నాడా పరమేష్ఠి. అనుభవింపదగినవాడై అనుభవిస్తున్నవాడై స్పష్టాస్పష్ట రూపంతో మన మధ్యే ఉన్నాడు. ఏ కోరికా ఏ లాభసాటి ఆలోచనా లేకుండా- 'అవునా! ఉన్నావా' అంటూ ఆర్ద్రతతో భక్తితో దయతో తడిమే ప్రయత్నం చేయాలి. తప్పక ఎక్కడో ఎప్పుడో ఒక అదృష్ట సమయంలో మనం సృశించగలం. ఒకసారి సృశించగలిగామా... మన ఆత్మ ఆ పరమాత్మతో అనుసంధానమవుతుంది. దారి, ద్వారం కనిపిస్తుంది. ఆ దారే మోక్షానికి చేరుస్తుంది. ఆ ద్వారమే వైకుంఠద్వారం. అదే ఆనందయోగం!

- అప్పరుసు రమాకాంతరావు