ᐅదైవత్వం




దైవత్వం 

అందరి ప్రేమా పొందేవాడు. అందరిలో గౌరవం సంపాదించేవాడు. కష్టకాలంలో ఆదుకునేవాడు, చింతలను చెదరగొట్టి చిత్తశాంతిని ప్రసాదించే వాడిగా భగవంతుడికి నిర్వచనాలున్నాయి.
మనిషి ప్రపంచ మాయలో చిక్కుకుని, అరిషడ్వర్గాల పడగనీడల్లో ఉన్నంతసేపూ దానవ ప్రవృత్తినే కలిగి ఉంటాడు. అసూయ, స్వార్థం, క్రూరత్వం వంటి రాక్షస గుణాలు అతను మనసును వస్త్రాల్లా కప్పి ఉంచుతాయి. వాటిని పట్టువస్త్రాలుగా భావిస్తూ ఆనందిస్తాడు మనిషిలోని దానవుడు.

ఏదో ఎదురుదెబ్బ, తలకిందులైన పథకం- మనిషిని, అతని బుద్ధిని స్తంభింపజేస్తాయి. ఆలోచన అంతర్ముఖమవుతుంది. వివేకరేకలు వెలుగు కిరణాలవుతాయి. దానవత్వం నుంచి మానవత్వంలోకి మారాలనే ఆకాంక్ష కలుగుతుంది. అదే శుభ ఘడియ! ఆ సద్భావనను వదలకుండా గట్టిగా పట్టి ఉంచాలి. కాలప్రవాహంలో దొరికిన బంగారు చేపలాంటిది ఆ భావన.

మానవత్వం పట్ల మక్కువ కలిగిన తరవాత, మనిషి సత్సంగం కోసం వెంపర్లాడతాడు. తనలో తలెత్తే అనేక ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు వెతుకుతుంటాడు. తపన ఎడారిలో పగటి ప్రయాణం లాంటిది. జ్ఞానతృష్ణ మొదలయ్యాక అది ఓ పట్టాన తీరదు. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలియాల్సింది ఉందనే భావన చెదరదు.

ఆధ్యాత్మికతలో తడిసి ముద్దయ్యాక, ఆత్మశక్తి పెరుగుతుంది. సూర్యరశ్మి చీకట్లను చెదరగొట్టినట్లు ఆత్మశక్తి మనలోని మానవత్వాన్ని అభివృద్ధి చేస్తూ, మరోపక్క అజ్ఞానం నుంచి విముక్తి కలిగిస్తుంది. విరక్తి భావం పెంచుతుంది. పరమాత్మ తప్ప రక్తి కలిగించగలవాడెవ్వడూ లేడు. కాబట్టి, ఆత్మ మన బుద్ధినీ మనసునీ తన వశంలోకి తెచ్చుకుని, పరమాత్మ పట్ల అనురక్తి కలిగిస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల విముఖత్వం కలిగిస్తుంది. అశాశ్వతమైనవేవో స్పష్టంగా గుర్తించి జాగ్రత్తపడుతుంది. సునాయాసంగా ఒక్కో ముల్లునూ తీసిపారేసినట్లు మనలో ఉన్న దుర్గుణాలను త్యజించివేస్తుంది. అందువల్ల మనసు ఉదాత్తమవుతుంది. బుద్ధి వక్రతను వదిలి సక్రమత్వాన్ని పొందుతుంది. ఈ పరివర్తన జరిగాక, మనిషిలో ఎంతో మార్పు కనిపిస్తుంది. ఆ మనిషి ఈ మనిషి కాడనిపిస్తుంది. ఒక అలౌకిక ఆనందముద్ర ముఖంమీద స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మాటలు తేనెలొలుకుతాయి. ప్రతి చర్యలో ప్రేమ ప్రవహిస్తుంది. అప్పుడు మనిషిస్థాయి పెరిగి మనీషి అవుతాడు.

మనీషి, దైవత్వస్థితికి సమీపంలో ఉంటాడు. అతని ఆధ్యాత్మికత ఆచరణ రూపంలో ఉంటుంది. ఎలాంటి ఆధ్యాత్మిక బోధలూ చెయ్యడు. 'నా జీవితమే నా సందేశం' అన్నంత నిజాయతీగా ప్రతిక్షణం జీవిస్తాడు.

'నేను ఆత్మను... నాకు మరణం లేదు' అనే స్థితికి చేరుకోగానే ఆ వ్యక్తి దైవత్వాన్ని సాధిస్తాడు. దైవత్వం అంటే దివ్యదేహం, అంతే తప్ప- మహిమలు కావు.

దైవత్వమంటే- అందర్నీ సమంగా ప్రేమించగలగటం.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్