ᐅనీవెవరు




నీవెవరు? 

ఈ చరాచర విశ్వంలో ఎంతోమంది జన్మిస్తూ ఉంటారు. జీవిక కొనసాగిస్తుంటారు. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణానికి మెరుగులు దిద్దుకోవడంలోనే నిజమైన ప్రతిభ దాగి ఉంది. సంగీత, సాహిత్యాల లాంటి లలితకళల్లో ప్రావీణ్యం సాధించేవారు కొందరైతే, కొంతమంది క్రీడల్లో నిష్ణాతులుగా పేరొందుతారు. కొంతమంది వృత్తివిద్యల్లో రాణిస్తూ ఉంటారు. అందుకే, ఈ చరాచర జగంలో నీవెవరు అని ప్రశ్నించినప్పుడు ప్రతి మానవుడూ తనకంటూ సొంతమైన విభిన్న దీమసాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించేట్టుగా ఉండాలి.
ఏ మనిషైనా తనకంటూ ఒక విశిష్టతనీ, ప్రత్యేకతనీ కలిగి ఉండటం ఎలా సాధ్యం? వివేచనతో దాన్ని సుసాధ్యం చేసుకునేందుకు సహజసిద్ధంగా మనకున్న అభిరుచికి మెరుగులు దిద్దుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి. నిజానికి ఈ అభిరుచిని కలిగి ఉండటం, దాన్ని ద్విగుణీకృతం చేసుకోవటం మనిషికి ఆత్మవేదం లాంటిది. అది అతని జీవన సంగీతానికి వన్నెలద్దే మధుర నాదం లాంటిది. తాను ఒక రంగంలో దేదీప్యమానంగా రాణించగలిగిన ప్రతిభను నిగూఢంగా కలిగి ఉండి, తనకు రుచించని మరొక నిరాసక్తమైన రంగంలో ఉంటే ప్రయోజన సిద్ధి లేదు కదా? తాను ఆసక్తిని, అనురక్తిని కలిగి ఉన్న రంగంలో ప్రవేశించి అందరూ హర్షించేలా రాణించినప్పుడు అదే పల్లవించే సిసలైన హృదయానందం!

ఒక మనిషి ప్రత్యేకతనుబట్టి అతని ఆచూకీని చాటిచెప్పే కమనీయ గాథ ప్రచారంలో ఉంది.

పూర్వం మనదేశాన్ని పరిపాలించినవారిలో భోజరాజు సాహిత్య పోషణకు పెట్టింది పేరు. కాళిదాసు ఆయన ఆస్థాన కవి. ఇద్దరూ స్నేహితులని ప్రతీతి. ఒకసారి ఇద్దరికీ ఏదో సాహిత్య విషయమై వాదోపవాదాలు జరగటంతో రాజు మీద అలిగిన కాళిదాసు చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.

అదే సమయంలో, ఆ రాజ్యంలో ఒక బీదవాడు ఎలాగైనా రాజుగారిని మెప్పించి, ఆయన ఆశ్రయం సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడుతూ ఉండేవాడు. కవులనైతే రాజు బాగా గౌరవిస్తారని, ఎలాగైనా కవిత్వం చెప్పి ఆయన మెప్పు పొందాలని అతని బృహత్తర ప్రయత్నం. కష్టపడి ఒక శ్లోక పాదం రాశాడు.

'భోజనందేహి రాజేంద్రాఘృత సూప సమన్వితం'- ఇంతవరకే అతను రాయగలిగాడు. 'ఓ రాజా! పప్పు, నేతితో కూడిన భోజనం ప్రసాదించు' అని దీని అర్థం. శ్లోకంలో రెండో పాదం ఎంత ఆలోచించినా అతనికి స్ఫురించలేదు. అతనేమీ చేయి తిరిగిన కవి కాదు కదా... ఇలా ఉండగా రాజప్రాసాదాన్ని వీడిన మహాకవి కాళిదాసు ఆ బీదవాడి గ్రామానికే వెళ్లాడు. భగవంతుడు వరమిచ్చినట్టుగా భావించిన అతడు కాళిదాసు వేంచేసిన గృహానికి వెళ్ళి తాను రాసిన శ్లోకంలోని రెండో పాదం పూర్తి చెయ్యమని అభ్యర్థించాడు. వెంటనే కాళిదాసు 'శరశ్చంద్ర చంద్రికా ధవళం మహిషం దధీ' అంటూ అలవోకగా రెండో పాదాన్ని పూరించాడట. అంటే, 'శరత్కాలంలోని చంద్రుని వెన్నెల అంత తెల్లనైన గేదె పెరుగు కూడా ప్రసాదించు' అని దాని అర్థం. ఇంకేముంది, ఆ బీదవాడు ఈ శ్లోకం పట్టుకుని భోజరాజు సన్నిధికి వెళ్లాడు. తానొక కవినని మహారాజుకు చెప్పాడు. సాహితీ ప్రియుడైన భోజుడు అతణ్ని కవిత్వం చదవమన్నాడు. గ్రామవాసి చదివాడు. భోజరాజు గొప్ప కవేగాక కాళిదాసు కవిత్వాన్ని, అతని సాహితీ శైలిని, ఉపయోగించే సుందరమైన ఉపమానాల తియ్యందనాన్ని ఆమూలాగ్రం ఎరిగినవాడు. రెండో పాదం వినగానే ఆయనకు ఈ మనోహరమైన పాదం కాళిదాసు రాసిందేమోనని అనుమానం వచ్చింది. ఇది ఎవరు రాసిందో చెప్పమని గట్టిగా గద్దించాడు. దానికి ఆ బీదవాడు భయపడి, 'ప్రభూ! తొలి పాదం మాత్రమే నేను రాశాను... రెండో పాదం సాక్షాత్తు మహాకవి కాళిదాస విరచితమే' అని వెల్లడించాడు. భోజరాజు అతని ద్వారా కాళిదాసు ఆచూకీ తెలుసుకుని, మళ్లీ ఆస్థానానికి రప్పించుకున్నాడని, బీదవాడి నిజాయతీకి మెచ్చి అతనికి తగిన ధనాన్ని ఇచ్చి పంపాడని ఒక కథ.

సారాంశం ఏమిటంటే- తావినిబట్టి పూవు ఉనికి తెలిసినట్టే, ప్రత్యేక వ్యక్తిత్వ శోభితులు, విలక్షణ లక్షణ సమన్వితులు ఎక్కడ ఉన్నా గుర్తింపు పొందుతారు. జనవాహినిలో, సదా ప్రశంసల తరంగాల్లో తేలియాడుతూ ఉంటారు. తనకున్న అమేయ కవితా ప్రతిభ కారణంగానే రాజప్రాసాదంనుంచి యోజనాల దూరం వెళ్లిపోయినా కాళిదాసు ఆచూకీ దొరికింది. ఈ కథ అణువణువూ నిజం అయినా కాకపోయినా, సారాంశం మాత్రం అగణిత ప్రతిభాశాలి ఎంతదూరంలో ఉన్నా, తనదైన ఉనికినీ, మనికినీ కలిగి ఉంటాడని విశదపరుస్తుంది. 'నేనెవరు' అని తనలో తాను ప్రశ్నించుకుని తన మానసానికి ఆహ్లాదాన్నీ, ఆత్మతృప్తినీ ఇచ్చే క్షేత్రంలో ప్రవేశించి, మొక్కవోని కృషితో మనం అప్రతిహతంగా ముందుకు సాగాలి. అటువంటప్పుడు 'నీవెవరు' అని ఎవరు ప్రశ్నించినా సమాధానం దానంతట అదే వారికి లభ్యమవుతుంది. ఎందుకంటే, పరబ్రహ్మ సృజించి ఇచ్చిన సహజ గుణానికి మెరుగులద్ది, కృషీవలులమై, పరిపూర్ణ మనస్కులమై మనం పుణికి పుచ్చుకున్న నైపుణ్యం అద్దంలో ప్రతిబింబంలా కొట్టొచ్చినట్టు వారికి ద్యోతకమవుతుంది.

అందుకే నలుగురిలో ప్రత్యేకత ప్రకటించే వ్యక్తిత్వమే మనిషికి తిరుగులేని బలం! అదే అతణ్ని నలుగురిలో శిష్టునిగా, ఇష్టునిగా నిలిపే మధురమైన జీవన ఫలం!

- వెంకట్ గరికపాటి