ᐅజయీభవ... దిగ్విజయీ భవ




జయీభవ... దిగ్విజయీ భవ 

'దేవి' అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి- ఈ ముగ్గురూ! అందుకే నవరాత్రుల్లో ఈ ముగ్గురికీ మూడు రోజుల చొప్పున పూజలు జరుగుతాయి. విజయవంతంగా కార్యసిద్ధి కలగాలంటే విజయదుర్గను పూజించాలి. ఆయుధ పూజ వీరుల సంప్రదాయం. వృత్తులపై బతికేవారు వారి వారి సాధనాలనే ఆరాధిస్తారు. పిల్లలు ఒక సైన్యంలాగా బయలుదేరి 'జయాభి జయీభవ దిగ్విజయీభవ' అని ఉత్సాహంగా విల్లంబులు ప్రదర్శిస్తూ, పప్పుబెల్లాలతో సంబరం చేసుకోవడం ప్రాచీన సంప్రదాయం.
దుర్గాదేవి సింహాన్ని అధిష్ఠించింది. సింహం కామాన్ని సూచిస్తుంది. దున్న క్రోధానికి గుర్తు. మహిషుణ్ని దుర్గ సంహరిస్తుంది. దుర్గం అంటే కోట. 'దుర్గం'లో ఉండేది దుర్గ. శరీరం 'దుర్గం' కాగా, ప్రాణం 'దుర్గ'. లక్ష్మి గుడ్లగూబపై కూర్చుంటుంది. గుడ్లగూబ దివాంధం. ధనమదంతో కళ్లు మూసుకుపోయినవారిని అణచి ఉంచాలి. ధన అహంకారాన్ని మనం లోబరచుకొని జీవించాలి. సరస్వతి హంసపై అధివసించి ఉంటుంది. పాలనూ నీటినీ వేరుచేసే శక్తి హంసకున్నది. అటువంటి సత్‌జ్ఞానం సొంతమైతే చదువు సార్థకం అవుతుంది. ఇదీ, దేవీతత్వం.

శైవులు, వైష్ణవులు, శాక్తేయులు అందరూ అనాదిగా దుర్గను పూజిస్తున్నారు. రుగ్వేదంలో దేవీసూక్తం ఉంది. దుర్గను బ్రహ్మవాదినిగా, అగ్నివర్ణగా, తపోమయిగా పేర్కొంటారు. కేనోపనిషత్తులో దుర్గాదేవి 'ఉమ'గా దేవతలకు దర్శనమిస్తుంది. సరస్వతి, వరద, మహాదేవి, దుర్గ, విద్యాస్వరూపిణి, వైరోచని- అని ఈ దేవిని తైత్తిరీయారణ్యకం పేర్కొంటోంది. ఉపనిషత్తుల్లో అగ్ని ఏడు నాలుకలుగా ఈ దేవి నామాలుంటాయి. కాళీ, కరాళీ మొదలైన పేర్లు అవే! దేవీభాగవతం దుర్గాదేవిని మహిషాసుర మర్దనిగా వర్ణించింది. దేవతలు మహిషాసురుని పీడ వదిలించమని హరిహరుల్ని వేడుకున్నారు. హరిహరాది ప్రముఖ దైవశక్తుల సమ్మేళనంతో జనించిన దివ్యతేజోమూర్తి దుర్గ. అందుకే ఆమె శూలం, చక్రం, వజ్రాయుధం, కాలదండం మొదలైన సర్వాయుధాలూ ధరించింది. వివిధ పురాణాల్లో ఉన్న గాథలు దుర్గాదేవి దుష్ట సంహారిణి అని స్పష్టం చేస్తున్నాయి. లక్ష్మి అష్టోత్తర నామాల్లో 'దుర్గ' ఉంటుంది. లలితా, అంబికా, గౌరీ, భవానీ, అన్నపూర్ణా, వల్లీ అష్టోత్తరాల్లో 'దుర్గ' నామం వింటాం. వీటిని బట్టి సమస్త స్త్రీదేవతలనూ దుర్గానామం ప్రతిపాదిస్తున్నదని స్పష్టమవుతుంది.

పదిమంది రాక్షసులను సంహరించడానికి దేవి దశావతారాలెత్తింది. మహాకాళియై మధుకైటభుల్ని వధించింది. మహాలక్ష్మిగా మహిషుని చంపింది. సరస్వతి అవతారంలో శుంభ నిశుంభులను సంహరించింది. యోగమాయ రూపంలో కంస వధకు కారకురాలైంది. రక్తదంతికగా రక్తదంతుని హతం చేసింది. శాకాంబరియై మనల్ని కరవునుంచి కాపాడుతుందంటారు. దుర్గాదేవి అవతారం ఎత్తి దుర్మార్గుడైన దుర్గుని హతమార్చింది. మాతంగియై తపస్సుచే శ్యామలాంబను మెప్పించింది. భీమాదేవిగా భీమాసురుని వధించింది. భ్రమరాంబావతారంలో అరుణాసుర సంహారం గావించింది. దశ సంఖ్య గల రాక్షసులను ఇలా హరించిన దేవిని దశ రూపాల్లో పూజిస్తాం. అదే దశహరా- దసరా!

దేవి సర్వశక్తి స్వరూపిణి. అనేక సగుణ రూపాలతో, నామాలతో ఆరాధిస్తాం. కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ, శ్రీశైల భ్రమరాంబ, ఉజ్జయినీ మహాకాళి, విజయవాడ కనకదుర్గ- అన్నీ ఆ దేవి రూపాలే, నామాలే! దేవి క్షేత్రాల్లో విజయవాడ కనకదుర్గ ప్రసిద్ధమైంది. విష్ణుకుండిన మాధవవర్మ కుమారుడు వేగంగా రథాన్ని తోలాడు. ఆ రథం కింద పడి చింతచిగురు అమ్ముకునే పేదరాలి కుమారుడు మరణించాడు. ఆమె న్యాయం కోరింది. రాజు తన కుమారుడికి మరణశిక్ష విధించి, అమలుపరచాడు. రాజును మెచ్చుకుంటూ దుర్గ కనకవర్షం కురిపించింది. నాటినుంచి దుర్గ 'కనకదుర్గ' అయింది!

శ్రీరాముడు రావణ వధకు బయలుదేరాడు. 'ఎలా వధించాలి' అని మధనపడ్డాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. 'రామా! శ్రీదుర్గామాత ధర్మాన్ని రక్షిస్తుంది, ఆ దేవిని పూజించు, నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది!' అని సలహా ఇచ్చాడు. శ్రీరాముడు దుర్గార్చన చేసి విజయశ్రీని చేపట్టాడు. ధర్మరాజు అజ్ఞాతవాసానికి బయలుదేరాడు. రుషుల సలహాను పాటించి దుర్గాస్తుతి గావించాడు. విజయవంతంగా అజ్ఞాతవాసం పూర్తిగావించాడు.

కురుక్షేత్ర సమరం ఆరంభంలో అర్జునుడు ఆ దేవీస్తుతి గావించే విజయుడయ్యాడంటారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మ నమ్మినవారికి కొంగుబంగారమై సర్వ శుభాలను కలగజేస్తుందని 'తెనుగుల పుణ్యపేటి' అయిన పోతన విశ్వాసం.

'దుర్గమమైన' సంసార బాధలనుంచి రక్షించేది 'దుర్గ'. దుర్గామాత విజయధాత్రి. ఆ తల్లి నామ స్మరణచే అందరికీ సుఖశాంతులు కలగాలనేది ఒక సద్భావన. అందుకే దసరా పాటలు 'జయాభిజయీభవ దిగ్విజయీ భవ' అనే నినాదాలతో మారుమోగుతూ ఉంటాయి.

- పి. భారతి