ᐅబతుకమ్మ పండుగ
ఏ వేడుక జరుపుకొన్నా, ఎలాంటి పండుగలు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించుకున్నా- వాటి నేపథ్యం సమష్టితత్వం, సమైక్య జీవన విధానాలే. సామాజిక సరళిని అవి ఆవిష్కరింపజేస్తాయి. కాలానుగుణంగా సమాజం మెలగాల్సిన తీరుకు, వ్యక్తులు ఆచరించాల్సిన ఆధ్యాత్మిక పరంపరకు మన పండుగలు దోహదపడుతున్నాయి. ఈ సంవిధానంలోనివే ఆశ్వయుజ మాసంతో ప్రారంభమయ్యే దసరా నవరాత్రులు. శరదృతువులో వాతావరణంలో కలిగే మార్పులవల్ల రోగకారక పరిస్థితులు నెలకొని ఉంటాయి. శక్తి ఆరాధన పేరిట, ఈ తరుణంలో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉంటే ఎలాంటి రోగాలూ దరిచేరవని చెప్పడానికే నవరాత్రి వేడుకల్ని నిర్వహించుకుంటున్నాం. శిష్ట సంప్రదాయంలో ఉపాసనారీతిలో మంత్రపూర్వకంగా నవరాత్రుల్ని జరుపుకొంటారు. జానపదులు ఆటపాటల సమన్వితంగా ఈ వేడుకల్ని కొనసాగిస్తారు. అమ్మతల్లిని ప్రకృతి స్వరూపిణిగా పూలతో పేర్చి 'బతుకమ్మ'గా ఆరాధిస్తారు.
తెలంగాణ ప్రాంతంలో జానపద సంప్రదాయంలో జరుపుకొనే నవరాత్రి సంబరాల్లో బతుకమ్మ పండుగ ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు ఊరూరా బతుకమ్మ సందడి చేస్తుంది. ఓ పళ్లెంలో గుమ్మడిపువ్వులు పరచి వాటిపై తంగేడు, గునుగు, రుద్రాక్ష, బీర, గన్నేరు, సొర, గోరింట వంటి పుష్పాల్ని క్రమపద్ధతిలో అమర్చి ఆ పూలరాశిపై తమలపాకులో పసుపు గౌరమ్మను ఉంచుతారు. పుష్పసౌందర్యంతో శోభిల్లే ఈ సముదాయాన్ని బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూలమ్మ ఆకృతి దాల్చిన ప్రకృతి రూపధారి బతుకమ్మను పసుపు కుంకుమలతో పూజిస్తారు. బతుకమ్మ చుట్టూ మహిళలు తిరుగుతూ సామూహికంగా గీతాల్ని ఆలపిస్తారు. ఆటపాటల అనంతరం ప్రతిరోజూ బతుకమ్మను జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.
జానపదుల ఇలవేలుపు అయిన బతుకమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ. బతుకమ్మ సంబరానికి, నవరాత్రి వేడుకలకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పే ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయింది. సొమ్మసిల్లింది. లోకోద్ధరణకు అవతరించిన దుర్గమ్మకు స్త్రీలు సేదతీర్చి, తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి సేవలు చేసి పాటలు పాడారు. తొమ్మిదో రోజుకు అమ్మకు అలసట తీరింది. మహిషుణ్ని సంహరించి, కర్తవ్యాన్ని నిర్వహించింది. లోకేశ్వరిగా దుర్గమ్మ జనులకు కొత్త జీవితాన్ని, బతుకును ప్రసాదించింది. బతుకునిచ్చిన అమ్మ కాబట్టి గ్రామీణులు ఆమెను బతుకమ్మగా పిలుచుకున్నారు. ఏటేటా పూల పులకరింతల పొదరిళ్లలోకి ఆమెను ఆహ్వానించి ఆరాధించుకుంటున్నారు.
దక్షప్రజాపతి వల్ల అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతైతే, శివుడు ఆగ్రహోదగ్రుడై దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. యజ్ఞగుండంలో పడి భస్మీపటలమైన సతీదేవికి ప్రతీకగా పసుపు గౌరమ్మను సృష్టించారు. ఆమె బతికి, అందరికీ బతుకునిచ్చే తల్లి కాబట్టి, సతీదేవే బతుకమ్మ అయ్యిందనేది మరో కథ. చోళరాజు ధర్మాంగుడు, సత్యవతి దంపతులకు కారణజన్మురాలై అవతరించిన శ్రీ మహాలక్ష్మినే బతుకమ్మగా వ్యవహరిస్తారనే అంశం కూడా పురాణాల్లో ఉంది. బతుకమ్మ గ్రామ దేవత కాదు. తనను నమ్మి కొలిచిన వారి పక్షాన, దనుజులపై దుర్గమ్మగా పోరాడి గెలిచిన సంగ్రామ దేవత. 'ప్రకృతిని పూజించండి... పరిరక్షించండి... ప్రేమించండి' అన్న ఆత్మీయ సందేశం 'బతుకమ్మ' మనకు అందిస్తోంది.
- డాక్టర్ కావూరి రాజేశ్‌పటేల్