ᐅపండుగల పర్వం




పండుగల పర్వం 

కాలం ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం స్త్రీ పురుష రూపాత్మకం. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం వరకుగల కాలం స్త్రీ రూపాత్మకం. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఆశ్వయుజ మాసంలో వైశిష్ట్యం.
ఆశ్వయుజం శరత్కాలంలో వస్తుంది. వర్షాలు తగ్గి ప్రకృతికాంత కొత్తశోభను సంతరించుకునే కాలం. పుచ్చపువ్వులా వెన్నెలకాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. 'ఆకాశలక్ష్మి చుక్కలనే దండల్ని ఆకాశగంగలో కడగడానికి సిద్థంచేసిన కుంకుడుకాయ నురుగు తెప్పల్లా తెల్లగా ఉన్నాయి శరత్కాల మేఘాలు' అంటారు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో. సూర్యుడు దక్షిణాభిముఖుడవుతాడు. సూర్యుడు శక్తికారకుడైతే, చంద్రుడు మనఃకారకుడు.

శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజ పాడ్యమినుంచి తొమ్మిదిరోజుల పాటు దేవిని పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలను వేడుకగా నిర్వహిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రామలీలా ఉత్సవాలు చేస్తారు. మహాలయా పితృపక్షం ముగియగానే దేవతారాధన జరపడమంటే ఆ పితృదేవతలను తమకు ప్రసాదించిన ఆదిపరాశక్తిని భక్తితో త్రిమాతారూపంగా పూజించడం. అది ఒక యోగం. సమస్త జగత్తును పాలించేది ఆదిపరాశక్తి. ఈ పరాశక్తి త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, సరస్వతి, పార్వతియై లోకాలకు సకలసౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తోంది. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమినాడు వాగ్దేవి సరస్వతీపూజ. వేదమాతృకగా, జ్ఞానభూమికగా, సమస్త విద్యావాహికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం.

ఒక సంప్రదాయం ప్రకారం నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని 'శైలపుత్రి'గా పూజిస్తారు. రెండోరోజు తపోనిష్ఠతో పరమేశ్వరుని మెప్పించిన 'బ్రహ్మచారిణి'ని సేవిస్తారు. మూడోరోజు 'చంద్రఘంటాదేవి', నాలుగోరోజు 'కూష్మాండదేవి', అయిదోరోజు 'స్కందమాత', ఆరో రోజు 'కాత్యాయని'గా వ్యవహరిస్తారు. ఏడోరోజు దేవిని 'కాళరాత్రిదేవి'గా అర్చిస్తారు. ఎనిమిదోరోజు 'మహాగౌరి', తొమ్మిదోరోజు 'సిద్ధిధాత్రి'గా కొలుస్తారు. పదోరోజు 'విజయదశమి'. విజయదశమినాడు శ్రీరాముడు రావణ సంహా రం చేశాడని విశ్వాసం. అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవవీరులను ఓడించాడని మహాభారతం విరాటపర్వ ఉదంతం. విజయదశమినాటి శమీపూజ ప్రసిద్ధమే.

ఆశ్వయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి. దూడతో కూడిన ఆవును పూజిస్తారు. బహుళ తదియ అట్లతదియ. స్త్రీల పండుగ. బహుళ త్రయోదశి 'ధనత్రయోదశి' లక్ష్మీ పూజచేస్తారు. చతుర్దశినాడు సత్యాకృష్ణులు నరకాసురుని వధించిన కారణంగా 'నరకచతుర్దశి'గా భావిస్తారు. అమావాస్యనాడు 'దీపావళి'. బలిచక్రవర్తి గౌరవార్థం దీపావళి జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్కుని పట్టాభిషేకం జరిగిందనే ఒక గాథ ప్రచారంలో ఉంది. సూర్యుడు దీపావళినాడు తులారాశిని పొందుతాడని ఆరోజు ప్రజలు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనం చేయాలని 'ధర్మసింధు' చెబుతోంది. 'తమసోమాజ్యోతిర్గమయ' అనే ఉపనిషద్ వాక్యానికి ఆచరణ రూపం దీపావళి.

ఈ విధంగా దసరా, దీపావళి వాటి సంబంధమైన ఇతర పర్వాలతో ఆశ్వయుజం పండుగల పర్వమైంది.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు