ᐅవిశ్వరూపుడు వేంకటేశుడు




విశ్వరూపుడు వేంకటేశుడు 

భాద్రపదమాసం సౌరమానం ప్రకారం కన్యామాసం. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించే సమయమిది. ఈ కన్యామాసంలోనే బ్రహ్మదేవుడు శేషాద్రిపై శ్రీనివాసునికి ప్రథమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు పురాణాగమాలు వచిస్తున్నాయి.
ఆదికృతయుగంలో భాద్రపద సోమవారం ఏకాదశినాడు శేషాద్రిపై గోవిందుడు తన లీలాస్వరూపాన్ని ఆవిర్భవింపజేశాడని భవిష్యోత్తరపురాణ వచనం.

తొలి యుగాలలోనే భూమిని ఉద్ధరించిన యజ్ఞవరాహస్వామి తన క్రీడార్థమై సంకల్పించుకోగా, శేషుడు ఏడుమలకల మహాపర్వతంగా వెలశాడని పురాణగాథ. భూదేవి, బ్రహ్మదేవుడు ప్రార్థించగా లోకరక్షణార్థం శ్రీమన్నారాయణుడు ఈ పర్వతానికి విచ్చేశాడు. నాటినుంచి ఈ విస్తార పర్వతశ్రేణి దేవతావిహారాలకు, మహర్షుల తపస్సాధనలకు ఆలవాలమైంది.

ధర్మోద్ధరణకు శ్రీమహావిష్ణువును ప్రార్థించడానికి దేవతలు, రుషులు ఈ పర్వతంపై చేరారని పురాణాలు చెబుతున్నాయి. అనేక అవతారాలు ధరించడానికి సిద్ధమై సిద్ధులకు స్వామి అభయమిచ్చిన చోటిది. అన్ని అవతారాల సమన్వయమూర్తిగా, సర్వదేవతల సాకారస్వరూపంగా ప్రాచీనకాలం నుంచి శ్రీహరిని ఆరాధిస్తున్నారు.

కృతయుగంలో 'వృషాద్రి', త్రేతాయుగంలో 'అంజనాద్రి', ద్వాపరయుగంలో 'శేషాద్రి', కలియుగంలో 'వేంకటాద్రి'గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యపర్యతశ్రేణికి- రత్నాచలం, స్వర్ణాచలం, నారాయణాద్రి, వృషభాద్రి, గరుడాద్రి... ఇలా ఎన్నో నామాలను ప్రాచీన వాంగ్మయం పేర్కొంది.

కలియుగారంభంలో శ్రీనివాస నామంతో ఆదినారాయణుడు అర్చామూర్తిగా అవతరించాడని ఆగమోక్తి. అరుణ ఘనశిలావిగ్రహ రూపంలో ఆవిర్భవించిన జగన్మోహన మంగళమూర్తికి, ఉత్సవాదుల నిమిత్తం వివిధ ఉత్సవ మూర్తులను చతుర్ముఖ బ్రహ్మ ఏర్పాటుచేశాడనీ పురాణాలు చెబుతున్నాయి.

పదిరోజుల బ్రహ్మోత్సవాలు వివిధ వాహనాలపై స్వామి వైభవాన్ని కనులపండువగా ప్రత్యక్షం చేస్తాయి. శేష, గరుడ, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ... ఇత్యాది వాహనాలన్నీ శ్రీనివాసుని దివ్యత్వాన్ని తేటపరచడానికై ఏర్పాటైనవి. భూమిని ధరించే అనంతశక్తి, యోగిపరంగా కుండలిని- పరమాత్మునిచే శక్తిమంతమై పనిచేస్తున్నది. ఇది శేషవాహన పరమార్థం. వేదం గరుడస్వరూపం, వేదవేద్యుడు గరుడవాహనుడు. సూర్య మండల, చంద్ర మండలాలలోని ప్రకాశం పరమాత్ముడే. ఈ భావాన్నే సూర్యప్రభ, చంద్రప్రభలపై స్వామి ఊరేగింపు చాటి చెబుతోంది. బ్రహ్మాండాలన్నీ జగన్నాథుని మయం. ప్రత్యణువులు ఆయన చేతనే చైతన్యం పొందుతున్నది. 'సర్వవిష్ణుమయం' అనే పరమసత్యాన్ని చాటి చెప్పడానికే ఈ ఉత్సవాలు. 'బ్రహ్మ' శబ్దానికి- 'అన్నిటికంటె పెద్దది' అని అర్థం. దేన్ని మించి మరేదీ లేదో అదే బ్రహ్మం. ఆ బ్రహ్మం శ్రీనివాసుడు, ఆయన ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. 'అన్నింటిలోనూ పెద్ద వేడుకలివే' అనీ భావించవచ్చు. జగన్మోహిని, సరస్వతి... మొదలైన రూపాల్లోనూ స్వామిని సంభావించడం మరొక ప్రత్యేకత. దీన్నిబట్టి సర్వరూపాలూ తానై, ఏ రూపమూలేని పరతత్వమూ తానేనని వ్యక్తమవుతున్నాడు.

వైఖానసాగమ సంప్రదాయ ప్రకారం జరిగే ఉత్సవాల్లో వేంకటేశ్వరుని అర్చారీతులు పలు శోభలతో ప్రకాశిస్తాయి. చక్రస్నానంతో ముగిసే ఈ ఉత్సవాలు సుదర్శన తత్వానికున్న ప్రాముఖ్యాన్ని విశదపరుస్తున్నాయి.

పరమాత్మ జ్ఞానమే సుదర్శనం. జ్ఞానంతో అనుభవమయ్యే పరతత్వమే గోవిందుడు. విష్ణువైభవాన్ని దర్శింపజేసే జ్ఞానమూర్తి చక్రదేవుడు. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవాది వివిధ శోభలు విలసిల్లజేస్తున్న ఈ దివ్య గిరిశిఖరాలలో నేటికీ అనేక దుర్గమ పుణ్యతీర్థాలు, దివ్యారణ్యాలు శోభిల్లుతున్నాయి. వేంకటేశుని విహారభూములైన ఈ స్థలాల్లో ఇప్పటికీ కొన్ని కైంకర్యాలు జరుగుతున్నాయి.

వైకుంఠ దివ్యభూమికతో, ఏదో ప్రగాఢానుబంధమున్న పవిత్ర శక్తిమంతమైన ఈ క్షేత్రంలో ప్రతిశిలా వేదమయంగా, విష్ణుస్వరూపంగా దర్శించిన మహాత్ములున్నారు. పుణ్యభావాలు తీర్థాలుగా, విష్ణురూపాలు శిలలుగా, తపశ్శక్తులే వృక్షాలుగా వెలసిన శ్రీమయ పర్వతమిది... అని అన్నమయ్య అనేక కీర్తనల్లో వర్ణించాడు. 'వేదములే శిలలై వెలసినదీ కొండ, ఏదెస పుణ్యరాసులే యేరులైనదీ కొండ' 'మొగిలి చుట్టుమాకులు మునులోయమ్మ'- అని హరి సంకీర్తనాచార్యుని దివ్యదృష్టి. ఈ కొండపై ప్రతిరాయి 'సాలగ్రామమే' అని శాస్త్రోక్తి.

అన్ని అవతారాలనీ ఏకంచేసి జగతిని అనుగ్రహించే శ్రీనివాసుని విశ్వరూపానికి నమోనమః

- సామవేదం షణ్ముఖశర్మ